

భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కీలక మార్గాల్లో ఒకటైన షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జీహెచ్‌ఎంసీ, నగర పోలీసులు నడుం బిగించారు. ఈ మార్గాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'మోడల్ కారిడార్'గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ (ఐఏఎస్), పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(ఐపీఎస్) ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులందరూ ఒకే బస్సులో ప్రయాణిస్తూ రహదారిపై ఉన్న బాటిల్ నెక్‌లు, నీరు నిలిచే ప్రాంతాలు అక్రమ ఆక్రమణలను స్వయంగా పరిశీలించారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఈ ప్రాజెక్టు కింద దాదాపు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రతి జోన్‌కు రూ. 20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ, తక్షణమే చేపట్టాల్సిన పనులు, దీర్ఘకాలిక ప్రణాళికలను అధికారులు ఖరారు చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో షేక్‌పేట్ నాలా, టోలిచౌకి వద్ద ఎదురయ్యే నీటి నిల్వ సమస్యలకు పరిష్కారంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, కేబీఆర్ పార్క్ సమీపంలో నిలిచిపోయిన పెండింగ్ పనులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
పాదచారుల భద్రతకు ఈ మోడల్ కారిడార్‌లో పెద్దపీట వేస్తున్నారు. ఎస్.డి. ఐ హాస్పిటల్, బృందావన్ కాలనీ రోడ్ నెం.1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించనున్నారు. అలాగే, షేక్‌పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేసి పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేలా చర్యలు తీసుకుంటున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో బస్ షెల్టర్ల నిర్మాణం, మెహదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రహదారి విస్తరణలో భాగంగా నానల్‌నగర్ జంక్షన్ వద్ద ఉన్న రోటరీ (ఐలాండ్) వెడల్పును తగ్గించి, వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎన్.ఎమ్.డి.సి, డెల్ స్టోర్ ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి రోడ్డును వెడల్పు చేయాలని నిర్ణయించారు. అలాగే, పోచమ్మ బస్తీ నుండి రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. రహదారికి అడ్డంగా ఉన్న పాత నిర్మాణాలు, చెట్లను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి లేదా ఇతర ప్రాంతాలకు తరలించి ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పర్యటన సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరవాసుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు టెక్నాలజీతో కూడిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో భవిష్యత్తులో ఈ కారిడార్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. అధికారులు తీసుకుంటున్న ఈ చొరవ పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
