
భవిష్యత్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయి: అప్ఘాన్ విదేశాంగ మంత్రి
భవిష్యత్ లో ఇండియా, అప్ఘానిస్తాన్ మధ్య మెరుగైన సంబంధాలు నెలకొంటాయని అప్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ జిల్లాలో ఉన్న మదర్సా దేవ్ బంద్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జమాతే ఉలమా హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ స్వాగతం పలికారు. స్థానికులు, ఉలేమాలు అందించిన స్వాగతానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్ఘానిస్తాన్ అభివృద్ధిలో భారత్ ప్రధాన భాగస్వామ్యం వహిస్తుందని, రాజకీయ,ఆర్థిక, భద్రతా, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. అలాగే అర్థిక సహకారం, పెట్టుబడులు పెట్టడానికి భారత్ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దారుల్ ఉలూం దేవ్ బంద్ లో ప్రసంగించారు. భారతీయులు కూడా తమ దేశంలో పర్యటించాలని, అక్కడి ప్రదేశాలను సందర్శించాలని ఆకాంక్షించారు. అప్ఘానిస్థాన్ లో భూకంపం వస్తే స్పందించిన తొలిదేశం భారతదేశమని గుర్తు చేశారు. తమకు అత్యంత సన్నిహిత దేశం భారత్ అని కొనియాడారు. అలాగే మౌలానా అర్షద్ మదానీతో సమావేశమయ్యారు.
చారిత్రక సంబంధం:హర్షద్ మదానీ
ముఖ్యంగా దారుల్ ఉలూమ్ దేవ్ బంద్, అప్ఘానిస్తాన్ మధ్య ఉన్న బంధం రాజకీయ పరమైంది కాదని, చారిత్రక, ఆధ్యాత్మిక సంబంధమని అన్నారు. మా సంబంధం కేవలం విద్యా పరమైనది కాదు. అఫ్గాన్ ప్రజలు భారత స్వాతంత్ర్య సమరంలో కూడా కీలక పాత్ర పోషించారని తెలిపారు. మా పూర్వీకులు బ్రిటిష్‌పై పోరాటం చేయడానికి అఫ్గానిస్తాన్ నేలని ఎంచుకున్నారు. అప్ఘన్ ప్రజలు కూడా అమెరికా, రష్యా వంటి మహాశక్తులను ఓడించి స్వాతంత్ర్యాన్ని సాధించారు. మీరు ఆ ధైర్యాన్ని మా చరిత్ర నుంచే నేర్చుకున్నారని మదానీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య మత భేదాలు పక్కనబెట్టి సౌహార్దం నెలకొనాలని పిలుపునిచ్చారు. ఇంతకుముందు అఫ్గానిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వస్తున్నారన్న అనుమానాలు ఇక్కడ ఉండేవి. అయితే ఈ సమావేశం తర్వాత అఫ్గానిస్తాన్ నుంచి భారత్ వైపు ఎలాంటి ఉగ్రవాదులు రారనే నమ్మకం కలిగింది అని స్పష్టం చేశారు. ఆదివారం ముత్తాకీ తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇండియా అప్ఘన్లో ఆసుపత్రులు నిర్మించడానికి ముందుకు వచ్చింది. ఇరాన్, దోహ, ఖతార్, పాకిస్ఠాన్ తదితర భావసారూప్య దేశాలతోపాటు నార్వే,లో పర్యటించారు. అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి సారి ఇండియాకు వచ్చారు.
