
భారతదేశంలో హిందూ జనాభాను ముస్లింలు ఎన్నటికీ మించలేరు: ఎంపీ అసదుద్దీన్
భారతదేశంలో ముస్లిం జనాభా హిందూ జనాభాను ఎన్నటికీ మించబోదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జనాభా పెరుగుదలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాజ్యసభలో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన ఓవైసీ, ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధాప్యంలోకి వెళ్తున్న సమయంలో భారతదేశం యువ జనాభా కలిగిన దేశమని ప్రధాని పేర్కొన్నారని అన్నారు. అయితే దేశంలో 60 శాతం జనాభా 40 ఏళ్ల లోపు వయస్సు గలవారే అయితే, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ఓవైసీ ప్రశ్నించారు. యువతకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వం ఎంత దృష్టి పెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంకా 20 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఉన్న యువ జనాభా వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తుందని, అప్పటికి పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం వంటి సమస్యలు దేశంపై ఎలా ప్రభావం చూపుతాయో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఓవైసీ అన్నారు. ముస్లింల జనాభా పెరుగుతుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తులో ముస్లింల జనాభా స్థిరపడుతుందని, హిందూ జనాభాను ఎప్పటికీ మించదని ఆయన పేర్కొన్నారు.
జనాభా నియంత్రణ బిల్లుపై గతంలో జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, అప్పట్లో ముస్లింలను విమర్శించిన వారు ఇప్పుడు దేశ జనాభా వృద్ధాప్యం వల్ల కలిగే ప్రభావాలను గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముగురు పిల్లలను కనాలని సూచించారని పేర్కొంటూ, దీనిపై కూడా విమర్శలు చేశారు.
పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని చెప్పిన అంశంపై కూడా ఓవైసీ స్పందించారు. భారత్‌లో టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ఇలా చెప్పడం సరైంది కాదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా స్పందించాల్సిందని అన్నారు. అదేవిధంగా చైనా సరిహద్దు సమస్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆరోపిస్తూ, దేశ భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై స్పష్టమైన వైఖరి అవసరమని ఓవైసీ విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సభలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
2011 జనగణన ప్రకారం భారతదేశంలో మతాల వారీ జనాభా
ప్రస్తుతం భారతదేశంలో మతాల వారీగా అధికారికంగా అందుబాటులో ఉన్న తాజా పూర్తి గణాంకాలు 2011 జనగణన ఆధారంగానే ఉన్నాయి. 2021 జనగణన ఇంకా జరుగలేదు.
హిందువులు — సుమారు 79.8%
ముస్లింలు — సుమారు 14.2%
క్రైస్తవులు — 2.3%
సిక్కులు — 1.7%
బౌద్ధులు — 0.7%
జైనులు — 0.37%
తెలంగాణ 2011 జనగణన ప్రకారం
హిందువులు — సుమారు 85.1%
ముస్లింలు — సుమారు 12.7%
క్రైస్తవులు — సుమారు 1.3%
ఇతరులు — 0.9%
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ముస్లిం జనాభా శాతం ఎక్కువగా ఉంటుంది.
రెండు రూపాయలు ఇస్తా… తీసుకుంటావా? అంటూ ఎద్దేవా
‘మియా ముస్లింలు’పై చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మియా ముస్లిం ఆటో డ్రైవర్ అయితే అసలు చార్జీ కంటే తక్కువ ఇవ్వాలంటాడు. ఐదు రూపాయల చార్జీ ఉంటే నాలుగు రూపాయలు ఇవ్వాలంటాడు. హిమంత బిశ్వ శర్మా… ఈ రెండు రూపాయలు నేనే ఇస్తా. తీసుకుంటావా? నీ ఖాతాలో జమ చేయనా? అంటూ ఓవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని గుర్తుచేసిన ఓవైసీ, ‘మియా ముస్లింల’పై వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మీరు ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగం ముందు అందరూ సమానమే. కానీ ‘మియాలు బంగ్లాదేశ్‌కి వెళ్లి ఓటేయాలి’ అంటూ మాట్లాడటం ఏం సూచిస్తోంది? అని ప్రశ్నించారు. అస్సాంలో అక్రమ వలసలపై సీఎం శర్మ తరచూ వ్యాఖ్యలు చేస్తూ, బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలను ‘మియా ముస్లింలు’గా సంబోధిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అయితే, ‘మియా ముస్లింలు’ అనే పదాన్ని తాను సృష్టించలేదని, అది ఆ సముదాయం లోపలే వాడుకలో ఉన్న పదమని హిమంత బిశ్వ శర్మ గతంలో వివరణ ఇచ్చారు. తూర్పు లడఖ్‌లో 2020 చైనా ఘర్షణపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే ప్రచురించని మోమోయర్ వివాదంపైనా ఒవైసీ స్పందించారు. ఈ అంశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు.
