
భవిష్యత్తు టెక్నాలజీకి వేదిక అమరావతి క్వాంటం వ్యాలీ: సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. అత్యాధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా, ప్రపంచ స్థాయి పరిశోధనలకు కేంద్రబిందువుగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. శనివారం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో 'అమరావతి క్వాంటం వ్యాలీ' భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా శంకుస్థాపన చేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో, క్వాంటం రంగంలో నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా పలు దిగ్గజ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి క్వాంటం వ్యాలీ దేశ భవిష్యత్తును మార్చే 'గేమ్ ఛేంజర్' కాబోతోందని ఆకాంక్షించారు. గతంలో తాను నిర్మించిన హైటెక్ సిటీ రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయి అయితే ఈ క్వాంటం వ్యాలీ రాబోయే 40 ఏళ్ల దేశ అవసరాలను తీర్చే అంతర్జాతీయ ప్రాజెక్టుగా నిలుస్తుందని చెప్పారు. చరిత్ర సృష్టించాలన్నా, మార్చాలన్నా యువతకే సాధ్యం. మన విద్యార్థులు క్వాంటం వేగంతో దూసుకుపోవాలి. 2030 నాటికి దేశానికి అవసరమైన 2.5 లక్షల మంది క్వాంటం నిపుణులను తయారు చేసే బాధ్యతను ఏపీ తీసుకుంటుంది అని ఆయన ఉద్ఘాటించారు.
ఈ ఏడాది చివరికే తొలి క్వాంటం కంప్యూటర్
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ఎప్పుడూ ముందే ఉంటుందని ఈ ఏడాది చివరి నాటికే అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిగాయని ఏప్రిల్ 14 నాటికి మరో రెండు క్వాంటం సెంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నేషనల్ క్వాంటం మిషన్ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించాలని ee ఈసందర్బంగా కేంద్రాన్ని కోరారు.
రూ. 6 వేల కోట్లతో జాతీయ మిషన్: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఈ సమావేశానికి ముఖ్యతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ దేశ క్వాంటం భవిష్యత్తుకు అమరావతిలో పడిన పునాది రాయి కీలకమని కొనియాడారు. నేషనల్ క్వాంటం మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లను కేటాయించిందని ఇది వైద్య కమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని స్పష్టం చేసారు. క్వాంటం మెడిసిన్, క్వాంటం బయాలజీ వంటి బహుళ విభాగాల పరిశోధనలకు ఈ వ్యాలీ వేదిక కానుందని ఇందుకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, కందుల దుర్గేశ్ పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
