Let's talk: editor@tmv.in
భారతదేశంలో కూటమి ప్రభుత్వాల విజయాలు, వైఫల్యాలు: బీహార్ నేర్పే పాఠాలు

భారతదేశంలో కూటమి ప్రభుత్వాల విజయాలు, వైఫల్యాలు: బీహార్ నేర్పే పాఠాలు

Dr.Chokka Lingam
20 నవంబర్, 2025

భారతీయ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వాలు ఇప్పుడు శాశ్వత స్వభావంగా మారిపోయాయి. ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రానివేళ, విభిన్న సామాజిక వర్గాలు మరియు రాజకీయ స్వరాలకు స్థానం ఇవ్వాలనే పరిస్థితి సహజంగానే కూటముల రూపంలో వ్యక్తమవుతుంది. బీహార్లో ఇటీవల చూసిన రాజకీయ పరిణామాలు ఇందుకు అత్యంత స్పష్టమైన ఉదాహరణ. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఐదేళ్లలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేయడం, కూటములు విడగొట్టడం, మళ్లీ జోడించడం ఇవి కూటమి రాజకీయాల బలాలను, బలహీనతలను ప్రతిబింబిస్తాయి. అయితే ఈ కథ బీహార్‌కే పరిమితం కాదు. మహారాష్ట్ర, కర్ణాటక , జమ్మూ & కశ్మీర్ నుండి కేరళ వరకు కూటములు కొన్ని చోట్ల విజయవంతమయ్యాయి, కొన్ని చోట్ల అర్థాంతరంగా కూలిపోయాయి.

భారత స్వాతంత్ర్యం తర్వాత దేశంలో అత్యధిక కాలం ఒకే పార్టీ ఆధిపత్యం నడిచింది. కానీ 1989 నుంచి పొత్తు ప్రభుత్వాల యుగం ప్రారంభమైంది.కేంద్రంలో 1991లో చంద్రశేఖర్, 1996లో దేవెగౌడ-గుజ్రాల్, 1998లో వాజపేయి మొదటి ప్రభుత్వం, 1999-2004 మళ్లీ వాజపేయి (కానీ అనేక రాజీలతో), 2004-09 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం-1 వంటివి పొత్తు ఒత్తిడికి లొంగిపోయాయి. ఈ ప్రభుత్వాలు రాష్ట్రీయ హితాల కంటే పొత్తు భాగస్వాముల డిమాండ్లకు ప్రాధాన్యమిచ్చాయి.ఉదాహరణకు 1990-91లో వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ అమలుతో దేశవ్యాప్త అల్లర్లు, ఆర్థిక సంక్షోభం మధ్య కూలిపోయింది. 2008లో మన్మోహన్ ప్రభుత్వం అణుఒప్పందం కోసం ఎడమపక్ష మద్దతు ఉపసంహరించుకుంది. తర్వాత సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో కొనసాగినా నిర్ణయాలు స్తంభించాయి. రిటైల్ FDI, భూసేకరణ బిల్లు వంటివి ఆలస్యమయ్యాయి. పొత్తు ఒత్తిడి వల్ల ప్రధాని కార్యాలయం నిస్సహాయంగా మారింది. “పాలసీ పారాలసిస్” అనే పదం పుట్టింది.

కూటమి ప్రభుత్వాల తొలి ప్రయోజనం ప్రాతినిధ్య విస్తరణ. విభిన్న వర్గాల ఆకాంక్షలను పాలనలోకి తీసుకువచ్చే సామర్థ్యం కూటముల ప్రత్యేకత. బీహార్‌లో 2005 తరువాత ఏర్పడ్డ జేడీయూ–బీజేపీ కూటమి ఇందుకు మంచి ఉదాహరణ. ఆ కాలంలో రహదారులు, న్యాయవ్యవస్థ, మహిళా సంక్షేమం, విద్య—అన్ని రంగాల్లో పురోగతి కనిపించింది. కేరళలో ఎల్‌డీఎఫ్ మరియు యూడీఎఫ్ లాంటి కూటములు దీర్ఘకాలికంగా స్థిరపాలనను అందించాయి. తమిళనాడులో కూడా ద్రవిడ పార్టీలకు జాతీయ మిత్రపక్షాలు ఉండటం కేంద్ర–రాష్ట్ర సంబంధాలను బలపరిచింది.

అయితే ఇదే కూటములు స్థిరత్వాన్ని కోల్పోతే పాలనలో గందరగోళం పెరుగుతుంది. బీహార్‌లో 2015లో ఏర్పడ్డ మహాగఠబంధన్ రెండు సంవత్సరాలకే కూలింది. అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత విభేదాలు, పరస్పర అనుమానాలు కారణాలై నితీశ్ కుమార్ మళ్లీ NDAలో చేరారు. ఐదేళ్లలో ఆయన అనేకసార్లు రాజీనామా చేసి, మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలు దీన్ని రాజకీయ నైతికతగా కాకుండా అధికారం నిలుపుకునే వ్యూహంగా ఎక్కువగా భావించటం ప్రారంభించారు.

ఇదే పరిస్థితిని మహారాష్ట్రలో కూడా చూశాం. 2019 ఎన్నికల తరువాత శివసేన–ఎన్‌సీపీ–కాంగ్రెస్ కూటమి ఒక ఆశ్చర్యకరమైన కలయికగా ఏర్పడ్డా, అంతర్గత విభేదాలు, ద్రోహాలు, పార్టీల విడిపోవడాలతో ఆ ప్రభుత్వానికి ముగింపు పలికింది. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కేవలం ఒక సంవత్సరమే నిలిచింది. జమ్మూ & కశ్మీర్‌లో బీజేపీ–పిడిపి కూటమి భిన్న సిద్ధాంతాల కారణంగా మూడు సంవత్సరాల్లోనే పడిపోయింది.

అయినా కూటములు పూర్తిగా వైఫల్యమని అనలేము. స్పష్టమైన విధాన ఒప్పందాలతో, పరస్పర నమ్మకంతో ఏర్పడిన కూటములు మంచి ఫలితాలను ఇవ్వగలవు. కేరళలో జరుగుతున్నట్లుగా, కూటమి భాగస్వాములు స్పష్టమైన బాధ్యతలు మరియు అవగాహనతో పనిచేస్తే పాలన స్థిరంగా ఉంటుంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో ప్రాంతీయ పార్టీలకు స్వరమివ్వడంలో కూటములు కీలక పాత్ర పోషిస్తాయి.

కూటముల బలహీనత మాత్రం వాటి ద్రవత్వం. రాజకీయ ప్రయోజనాల ఆధారంగా కూటములు విచ్ఛిన్నం అవుతాయి. బీహార్‌లో ఇటీవల జరిగిన మార్పులు ప్రామాణిక విధానాల కంటే రాజకీయ లెక్కలు ఎలా ప్రాధాన్యత పొందుతాయో చూపించాయి. ప్రభుత్వ మార్పులు జరిగిన ప్రతిసారి పాలనలో నిలకడ దెబ్బతింటుంది. ప్రజా సమస్యల కన్నా రాజకీయ వ్యూహాలు ముందంజలో ఉంటాయి.

వేగంగా మారుతున్న దేశ రాజకీయాల్లో కూటములు తప్పనిసరి అవుతోంది. వాటిని ఎలా స్థిరంగా, బాధ్యతాయుతంగా వుంచాలన్నదే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. ముందస్తు కూటములు, పారదర్శక ఒప్పందాలు, ద్రోహాలను నియంత్రించే బలమైన చట్టాలు ఇలాంటి చర్యలు అవసరం. కొత్త NDA ప్రభుత్వం బీహార్‌కు మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈసారి కూటమి రాజకీయాలు స్థిర పాలనకు దారి తీస్తాయా లేక మళ్లీ రాజకీయ లెక్కల్లోనే చిక్కుకుంటాయా అనేది కాలమే చెప్పాలి. కూటమి ప్రభుత్వాలు వైవిధ్య ప్రాతినిధ్యానికీ , అస్థిరతకు కూడా మూలం. ప్రజల తీర్పు నిలకడను కోరుతోంది - సంఖ్యల రాజకీయాన్ని కాదు, నిబద్ధత రాజకీయాన్ని కోరుతోంది.