Let's talk: editor@tmv.in
భాగ్యనగర సంస్కృతికి దర్పణం: నుమాయిష్

భాగ్యనగర సంస్కృతికి దర్పణం: నుమాయిష్

Dantu Vijaya Lakshmi Prasanna
30 డిసెంబర్, 2025

హైదరాబాద్‌ అస్తిత్వానికి, గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దం నాంపల్లి 'నుమాయిష్'. దశాబ్దాల చరిత్ర, లక్షల మంది సందర్శకులు, వేల కోట్ల వ్యాపారం.. వీటన్నిటికీ మించి ఒక భావోద్వేగం ఈ ఎగ్జిబిషన్. 2026 జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గురించి సమగ్ర సమాచారం తెలుసుకుందాం.

85వ నుమాయిష్ పండగ

హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ ఎంత గుర్తో.. నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అంతే ప్రాముఖ్యత కలిగినది. 1938లో కేవలం 100 స్టాళ్లతో, కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా ఎదిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు, తరాలు మారుతున్నా 'నుమాయిష్' పట్ల నగరవాసుల మోజు మాత్రం తగ్గలేదు.

ప్రారంభం,చారిత్రక నేపథ్యం

నుమాయిష్ ప్రస్థానం 1938లో మొదలైంది. దీనిని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో, ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఈ ప్రదర్శనను ప్రారంభించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ("ముల్కీ" ఉత్పత్తులు), స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇది ప్రారంభమై ఇప్పటికి 87 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, కోవిడ్ వంటి కారణాల వల్ల రెండు సంవత్సరాలు విరామం వచ్చింది. ఈ ఏడాది జరగబోయేది 85వ ఎడిషన్.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది నుమాయిష్ గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించబడుతోంది. ఈ 85వ ఎడిషన్ ప్రదర్శన 2026 జనవరి 1వ తేదీన ప్రారంభమై, ఫిబ్రవరి 15వ తేదీ వరకు మొత్తం 46 రోజుల పాటు సందర్శకులను అలరించనుంది. సమయపాలన విషయానికొస్తే, సాధారణ రోజుల్లో ప్రతిరోజూ సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. అయితే, సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలలో మాత్రం రాత్రి 11:00 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఈ ప్రదర్శన కోసం ప్రవేశ రుసుమును ఒక్కొక్కరికి రూ. 50 గా నిర్ణయించారు, కానీ 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. మెట్రో రైళ్లు కూడా ఎగ్జిబిషన్ ముగిసే సమయానికి అనుగుణంగా రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉండటం సందర్శకులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

నాంపల్లి నుమాయిష్ అనగానే వైవిధ్యమైన ఉత్పత్తుల సమాహారం గుర్తుకు వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కాశ్మీరీ పష్మీనా షాల్స్, డ్రై ఫ్రూట్స్, అక్కడి కళాకారులు స్వయంగా తయారుచేసిన ఊలు వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చే లక్నో చికెన్కారీ కుర్తాలు, సహరాన్‌పూర్ చెక్క ఫర్నిచర్, రాజస్థాన్ కు చెందిన మార్వారీ జుట్టీలు (చెప్పులు), హస్తకళా వస్తువులు మహిళలను అమితంగా ఆకట్టుకుంటాయి. వీటితో పాటు బనారస్ పట్టు చీరలు, బెంగాల్ కాటన్ వస్త్రాలు, వివిధ రాష్ట్రాల చేనేత ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. గృహోపకరణాల విషయానికి వస్తే.. అత్యాధునిక వంటగది సామాగ్రి నుండి ఇంటి అలంకరణ వస్తువుల వరకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా, హైదరాబాద్‌కే ప్రత్యేకమైన ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు మరియు రకరకాల స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ఈ ప్రదర్శనలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.

ఈసారి ప్రత్యేకతలు ఏమిటి?

దేశ విదేశాల నుంచి సుమారు 2,000 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీరీ షాల్స్ నుంచి కన్యాకుమారి హస్తకళల వరకు ఇక్కడ దొరకని వస్తువుండదు. కేవలం ప్రైవేటు వ్యాపారాలే కాకుండా, రిజర్వ్ బ్యాంక్, అటవీ శాఖ, పర్యాటక శాఖ వంటి ప్రభుత్వ విభాగాలు తమ సేవలపై అవగాహన కల్పించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. మహిళా, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, వారి నైపుణ్యాలను వెలికితీయడానికి స్టాళ్ల కేటాయింపులో వారికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ఆహార ప్రియుల కోసం 20కి పైగా ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, హలీమ్ (సీజన్ బట్టి), దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి.

భద్రత, రవాణా సౌకర్యాలు

ప్రతి ఏటా సుమారు 25 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ఈ నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేశారు. గతంలో జరిగిన అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 82 ఫైర్ పాయింట్లు, 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు నీటి సంపులను సిద్ధం చేశారు. ప్రత్యేక వాచింగ్ టవర్లు, సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. సందర్శకుల సౌకర్యార్థం నాంపల్లి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ల నుంచి రాత్రి 12 గంటల వరకు రైళ్లు నడుస్తాయి.ఎగ్జిబిషన్ పరిసరాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

సామాజిక బాధ్యత: ఒక విద్యా నిధి

నుమాయిష్ కేవలం ఒక వాణిజ్య ఉత్సవం మాత్రమే కాదు, అది వేల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 19 విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దాదాపు 30 వేల మంది విద్యార్థులు (ముఖ్యంగా పేద, మధ్యతరగతి) నాణ్యమైన విద్యను పొందుతున్నారు. 2 వేల మంది సిబ్బందికి ఇది జీవనోపాధిని అందిస్తోంది.

ఒక భావోద్వేగ ప్రయాణం

నుమాయిష్ అంటే హైదరాబాద్ వాసులకు ఒక 'పిక్నిక్'. కుటుంబ సభ్యులతో కలిసి జెయింట్ వీల్ ఎక్కడం, చిన్న పిల్లలకు బొమ్మలు కొనడం, కొత్త రకం గృహోపకరణాలను చూడటం.. ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకాలు. 85 ఏళ్ల ఈ చారిత్రక ప్రయాణం, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి, సాంస్కృతిక సమైక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. కొత్త ఏడాది కానుకగా జనవరి 1న ప్రారంభమయ్యే ఈ 'మిని ఇండియా'ను సందర్శించి, హైదరాబాద్ వైభవాన్ని ఆస్వాదించండి.