Let's talk: editor@tmv.in
భారతీయుల ఆలోచనకు ఇగ్ నోబెల్ సలాం

భారతీయుల ఆలోచనకు ఇగ్ నోబెల్ సలాం

FL - TRND
11 అక్టోబర్, 2025

ఒరేయ్‌ మావా.. నీ షూస్‌ కంపు కొడుతున్నాయ్ రా.. వాష్‌ చేయలేదా..? ఈ ప్రశ్న చాలా మంది ఫ్రెండ్స్‌ దగ్గర వినిపిస్తుంటుంది. ఇటు ఇంట్లో కూడా షూ ర్యాక్‌ కంపుకొడుతూనే ఉంటుంది. చాలా షూస్‌ ఒకే చోట పెట్టడం కారణంగా ఇలా జరుగుతుంటుంది. నిజానికి బూట్లు లేని ఇల్లు చాలా అరుదు. వాటిని తీయగానే వచ్చే ఆ వాసన ఎవరికీ ఇష్టం ఉండదు. వెరొకరి బూట్లు వాసన వస్తే కూడా భరించలేం. అయితే ఈ చిన్న అసౌకర్యం ఒక పెద్ద పరిశోధనకు కారణమవుతుందని మీరెప్పుడైనా ఊహించారా? అవునండీ.. నిజమే..! ఇద్దరు భారతీయులు ఆ వాసన వెనుక ఉన్న శాస్త్రాన్ని గమనించారు. ఆ శాస్త్రమే వారికి ఇగ్-నోబెల్ ప్రైజ్ అనే ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.

ఇగ్ నోబెల్ ప్రైజ్ అనేది సాధారణ అవార్డు కాదు. ఈ అవార్డు మొదట కాస్త నవ్వు తెప్పించే విధంగా ఉన్నా.. ఆ తర్వాత ఆలోచింపజేసే శాస్త్రీయ పరిశోధనలకు ఇచ్చే ప్రైజ్‌ అన్నమాట. ఈ అవార్డులను అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఇస్తారు. ఉద్దేశ్యం ఒకటే.. శాస్త్రం సరదాగా కూడా ఉండొచ్చు అని చూపించడం. మనం ప్రతిరోజూ చూసే చిన్న విషయాల వెనుక కూడా సైన్స్ దాగి ఉందని గుర్తు చేయడం. ఢిల్లీకి దగ్గరలో ఉన్న షివ్ నాడార్ యూనివర్సిటీలో డిజైన్ ప్రొఫెసర్ వికాస్ కుమార్, ఆయన విద్యార్థి సార్థక్ మిత్తల్ ఒకరోజు హాస్టల్‌లో తిరుగుతూ ఉన్నప్పుడు బూట్ల వాసనను పీల్చారు. గదుల బయట వరుసగా బూట్లు కనిపించాయి. విద్యార్థులు తమ రూమ్‌ లోపల స్థలం లేక వీటిని బయట పెట్టలేదు. నిజానికి బూట్ల వాసనే వీటిని రూమ్‌ బయట పెట్టడానికి కారణం. ఆ వాసన వల్లే వాళ్లు వాటిని గదికి లోపల పెట్టడానికి ఇష్టపడరు.

దీంతో ఈ ఇద్దరూ బూట్లకు ఎందుకు దుర్వాసన వస్తుందనే దానిపై అధ్యయనం మొదలుపెట్టారు. బూట్లలో చెమట తడిగా ఉండటం, వాటిలో బ్యాక్టీరియా పెరగడం ప్రధాన కారణమని తెలిసింది. ముఖ్యంగా కైటోకాకస్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా చెమటతో తడిచిన షూలలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు దుర్వాసనకు కారణమవుతాయి. ఇప్పుడు వీటిని ఎలా చంపాలనే ప్రశ్న వచ్చింది. దీంతో యూవీసీ లైట్‌తో ప్రయత్నం చేశారు. యూవీసీ లైట్ అనేది సూక్ష్మజీవులను చంపగలిగే ప్రత్యేక కాంతి. వారు ఒక షూ ర్యాక్‌లో యూవీసీ ట్యూబ్ లైట్ అమర్చి ప్రయోగం చేశారు. మొదట రెండు నిమిషాలపాటు కాంతి వేయగానే వాసన కొంత తగ్గింది. నాలుగు నిమిషాలకు దాదాపుగా పోయింది. ఆరు నిమిషాలకు వాసన పూర్తిగా మాయం అయ్యింది. కానీ ఎక్కువసేపు వేస్తే షూ వేడెక్కి రబ్బర్ కాలిపోయిన వాసన వచ్చింది. అంటే దీని అర్థం.. ఒక నిర్దిష్ట సమయం పాటిస్తే దుర్వాసనను పూర్తిగా తొలగించవచ్చని వికాస్, సార్థక్ నిర్ధారించుకున్నారు.

ఇది నిజానికి సరదాగా మొదలైన ప్రయోగమే. కానీ ఫలితంగా ఒక కొత్త ఆలోచన పుట్టింది. యూవీసీ లైట్‌తో బూట్లు క్లీన్ చేయగలిగే ర్యాక్ తయారు చేశారు. బయట నుంచి వచ్చిన తర్వాత బూట్లను అందులో పెడితే అవి క్లీన్ అవుతాయి. క్రీడాకారులు లేదా ఎక్కువగా చెమట పట్టేవారు ఉపయోగించే షూలకు ఇది చాలా బెస్ట్. ఈ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వీరి పరిశోధనను ఇగ్ నోబెల్ కమిటీ గుర్తించింది. హార్వర్డ్ యూనివర్సిటీ వేదికగా వారిని అవార్డుతో సత్కరించింది. అందుకే సైన్స్ సరదాగా కూడా ఉండొచ్చు.. చిన్న సమస్యలను గమనిస్తే పెద్ద పరిష్కారాలు దొరుకుతాయి కూడా.

ఇలా వికాస్, సార్థక్ ఎపిసోడ్‌ ఒక అందమైన మెసేజీని ఇస్తుంది. మనకు సాధారణంగా అనిపించే సమస్యల్లోనే కొత్త ఆవిష్కరణల ఆరంభం ఉంటుంది. ఎవరికీ పట్టని బూట్ల వాసన కూడా ఒకరోజు శాస్త్రీయ పురస్కారానికి కారణమవుతుందంటే సైన్స్‌కి హద్దులు లేవని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే ముందుగా ఆలోచన బ్రెయిన్‌లో తట్టాలి.. అప్పుడు అటోమెటిక్‌గా ఆసక్తి పుడుతుంది.. ఆ తర్వాత మిగతావన్నీ సాధ్యమే. ఇవాళ మనం దుర్వాసనగా భావించిన షూలే రేపు ప్రపంచానికి కొత్త ఆవిష్కరణగా మారాయి. అదే ఇగ్ నోబెల్ ప్రైజ్ చెప్పే అసలు అర్థం.. అందుకే నవ్వుతూ నేర్చుకోండి, సరదాగా సైన్స్‌ని ప్రేమించడం మాత్రం మర్చిపోకండి.

భారతీయుల ఆలోచనకు ఇగ్ నోబెల్ సలాం - Tholi Paluku