Let's talk: editor@tmv.in
భారతీయత అన్నా.. హిందుత్వమన్నా ఒక్కటే: మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ మద్దతు

భారతీయత అన్నా.. హిందుత్వమన్నా ఒక్కటే: మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ మద్దతు

Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026

భారతదేశ చరిత్రను, సంస్కృతిని విశ్లేషించడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రజలకు తప్పుడు అవగాహన కల్పించారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ శనివారం ముంబైలో చేసిన హిందూ ఐక్యత, హిందూ రాష్ట్రం వ్యాఖ్యలను ఆయన ఆదివారం సమర్థించారు.

హైదరాబాద్‌లో రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, హిందూ అనేది ఒక మతాన్ని సూచించే పదం కాదు, అది జీవన విధానం. ఈ భూమిలో నివసించే ప్రతి ఒక్కరికీ ఇది ఒక సాంస్కృతిక, నాగరిక గుర్తింపు అని ఆయన అన్నారు. భారతదేశం అనేది వేల సంవత్సరాల పురాతన నాగరికతతో కూడిన దేశమని, “భారతవర్షం” అనే భావన దేశ భౌగోళిక పరిధిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ఆయన ప్రకారం, విదేశీ దండయాత్రలు, ముఖ్యంగా మొఘల్, బ్రిటిష్ పాలన కాలంలో భారతీయ సంస్కృతి దెబ్బతిన్నదని అన్నారు. ఆ తరువాత కాలంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకత్వం భారత చరిత్రను తప్పుగా అర్థం చేసుకునేలా ప్రజల్లో భావనలు పెంచిందని విమర్శించారు. మోహన్ భాగవత్ చెప్పిన విషయాలపై ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు.

మరోవైపు, ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ హిందూ రాష్ట్రం అనే భావనపై మాట్లాడారు. ఆయన అభిప్రాయం ప్రకారం, హిందూ రాష్ట్రం అనేది రాజకీయ పరమైన నిర్వచనం కాదని, దేశం కోసం నిస్వార్థ భావంతో పని చేయాలని పిలుపునిచ్చే సాంస్కృతిక ఆలోచన అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే ప్రచారం లేదా వదంతుల ఆధారంగా కాకుండా, ప్రత్యక్షంగా సంఘ్ కార్యకలాపాలను పరిశీలించాలని ఆయన సూచించారు. సంఘ్ కార్యకర్తల జీవన విధానం, శాఖలు, కార్యక్రమాలను గమనిస్తే సంస్థ లక్ష్యాలు స్పష్టమవుతాయని ఆయ‌న‌ అన్నారు.

భాగవత్ మాట్లాడుతూ హిందూ అనే పదం మతపరమైనది కాదని, అది భారతీయ నాగరికతను సూచించే విశేషణమని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరు ఏ మతాన్ని అనుసరించినా, జీవనశైలి ఎలా ఉన్నా, ఈ దేశ సంస్కృతితో అనుసంధానమై ఉన్నంతవరకు అందరూ ఒకే నాగరికతకు చెందినవారేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియన్ లేదా హిందూ అనే పదాలు ఈ సందర్భంలో ఒకే భావనను సూచిస్తాయని ఆయన అన్నారు.

దేశంలో మతాల మధ్య కలహాలు తరచూ జరుగుతున్నాయని పేర్కొంటూ, అయినప్పటికీ దేశం ఒక్కటిగానే నిలిచిందని ఆయన చెప్పారు. ఒక దశలో సామూహిక ఆత్మను మర్చిపోయినప్పుడు మాత్రమే విభజన చోటుచేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందుత్వ భావజాలం ప్రతి మతానికీ భద్రతను కల్పించే స్వభావం కలిగినదని ఆయన అన్నారు.

భారతదేశానికి ఒకే ఒక రాజ్యాంగం ఉంది. భారతీయ మేధస్సు ఆలోచనల నుంచే ఇది పుట్టింది. దేశ విభజన సమయంలో ముస్లింలకు, హిందువులకు వేర్వేరు భాగాలుగా దేశం విడిపోయింది. విడిపోయిన పాకిస్థాన్ తనను తాను 'ముస్లిం దేశం'గా ప్రకటించుకుంది. ఆ తర్వాత పాకిస్థాన్ ముక్కలై బంగ్లాదేశ్ ఏర్పడింది, అది కూడా చివరికి ముస్లిం దేశంగానే మారింది. కానీ, మనం మాత్రం అందరినీ కలుపుకుపోయే దేశంగా ప్రకటించుకున్నాం. ఎందుకంటే మనం హిందువులం. అలా చేయడం తప్పని కొంతమంది అంటారు. కానీ, అది హిందూ స్వభావం వల్లే సాధ్యమైంది. 'వసుధైవ కుటుంబకం' (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే మన తత్వం వల్లే మనం అందరినీ ఆదరించాం. ఒక రకంగా చెప్పాలంటే, మన రాజ్యాంగం అనేది మనం అనుసరించే ధర్మానికి ఒక ఆధునిక రూపం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయ‌న అన్నారు.

“హిందూ–ముస్లిం ఐక్యత” అనే పద ప్రయోగంపై కూడా భాగవత్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐక్యత అనేది వేర్వేరు అంశాలను కలపడానికి ఉపయోగించే పదమని, భారతదేశంలోని సమాజాలు అసలు నుంచి ఒకటేనని ఆయన చెప్పారు. ప్రజలు తమ సాధారణ మూలాలను మర్చిపోయారని, వాటిని మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పరస్పర గౌరవం, సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ఇతర మతాలను అవమానించడం హిందూ స్వభావం కాదని, పరస్పర గౌరవం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని భాగవత్ పేర్కొన్నారు. భాష, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, ప్రాంతీయ భేదాలు ఉన్నప్పటికీ, భారత సమాజం ఒకే సంస్కృతితో అనుసంధానమై ఉందని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాల కోసం నిజాయితీతో, నిస్వార్థంగా పనిచేయడం ద్వారా సమాజంలో ఐక్యత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం కూడా మోహన్ భాగవత్ వ్యాఖ్యలను సమర్థిస్తూ, భారత చరిత్ర, సంస్కృతిపై విస్తృత చర్చ అవసరమని పేర్కొంటోంది.

భారతీయత అన్నా.. హిందుత్వమన్నా ఒక్కటే: మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ మద్దతు - Tholi Paluku