Let's talk: editor@tmv.in
భాగ్యనగరంలో 'చైనీస్ మాంజా'పై పోలీసుల ఉక్కుపాదం: రూ.1.24 కోట్ల సరుకు సీజ్

భాగ్యనగరంలో 'చైనీస్ మాంజా'పై పోలీసుల ఉక్కుపాదం: రూ.1.24 కోట్ల సరుకు సీజ్

Dantu Vijaya Lakshmi Prasanna
9 జనవరి, 2026

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాల ప్రియులకు వ్యాపారులకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రాణాంతకమైన 'చైనీస్ మాంజా' విక్రయాలపై 'జీరో టాలరెన్స్' (సున్నా సహనం) విధానాన్ని అవలంబిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రాణాంతకమైన చైనా మాంజాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కొందరు అక్రమంగా దీనిని నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని, తాజాగా గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో భారీగా మాంజాను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడిచిన నెల రోజులుగా నగరవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.1.24 కోట్ల విలువైన నిషేధిత నైలాన్/సింథటిక్ మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వందకు పైగా కేసులు, 143 మంది అరెస్ట్

నిషేధాన్ని ఉల్లంఘించి చైనీస్ మాంజాను విక్రయిస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు, మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం రూ. 1.24 కోట్లు పలికే 6,226 మాంజా బాబిన్లను సీజ్ చేశారు. ఈ మాంజా ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల నుండి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.

ఆన్‌లైన్ విక్రయాలపై డేగ కన్ను

పోలీసుల నిఘా నుండి తప్పించుకోవడానికి కొందరు వ్యాపారులు వాట్సాప్, సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్ల ద్వారా రహస్యంగా వ్యాపారం సాగిస్తున్నారు. దీనిపై స్పందించిన సిపి సజ్జనార్, "ఆన్‌లైన్ వేదికలపై నిరంతర నిఘా ఉంచాం. నిషేధిత మాంజాను డెలివరీ చేసే ఈ-కామర్స్ సంస్థలపై కూడా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం" అని హెచ్చరించారు.

ప్రాణాలకు ముప్పు - 2016 నుండే నిషేధం

సింథటిక్ దారాలకు ఉండే మెటాలిక్ కోటింగ్ వల్ల విద్యుత్ షాక్‌లు తగిలే ప్రమాదం ఉందని, అలాగే పక్షులు, మనుషుల ప్రాణాలకు ఇది అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం 2016లోనే దీనిపై నిషేధం విధించింది. పర్యావరణానికి హాని కలిగించే ఈ దారాలకు బదులు, కేవలం సాంప్రదాయ కాటన్ దారాలనే వాడాలని పోలీసులు కోరుతున్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రమాదకరమైన మాంజాను కొనివ్వవద్దని, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని పోలీస్ శాఖ కోరింది.

ప్రజలకు విజ్ఞప్తి

మీ ప్రాంతంలో ఎవరైనా చైనీస్ మాంజా విక్రయిస్తున్నా లేదా నిల్వ ఉంచినా వెంటనే కింది మార్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందించవచ్చు.

డైల్: 100

వాట్సాప్ నంబర్: 9490616555