
భారతదేశ ఉపాధి గణాంకాల ప్రకటనల నేపథ్యంలో వాస్తవ దృశ్యం
భారత ప్రభుత్వం ఇటీవల ఐదేళ్లలో దాదాపు 17 కోట్ల ఉపాధి అవకాశాలు సృష్టించామని ప్రకటించింది. సంఖ్యల పరంగా చూస్తే ఇది కోవిడ్ అనంతర ఆర్థిక పునరుద్ధరణకు సంకేతంగా కనిపిస్తుంది. కానీ ఆ లెక్కల గొప్పల వెనుక ఉన్న వాస్తవం మాత్రం సంక్లిష్టంగా ఉంది ఉపాధి రంగంలోని మార్పులు, అసంఘటిత రంగంలో ఉపాధి పెరుగుదల, అసమాన ఆర్థిక పురోగతి మొదలగు వాటి వల్ల ఈ అంశం సంక్లిష్టమైనది.
ఉపాధి కల్పన భారతీయ రాజకీయ వ్యవస్థలో ఉపాధి ఒక్క ఆర్థిక అంశం మాత్రమే కాదు; పాలన యొక్క ప్రామాణిక కొలమానం కూడా. ప్రతి ప్రభుత్వం తాను ఉద్యోగాలను తీసుకువచ్చిందని చెబుతుంది, కాని “సృష్టించిన ఉద్యోగాలు” అనే నిర్వచనం మాత్రం మసకబారిపోయింది. ఈ 17 కోట్లు నిజంగా జీతభత్యాలతో కూడిన స్థిర ఉద్యోగాలా? లేదా స్వయం ఉపాధి, గిగ్ వర్క్, పార్ట్ టైం పనులా? అనే అంశాలు పరిశీలిస్తే మనకు వేరే చిత్రం కనబడుతుంది.
మారుతున్న శ్రమ మార్కెట్లో భారతదేశ జనాభా ఒకవైపు అవకాశంగా, మరోవైపు ఒత్తిడిగా మారింది. నెలకు సుమారు పది లక్షల కొత్త యువత ఉద్యోగ మార్కెట్లో అడుగుపెడుతుంది. ఉపాధి సృష్టి కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు, ఇది జాతీయ అవసరం కూడా. కానీ ఉపాధి స్వరూపం వేగంగా మారుతోంది.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం నిరుద్యోగం కొద్దిగా తగ్గినా, ఆ తగ్గుదల ప్రధానంగా స్వయం ఉపాధి మరియు కూలీ పనుల పెరుగుదల వల్లే రావడం గమనార్హం. ప్రస్తుతం భారత శ్రామిక శక్తిలో దాదాపు 52 శాతం మంది స్వయం ఉపాధిలో ఉన్నారు. చాలామందికి ఇది స్వచ్ఛంద ఎంపిక కాదు, సంఘటిత రంగంలో అవకాశాలు లేక తప్పనిసరిగా ఈ మార్గంలోకి వస్తున్నారు. కొత్తగా ఏర్పడిన డిజిటల్, గిగ్ వ్యవస్థలతో ఇటీవలి కాలంలో డెలివరీ, రైడ్ షేరింగ్, ఫ్రీలాన్స్ వంటి గిగ్ ఆధారిత పనులు విస్తరించాయి. స్టార్ట్-అప్స్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు లక్షల మందికి ఉపాధి కల్పించాయి. కానీ ఈ ఉద్యోగాలకు సామాజిక భద్రత, పెన్షన్ లేదా స్థిరత్వం లేకపోవడం ఆందోళనకర అంశం. ఉద్యోగం, దోపిడీ మధ్య గీత మాయమైపోయింది. పట్టణ యువత డిజిటల్ మార్పులతో కొంత మేరకు లాభపడగా, గ్రామీణ ప్రాంతాలు ఈ కొత్త ఆర్థిక విధానంలో పరిమిత ప్రయోజనం పొందాయి.
“న్యూ ఎకానమీ” వాగ్దానం సమానంగా విస్తరించలేదని చెప్పడం తప్పు కాదు.తయారీ రంగం – అందని మానవ ఉపాధి స్వప్నం“మేక్ ఇన్ ఇండియా” 2014లో ప్రారంభమైనప్పుడు, దీని ప్రధాన లక్ష్యం విస్తృత ఉపాధి కల్పించడం. కానీ నేటికి తయారీ రంగం జీడీపీ లో వాటా 15–17 శాతం మధ్యనే నిలిచిపోయింది. ఆటోమేషన్, అంతర్జాతీయ పోటీ కారణంగా ఫ్యాక్టరీలు తక్కువ మంది కార్మికులను నియమిస్తున్నాయి. నైపుణ్య అవసరాలు, మార్కెట్ అవసరాల మధ్య ఖాళీ ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉంది. నైపుణ్య అభివృద్ధి పథకాలు సంఖ్యలో పెరిగినా, వాటి ప్రభావం పరిమితం గానే ఉంది.
వ్యవసాయం – ప్రచ్ఛన్న నిరుద్యోగిత
దేశపు 43 శాతం జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడుతోంది, కానీ ఈ రంగం జాతీయ స్థూల ఉత్పత్తిలో కేవలం 18 శాతం మాత్రమే అందిస్తోంది. ఉద్యోగ గణాంకాల్లో వ్యవసాయంలోనివారూ లెక్కించబడ్డారు. కానీ ఇది నిజమైన ఉత్పాదక పని కాదు తక్కువ పనిలో ఎక్కువ మంది నిమగ్నమయ్యే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జీని ఆర్‌ఈజీఏ) ఇలాంటి పరిస్థితుల్లో సహజ భద్రతా వలయంగా మారినప్పటికీ, అది తాత్కాలిక ఉపశమనం కాక స్థిర ఆధారంగా పరిణమించింది. తయారీ, నిర్మాణ రంగాల మందగమనం వల్ల గ్రామీణ యువతకు బయటకి వెళ్లే దారి కష్టమైంది.
మహిళల ఉపాధి
భారత ఉపాధి అంశంలో అత్యంత సున్నితమైన అంశం మహిళల భాగస్వామ్యం. ప్రస్తుతం మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం 25 శాతం వుంటున్నది. కుటుంబ భారాలు, సామాజిక నిబంధనలు, భద్రతా అంశాలు వీరిని పనికి దూరంగా ఉంచుతున్నాయి. కరోనా సమయంలో అనేక మహిళలు అసంఘటిత రంగ పనుల్లో చేరినా, పరిస్థితులు కొద్దిగా మెరుగయ్యాక తిరిగి బయటకు వచ్చారు. మహిళల భాగస్వామ్యం లేకుండా దేశం యొక్క జనాభా లాభం “డెమోగ్రాఫిక్ డివిడెండ్” కాక, “డెమోగ్రాఫిక్ బర్డెన్” కావచ్చు.
గణాంకాలు, నిర్వచనాలు
ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల గణాంకాలు EPFO, ఈ-శ్రమ్, ముద్రా లోన్లు, PLFS వంటి వేర్వేరు మూలాలపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఇవన్నీ శ్రమ మార్కెట్‌లోని కొంతభాగాన్నే ప్రతిబింబిస్తాయి. EPFO రిజిస్ట్రేషన్లు చాలాసార్లు కొత్త ఉద్యోగాలు కాక, పాత ఉద్యోగులు మారినవే అవుతాయి. అలాగే ముద్రా లోన్ వలన సుస్థిర జీవనోపాధి ఏర్పడిందని చెప్పలేం. ఉపాధి గణాంకాల కంటే “ఉద్యోగాల నాణ్యత”పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం .ప్రపంచ పరిస్థితులు మరియు దేశీయ ఒత్తిడులు, యుద్ధాలు, రక్షణాత్మక వాణిజ్య ధోరణులు, గ్లోబల్ మందగమనం వంటి అంశాలు వస్త్ర , తోళ్లు, ఆభరణాలు రంగాలపై ప్రభావం చూపాయి. అదే సమయంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆటోమేషన్ తక్కువ నైపుణ్య పనులను తగ్గిస్తోంది. భారత ప్రభుత్వం పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు పెంచి తాత్కాలిక ఉపాధిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నా, దీర్ఘకాలిక స్థిర వ్యవస్థలు ఇంకా అభివృద్ధి చెందలేదు.
ప్రస్తుత సవాలు- జవాబులు
1. వినియోగ కేంద్రిత వృద్ధి నుంచి ఉత్పత్తి కేంద్రిత వృద్ధికి మారడం.
2. సంఖ్యలకు మించి ఉపాధి సమస్య పరిష్కారానికి సమగ్ర వ్యూహం అవసరం.
3. లేబర్-ఇంటెన్సివ్ తయారీ రంగాలను సులభమైన నియమాలు, గ్లోబల్ విలువ గొలుసులో చేర్చడం ద్వారా ప్రోత్సహించాలి.
4. నైపుణ్యాభివృద్ధి కేవలం శిక్షణ కాక, మార్పుకు సరిపడే అనుకూలతను కలిగించాలి.
5. శ్రామిక శక్తి ఫార్మలైజేషన్ వేగవంతం చేయాలి, సామాజిక భద్రత అందించాలి.
6. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పిల్లల సంరక్షణ సదుపాయాలు, సురక్షిత పబ్లిక్ స్పేస్‌లు మరియు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్స్ అవసరం.
7. వ్యవసాయంలో విభిన్నత, అగ్రి-ఎంట్రప్రెన్యూర్షిప్ కు రుణాలు, మార్కెట్ యాక్సెస్ వంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి.
ఉద్యోగం కేవలం గణాంకం కాదు అది సమాజ స్థిరత్వానికి, ప్రజాస్వామ్య నమ్మకానికి పునాది. 17 కోట్ల “ఉపాధి సృష్టి” ప్రకటన రాజకీయంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, భారతీయ ఉపాధి కథ మరింత లోతైనది అది కోట్లాది మంది కేవలం పనికోసం కాదు, గౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం చేసే నిరంతర ప్రయత్నం
