Let's talk: editor@tmv.in
భారతదేశం 'హిందూ రాష్ట్రం' కావాల్సిందే: ఎమ్మెల్యే రాజాసింగ్

భారతదేశం 'హిందూ రాష్ట్రం' కావాల్సిందే: ఎమ్మెల్యే రాజాసింగ్

Gaddamidi Naveen
29 మార్చి, 2026

వందేమాతరం పాడటాన్ని, 'భారత్ మాతా కీ జై' అని నినదించడాన్ని వ్యతిరేకించే వారిపై గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్థరాత్రి నిర్వహించిన రామ నవమి శోభాయాత్రలో పాల్గొన్న ఆయన, భారతదేశాన్ని 'హిందూ రాష్ట్రం'గా ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు.

రామ నవమి వేడుకల సందర్భంగా భక్తులను ఉద్దేశించి రాజాసింగ్ ప్రసంగిస్తూ..భారత్ మాతా కీ జై లేదా వందేమాతరం అంటే ఎవరి మతానికైనా ముప్పు వాటిల్లుతుందా? అని ఆయన నిలదీశారు. ఈ దేశాన్ని తమ సొంతమని చెప్పుకునే వారు దేశభక్తి నినాదాలను గానీ, వందేమాతరాన్ని గానీ వ్యతిరేకించకూడదని స్పష్టం చేశారు. ప్రపంచంలో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పుడు, భారతదేశాన్ని హిందూ దేశంగా ఎందుకు ప్రకటించకూడదని ఆయన ప్రశ్నించారు. కులమత భేదాలను పక్కనబెట్టి 'హిందూ రాష్ట్రం' సాధన కోసం హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మతమార్పిడులను (లవ్ జిహాద్) ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్‌ను గానీ, హిందూ ధర్మాన్ని గానీ చెడు ఉద్దేశంతో చూస్తే సహించేది లేదని ఆయ‌న‌ హెచ్చరించారు.

ఉగ్రవాద సంబంధాలున్న వ్యక్తులను అరెస్ట్ చేస్తున్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆయన అభినందించారు. దేశం లేదా తన మతంపై ఎవరైనా చెడు దృష్టితో చూస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే ఇటీవల విడుదలైన ఆదిత్య ధర్ చిత్రం 'ధురంధర్ 2'ను ఆయన ప్రశంసించారు. గతంలో దేశాన్ని బలహీనపరిచేలా సినిమాలు ఉండేవని, ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులను మేల్కొలిపే చిత్రాలు వస్తున్నాయని పేర్కొన్నారు. గతేడాది రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అసంతృప్తితో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయగా, పార్టీ దానిని ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్వతంత్రంగా తన గళాన్ని వినిపిస్తున్నారు.