
భారతదేశ ఆత్మ ‘భిన్నత్వంలో ఏకత్వం’
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ఆత్మ అని, ఆ బలం విచ్చిన్నమైతే దేశం బలహీనపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ వివరిస్తూ దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారని, వారి నుంచి దేశం పెద్ద ముప్పు ఎదుర్కొంటుందన్నారు. దీని వల్ల జనాభా పెరుగుదలలో కూడా మార్పు వస్తుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకే ఢిల్లీలోని ఎర్రకోటనుంచి డెమోగ్రాఫిక్ మిషన్ ను ప్రకటించామన్నారు. చొరబాటు దారులు సామాజిక ఐక్యతను దెబ్బతీసి, అంతర్గత భద్రతకు ఇబ్బందులు కలిగిస్తారని ఆయన వెల్లడించారు.
ఆర్ఎస్ఎస్ పాత్ర అనిర్వచనీయం
దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ నిర్మాణంలో నిబద్ధతో పనిచేసిందని, అనేక సంవత్సరాలుగా ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. మానవ నాగరికతలు గొప్ప నదీ తీరాల వద్ద ప్రారంభమైనట్లే, చాలా మంది జీవితాలు ఆర్ఎస్ఎస్ అనే నది ప్రవాహ ఒడ్డులో వికసించాయని కొనియాడారు. 1925 లో ఏర్పడినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఓ గొప్ప లక్ష్యంతో పనిచేసింది. దేశ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగింది.
విజయదశమినాడు స్థాపించడం యాదృచ్చికంగా జరిగిందని, చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం, అబద్దాలపై సత్యం, చీకటిపై వెలుగు విజయానికి ప్రతీక అన్నారు. ఈ సందర్భంగా కేబీ హెడ్గేవార్ చేసిన దేశ సేవను, అంకితభావాన్ని ప్రశంసించారు. ఆయనకు నివాళులర్పించారు. సంఘ్ వ్యవస్థాపకుడు, ఆదర్శవంతమైన వ్యక్తి, అత్యంత ఆరాధనీయుడు డాక్టర్ హెడ్గేవార్ జీ పాదాలకు నా వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను" అని ప్రధాని మోదీ ఉద్వేగంగా అన్నారు.
సంఘ్ శతాబ్ది సంవత్సరం జరుపుకుంటున్న వేడుకల్లో మనం పాల్గోనడం మా తరానికి లభించిన గొప్ప అదృష్టమని ప్రధాని మోడీ అన్నారు. లక్షలాది స్వచ్ఛంద సేవకులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ఉన్న వివిధ శాఖలు ఒకదానితో ఒకటి విబేధించుకోకుండా పనిచేస్తాయని, ఆర్ఎస్ఎస్, దాని వెన్నంటి ఉండే శాఖల లక్ష్యం,సారాంశం మాత్రం ‘దేశం ముందు’ అన్నారు. దేశ సేవలో నిరంతరం ప్రయాణిస్తున్న సంస్థకు ప్రధాని మరోసారి అభినందనలు తెలిపారు.
కరెన్సీపై మొదటిసారి భరతమాత చిత్రం
ఈ ఉత్సవాల సందర్భంగా స్మారక తపాలా బిళ్లను, రూ.100 నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణేనికి ఒకవైపు జాతీయ చిహ్నం, మరొకవైపు సింహపై కూర్చున్న భరతమాత ‘వరద్ ముద్ర’ ఉన్నాయి. దాంతోపాటే స్వయం సేవకులు ఆమెకు అంకితభావంతో ప్రణమిల్లుతున్నట్లు ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన దేశ కరెన్సీపై భరతమాత చిహ్నన్ని రూపోందించడం మొదటిసారి కావడం గమనార్హం. అలాగే ప్రత్యేక పోస్టల్ స్టాంపు కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. 1963లో గణతంత్ర దినోత్సవ పరేడ్ పాల్గొన్న స్వయం సేవకుల ఫోటో దానిపై ముద్రించారు. ఆ చారిత్రక సందర్బాన్ని దీనిపై చిత్రికరించినట్లు ప్రధాని వివరించారు.
