Let's talk: editor@tmv.in
భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా భారత్ ‘డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047’ ఆవిష్కరణ

భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా భారత్ ‘డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047’ ఆవిష్కరణ

Dantu Vijaya Lakshmi Prasanna
11 మార్చి, 2026

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణలు భవిష్యత్తు యుద్ధాల స్వరూపాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధాల్లో డ్రోన్లు, క్షిపణులు, సైబర్ దాడులు, సమాచార యుద్ధం వంటి ఆధునిక పద్ధతులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుకే భారత సైన్యం కూడా మల్టీ-డొమైన్ యుద్ధాలకు సిద్ధంగా ఉండేలా వ్యూహాలను రూపొందిస్తోంది. ఆ అనుభవాలను పరిశీలిస్తూ భారత రక్షణ వ్యూహాన్ని ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో జరిగిన కార్యక్రమంలో ‘డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047 ఎ రోడ్‌మ్యాప్ ఫర్ ఎ ఫ్యూచర్-రెడీ ఇండియన్ మిలిటరీ’ అనే సమగ్ర దూరదృష్టి పత్రాన్ని విడుదల చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ రూపొందించింది. 2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా, భారత సైన్యాన్ని ఆధునిక, సమగ్ర, సాంకేతికంగా ముందంజలో నిలిపే దిశగా ఈ పత్రం రూపొందించబడింది.

ఈ విజన్ పత్రంలో మారుతున్న ప్రపంచ భద్రతా పరిస్థితులు, సాంకేతిక పరిణామాలు భౌగోళిక రాజకీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రక్షణ దళాల్లో చేపట్టాల్సిన కీలక సంస్కరణలను వివరించారు. భవిష్యత్తు యుద్ధాలు కేవలం భూభాగం లేదా సముద్రంలోనే కాకుండా అంతరిక్షం, సైబర్ రంగాలు వంటి అనేక మల్టీ-డొమైన్‌లలో జరుగుతాయని గుర్తించి, భారత సైన్యాన్ని సమగ్రంగా పనిచేసే మల్టీ-డొమైన్ శక్తిగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పత్రం స్పష్టం చేసింది. ప్రత్యర్థులను సమర్థంగా నిరోధించడం, వివిధ రకాల యుద్ధ పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించడం ఈ విజన్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

ఈ పత్రంలో ముఖ్యంగా మూడు సాయుధ దళాల మధ్య సమన్వయం, సహకారం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్తులో యుద్ధ సన్నద్ధతను మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు, ఆపరేషన్లు, సామర్థ్యాల అభివృద్ధిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమగ్ర సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆధునిక యుద్ధ సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు, డ్రోన్ వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాలు వంటి రంగాల్లో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా సైన్యాన్ని భవిష్యత్తు యుద్ధాలకు సిద్ధం చేయాలని విజన్ డాక్యుమెంట్ సూచించింది.

ఇంకా ఈ దూరదృష్టి పత్రంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే ఆయుధాలు లేదా రక్షణ సామగ్రి దిగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే స్వదేశీ రక్షణ ఉత్పత్తి, సాంకేతిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విజన్ పత్రంలో పేర్కొన్నారు.

దేశ భద్రతా అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని సూచించారు. దేశీయ రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.

ఈ విజన్ పత్రం తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల లక్ష్యాలతో కూడిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రతిపాదిస్తుంది. కీలక సైనిక సామర్థ్యాల అభివృద్ధి, సంస్థాగత సంస్కరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ప్రపంచ స్థాయి రక్షణ దళాలను నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నౌకాదళాధిపతి దినేష్ కే త్త్రిపాఠి, వైమానిక దళాధిపతి ఏపి సింగ్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 2047లో భారత స్వాతంత్ర శతాబ్ది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందే, సాంకేతికంగా ముందంజలో ఉండే, యుద్ధ సిద్ధత కలిగిన సైన్యాన్ని నిర్మించడం ఈ విజన్ యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు.