Let's talk: editor@tmv.in
భారతదేశానికి నోబుల్ బహుమతి మళ్లీ ఎప్పుడు?ఎలా?

భారతదేశానికి నోబుల్ బహుమతి మళ్లీ ఎప్పుడు?ఎలా?

Dr.Chokka Lingam
9 అక్టోబర్, 2025

గత రెండు రోజులుగా ప్రకటించిన 2025 నోబెల్ బహుమతులు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, శాంతి ఉద్యమకారులు తమ కృషితో ఈ గుర్తింపును పొందారు. అయితే, అతి పెద్ద జనాభా జనాభా, గొప్ప ప్రతిభ ఉన్న భారత దేశం ఎందుకు అరుదుగా నోబెల్ వేదికపై నిలుస్తుంది?

భారతకు నోబెల్ బహుమతులతో పరిచయం కొత్తేమీ కాదు . 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో మొదటి ఆసియా విజేతగా నిలిచారు. 1930లో సి.వి.రామన్ భౌతికశాస్త్రంలో నోబెల్ సాధించారు. ఆ తర్వాత మదర్ థెరెసా, అమర్త్యసేన్, కైలాష్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ వంటి కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని పొందారు. ఈ జాబితా భారతదేశ విస్తారమైన మేధస్సుకు సరితూగేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది? నోబెల్ మన దేశానికి ఎందుకు రానంటుంది?

దీనికి ప్రధాన కారణం చారిత్రక మరియు వ్యవస్థాపక పరిమితులు అనాలేమో. వలస పాలనా కాలంలో విద్యా వ్యవస్థ, పరిపాలన అనేవి వారి అవసరాలకే పరిమితమై, శాస్త్రీయ ఆవిష్కరణల కోసం బలమైన పునాదులు పడలేదు. మౌలిక వసతులు కల్పన జరగలేదు. స్వాతంత్ర్యం తర్వాత కూడా సాంకేతిక పరిశోధనలకు సరైన ప్రోత్సాహం దొరకలేదు. ఇప్పటికీ భారతదేశం పరిశోధన, అభివృద్ధి పై పెట్టే ఖర్చు జిడిపీలో 1% లోపే ఉంది. మన దేశంలో ఆధునిక ప్రయోగశాలలు, పరికరాలు, నిధులు ఇవన్నీ పరిమితంగానే ఉన్నాయి.

మరో అతి పెద్ధ సమస్య విద్యా వ్యవస్థలో దాగి ఉంది. మన పాఠశాలలు, కళాశాలలు ప్రశ్నించే విద్యా సంస్కృతిని కాకుండా, పరీక్షలు రాయడం, ఉన్న విషయాన్ని మూసగా బట్టీ పట్టడం లాంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి. పెరిగిన ఆర్ధిక అవసరాల కోసం విద్యార్థులు నూతన ఆవిష్కరణల కంటే ఉద్యోగ భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ప్రతిభావంతులు సైన్స్ లేదా సాహిత్యం కంటే ఇంజినీరింగ్, సివిల్ సర్వీసుల వైపే మొగ్గు చూపుతారు.

ఇక పరిశోధనలో స్వేచ్ఛ లేకపోవడం మరో కారణం. ప్రభుత్వ మార్పులు, విధాన మార్పులు, నిధుల కొరత వంటివి దీర్ఘకాలిక ప్రాజెక్టులను ముందుకు వెళ్లనివ్వడం లేదు. నోబెల్ స్థాయి ఆవిష్కరణ అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. దానికి దశాబ్దాల పాటు నిరంతర కృషి ,మేధో శక్తి అవసరం. సమాజoలో నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా సాంస్కృతికంగా కూడా మనం శాస్త్రం, పరిశోధన వంటి వాటిని పెద్దగా పట్టించుకోము. కుటుంబాలు పిల్లలను స్థిరమైన వృత్తులవైపు ప్రోత్సహిస్తూ వున్నాయి. మానసికంగా ఆర్దిక భద్రతవైపు అడుగులు వేసేలా తయారుచేస్తాయి. దీని కారణంగానే నేటి తరానికి “పరిశోధన అంటే అస్థిరత” అనే భావన మాత్రం బలంగా నాటుకు పోయింది. ఈ అనిచ్చితి పరిస్థితుల కారణంగానే మన భారతీయ మూలాలున్న శాస్త్రవేత్తలు చాలామంది తమ కీలక కృషిని, పరిశోధనలను మనదేశంలో కాక ఎక్కువగా విదేశాల్లోనే చేస్తున్నారు.అయినా, భారతీయ సమాజంలో మేధస్సుకు కొరత లేదు. సమస్య వ్యవస్థలోని ప్రోత్సాహం, స్వేచ్ఛ, మౌలిక వసతుల కొరతలో ఉంది. నోబెల్ బహుమతి అనేది పాశ్చాత్య ప్రమాణమైనా, ఇది ప్రపంచ ఆవిష్కరణల దిశను చూపే సూచిక. ఈ వేదికపై భారత్ గైర్హాజరు కావడం మన పరిశోధనా సంస్కృతికి పెద్ద సవాలు.

మరి మార్గం ఏమిటి?

మన ఆలోచనా విధానం మారాలి. ప్రభుత్వం పరిశోధన రంగంపై , ఉన్నత విద్యపై పెట్టుబడులు పెంచాలి. విశ్వవిద్యాలయాలకు స్వాతంత్ర్యం ఇవ్వాలి. కొన్ని విషయాలలో రాజకీయ జోక్యం తగ్గించాలి. మన మేధో శక్తిని మెరుగుపరుచుకుంటూ అంతర్జాతీయ సహకారం, పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధనా రంగాన్ని బలపరచాలి. విద్యా వ్యవస్థలో సృజనాత్మకమైన ఆలోచన,విద్యార్ధుల్లో ప్రశ్నించే సంస్కృతి పెంపొందించాలి. శాస్త్రవేత్తలకు, రచయితలకు, నూతన ఆవిష్కర్తలకు, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు, సామాజిక గౌరవం లబించేలా చర్యలు చేపట్టాలి.

చివరిగా ఒక్కమాట, భారతదేశంలో ప్రతిభ అపారం. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ ప్రతిభను వెలికితీయడానికి, దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి సరైన వాతావరణం, ప్రోత్సాహం కావాలి. నోబెల్ బహుమతి కేవలం బహుమతి కాదు. అది ఆలోచన శక్తికి ఇచ్చే ప్రపంచ గౌరవం. ఆ శక్తిని మన విద్యా, పరిశోధనా వ్యవస్థలు గుర్తించి పెంచినప్పుడు, మరింత మంది భారతీయ మేధావులు నోబెల్ వేదికపై నిలబడతారు.

భారతదేశానికి నోబుల్ బహుమతి మళ్లీ ఎప్పుడు?ఎలా? - Tholi Paluku