
భారతదేశంలో ప్రజాస్వామ్యం హత్య: కాంగ్రెస్
ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ చర్యను ‘ఏకపక్ష పాలనా ధోరణి, పిరికితనం’గా అభివర్ణించారు. ప్రజలు తమ ప్రభుత్వ తప్పిదాల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షం ఆరోపించింది. మంగళవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం నిజాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ఐవైసీ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, ఇతర సభ్యులను అరెస్టు చేయడం నియంతృత్వ లక్షణాలను చూపుతోంది. నేను యూత్ కాంగ్రెస్ సహచరులను చూసి గర్వపడుతున్నాను. వారు ‘లొంగిపోయిన ప్రధాని’కి వ్యతిరేకంగా ధైర్యంగా తమ గొంతు వినిపించారని పేర్కొన్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ ఎక్స్‌లో హిందీలో చేసిన పోస్టులో శాంతియుత నిరసన కాంగ్రెస్ చారిత్రక వారసత్వం. అది మన రక్తంలో ఉంది. ప్రతి భారతీయుడి ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఇండియా–అమెరికా వాణిజ్య ఒప్పందంలో జాతీయ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఈ ఒప్పందం రైతులు, వస్త్ర పరిశ్రమకు నష్టం చేస్తుందని, భారత డేటాను అమెరికాకు అప్పగించేలా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నిజాన్ని చెప్పడం నేరం కాదు, అది దేశభక్తి అంటూ #IStandWithYouthCongress హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ దేశంలో యువత ఉద్యోగాల కోసం ఆత్రుతగా ఉందని, ప్రజల్లో మోడీపై తీవ్ర ఆగ్రహం నెలకొన్నదని అన్నారు. కాంగ్రెస్ భయపడదు. మోడీ పిరికివాడు. పార్లమెంటులో తన విధానాలను సమర్థించలేక, యువతను బెదిరిస్తున్నారు. ఇది పనిచేయదు. మేం ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించేందుకు అవసరమైన త్యాగాలన్నీ చేస్తామని తెలిపారు.
ఐవైసీ అధ్యక్షుడు చిబ్‌ను గత వారం ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో షర్ట్ లేకుండా నిర్వహించిన నిరసన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. చిబ్ అరెస్టు నేపథ్యంలో రాజధానిలో కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
మోడీ అంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా
కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ మాట్లాడుతూ మోడీ అంటే ‘మర్డర్ ఆఫ్ డెమెక్రసీ ఇన్ ఇండియా‘ అని అర్థం. ప్రభుత్వం ప్రచారం చేస్తున్న అబద్ధాలను మేము బహిర్గతం చేస్తూనే ఉంటాం. ఇది ప్రజాస్వామ్య హత్య అని విమర్శించారు. ఎప్స్టీన్ ఫైళ్లలో వెలుగులోకి వస్తున్న విషయాలు, అలాగే రైతుల ఆగ్రహం వల్ల ప్రధాని కలవరపడుతున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతిపక్ష బాధ్యత. కానీ నియంతకు అది అర్థం కాదు. మోడీ అసమ్మతికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. భోపాల్‌లో జరిగిన కిసాన్ మహా చౌపాల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేస్తున్నారని అన్నారు.
ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎక్స్‌లో స్పందిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేయవచ్చు, కానీ ఒక ఉద్యమాన్ని అరెస్టు చేయలేరు. మా అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, కార్యకర్తలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి. ఈ అధికార దుర్వినియోగాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన నేరం కాదు. పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొంది.
నాకు గర్వంగా ఉంది: ఉదయ్ భాను చిబ్ అరెస్టుపై తండ్రి వ్యాఖ్య
యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ అరెస్టును ఆయన తండ్రి హరి సింగ్ చిబ్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య హత్య అని పేర్కొన్నారు. ఏఎన్‌ఐతో మాట్లాడిన హరి సింగ్ చిబ్ ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. ఉదయ్ ఎలాంటి తప్పూ చేయలేదు. నా కుమారుడిపై కుట్ర జరుగుతోంది. దేశ యువత కోసం, రైతుల కోసం అతను పోరాడుతున్నాడు. నాకు గర్వంగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ కోర్టు చిబ్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసింది. పోలీసుల ప్రకారం, ఫిబ్రవరి 20, 2026న జరిగిన నిరసనలో చిబ్ ప్రధాన కుట్రదారుడిగా వ్యవహరించాడని ఆరోపిస్తున్నారు. దేశ వ్యతిరేక నినాదాలు ఇవ్వడం, అల్లర్లకు ప్రేరేపించే ప్రయత్నం చేయడం, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, దాడి చేయడం వంటి ఆరోపణలు నమోదు చేసినట్లు తెలిపారు.
చిబ్, సహనిందితులైన శ్రీ కృష్ణ హరి, కుందన్ యాదవ్, నర్సింహా యాదవ్, అజయ్ కుమార్ యాదవ్‌లతో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో సహకరించలేదని, పరారీలో ఉన్న ఇతర నిందితుల వివరాలు వెల్లడించలేదని, నిరసనకారులు ధరించిన టీ-షర్టుల మూలాన్ని చెప్పలేదని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, మరింత విచారణ కోసం కస్టడీ కోరినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నిరసన ఘటనపై దర్యాప్తును ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
