Let's talk: editor@tmv.in
భారతీయుల మెడపై కత్తి

భారతీయుల మెడపై కత్తి

FL - TRND
7 అక్టోబర్, 2025

అమెరికా తర్వాత యూరప్, ఆస్ట్రేలియాలోనూ వలసదారులపై ప్రతికూల వాతావరణం బలపడుతోంది. కొన్ని వారాలుగా వీధుల్లో పెద్ద పెద్ద ర్యాలీలు, ఆన్‌లైన్‌లో కఠిన వ్యాఖ్యలు, రాజకీయ వేదికలపై కఠోర ప్రసంగాలు పెరుగుతున్నాయి. వలస విధానాలపై కఠిన వైఖరి కోరుతున్న వర్గాలు ఒకవైపు ఒత్తిడి పెంచుతుంటే, మరోవైపు వలసదారుల సమూహాలు భద్రత, గౌరవం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మొత్తం వాతావరణంలో భారతీయుల పేర్లు తరచూ చర్చకు వస్తున్నాయి. ఐటీ, ఆరోగ్యం, ఇంజినీరింగ్, చిన్న వ్యాపారాలు లాంటి రంగాల్లో, భారత సంతతి పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న దేశాల్లో ఈ చర్చ మరింత వేగం తీసుకుంది.

యూరప్‌లోని ప్రధాన నగరాల్లో వలస వ్యతిరేక నిరసనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం జరిగిన ర్యాలీకి సుమారు లక్షా 50వేల మంది హాజరయ్యారు. అదే సమయంలో నిరసనకారులు పోలీసు వాహనాన్ని తగలబెట్టగా, భద్రత దళాలు వాటర్ క్యానన్లు వాడాల్సి వచ్చింది. అనేక దేశాలు మళ్లీ తాత్కాలిక సరిహద్దు తనిఖీలు చేపడుతూ, సముద్ర మార్గాల్లో వచ్చే పడవలపై అదనపు నిఘా పెంచుతున్నాయి. 2015 సంక్షోభం తర్వాత వలసల ప్రవాహం గణాంకాల పరంగా తగ్గినా, భయం-అనిశ్చితి మాత్రం సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న వారిలో సుమారు 32,000 మంది హోటల్ వసతుల్లో ఉంటున్నారు. గత సంవత్సరం ఈ సంఖ్య 51,000 దాటింది. అధికార లెక్కలు క్రమంగా తగ్గుదల చూపుతున్నా, స్థానిక వాగ్దానాలతో పోలిస్తే భారం ఇంకా ఎక్కువగానే ఉందన్న భావన ఉంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న సంఘటనే పెద్ద వాగ్వాదాలకి కారణమవుతోంది. కొన్నిసార్లు నేరాలుగా మారిన ఘటనలు మొత్తం వలస సమాజాన్నే లక్ష్యంగా చేసుకునేలా ఆయుధంగా మారుతోంది. ఇటు ఆస్ట్రేలియాలో వలస చర్చ అక్కడి ఎన్నికల సమారానికి చేరింది. ఒక సమయంలో వలసదారులపై ప్రశంసలే వినిపించినప్పటికీ.. ప్రస్తుతం సంఖ్య తగ్గించాలని కోరే స్వరాలు పెరిగాయి. ఐర్లాండ్‌లో ఇటీవలి నెలల్లో భారతీయులపై దాడుల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. జర్మనీలో ఇంజినీర్లు, ఆరోగ్య రంగంలో నర్సులు, వైద్యులు, నెదర్లాండ్స్‌లో రెస్టారెంట్ వ్యాపారులు, ఇటలీలో చిన్న దుకాణదారులు భారీ సంఖ్యలో పనిచేస్తున్నా.. వారి రోజువారీ జీవితాన్ని అంచనా వేయలేని అస్థిరత కనిపిస్తోంది.

అమెరికాలో వలస చర్చ రాజకీయ వేదికలపై మరింత కఠినంగా వినిపిస్తోంది. పని వీసాల ఫీజులు పెరగడంతో ఉద్యోగ మార్గాలను కుదించడం ప్రారంభమైంది. హెచ్‌-1బీ వీసాకు వార్షికంగా లక్ష డాలర్ల ఫీజు ప్రతిపాదన చిన్న సంస్థలకి తీవ్రమైన భారంగా మారింది. ఈ వీసాల్లో సుమారు 70శాతం భారతీయులు ఉండటంతో ప్రత్యక్ష ప్రభావం ఎక్కువ. మరోవైపు ఆన్‌లైన్ వేదికల్లో కూడా విద్వేషాన్ని రగిలించే పోస్టులు పెరగడంతో అక్కడే ఉన్న ప్రజలు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో భారతీయులపై చూపులన్నీ పడటానికి మరో కారణం ఉంది. ఉన్నత విద్య, అధిక సగటు ఆదాయం, నాయకత్వ స్థానాల్లోకి ఎదగడం లాంటి అంశాలతో భారతీయులు లక్ష్యంగా మారారు.

అయినా ఓ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. వలస సమాజాలు.. ఆతిథ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకి కీలక స్తంభం. ఆస్పత్రుల్లో రాత్రింబవళ్లు సేవలు అందించే నర్సులు, అత్యవసర చికిత్సలో పనిచేసే వైద్యులు, డేటా సెంటర్లను నడిపే ఇంజినీర్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఇచ్చే డెవలపర్లతో పాటు చిన్న వ్యాపారులు సైతం పన్నులు కడతారు. ఎన్నికల్లో పాల్గొంటారు, స్థానిక సమాజంలో కలిసిపోతారు. వీసా మోసాలు, రాజకీయ జోక్యం, దోపిడీల లాంటి సమస్యలను పూర్తిగా లేనట్టుగా చెప్పలేం. కానీ వాటి పేరుతో లక్షల మందిని ఒకే తూకంలో కొలవడం న్యాయం కాదు. మంచి, చెడు కలిసిన సమాజంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలే సరైన మార్గం. అలా చేయకుండా మిగతా సమాజంపై సామూహిక నిందలతో బాధను రెట్టింపు చేయడం కరెక్ట్ కాదు. మరి ఇతర దేశాలు ఈ విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాయో చూడాలి మరి!

భారతీయుల మెడపై కత్తి - Tholi Paluku