
భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు: మంత్రి గొట్టిపాటి
తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడీసీఎల్ కు చెందిన ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి బాసటగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు, పనితీరుపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్త పరిశ్రమల స్థాపన, తయారీ యూనిట్ల విస్తరణ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా ముఖ్యమైన విద్యుత్ ను అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. భవిష్యత్తు విద్యుత్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమలతో పాటు గృహ వినియోగదారులు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా విద్యుత్ సంస్థలు ముందుగానే సిద్ధం కావాలని ఆయన సూచించారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉండేందుకు 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ సామర్థ్యాలతో 29 కొత్త ఉప కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ ఉప కేంద్రాలు గ్రిడ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు కీలకంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ, గృహ వినియోగదారులకు అందించే సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ, గృహ కనెక్షన్ల పై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని, దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించాలని విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల్లో కనీసం 95 శాతం వినియోగదారులు సంతృప్తి సాధించే లక్ష్యంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి పనులు వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. ఇందుకుగానూ సంబంధిత కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని, అన్ని ఉపకేంద్రాలు, లైన్లు, నెట్‌వర్క్ అప్‌గ్రేడేషన్ పనులు నిర్ణీత గడువులోనే పూర్తయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శాఖా పరమైన పనులపై ప్రతీ 15 రోజులకు ఓసారి అధికారులతో సమీక్ష ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అయితే అధికారులు కూడా ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై నివేదికలను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
