Let's talk: editor@tmv.in
భవిష్యత్తుకు భరోసా… రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్

భవిష్యత్తుకు భరోసా… రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్

Gaddamidi Naveen
21 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా, ప్రజా ఆకాంక్షలను ప్రతిబింబించేలా కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో రూ. 3,24,234 కోట్ల భారీ 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ కేటాయింపులు సుమారు రూ. 20,000 కోట్లు పెరిగాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, ఇది కేవలం అంకెల గారడీ కాదని, వాస్తవాల పునాదులపై నిర్మించిన అభివృద్ధి ప్రణాళిక అని పేర్కొన్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిని ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు

• మొత్తం బడ్జెట్‌: రూ. 3,24,234 కోట్లు

• రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406 కోట్లు

• మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు

• రెవెన్యూ మిగులు: రూ. 6,857.76 కోట్లు

• ద్రవ్య లోటు: రూ. 58,458.71 కోట్లు

• రాష్ట్ర అప్పు: రూ. 5.62 లక్షల కోట్లు (జీఎస్డీపీలో 29 శాతం)

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ. 50,713 కోట్లు భారీగా కేటాయించింది. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు రూ. 4,000 కోట్లు కేటాయించారు. జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు అల్పాహారం

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌ కార్డు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదనలు.

ప్రధాన శాఖల వారీగా కేటాయింపులు

• పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి: రూ. 33,688 కోట్లు

• పట్టణ, మున్సిపల్ అభివృద్ధి: రూ. 17,907 కోట్లు

• నీటి పారుదల: రూ. 22,615 కోట్లు

• వ్యవసాయ శాఖకు: రూ.23,179 కోట్లు

• విద్యుత్‌ శాఖకు: రూ.21,285 కోట్లు

• పౌరసరఫరాల శాఖకు: రూ.7,366 కోట్లు

• పశుసంవర్ధక శాఖకు: రూ.1,529 కోట్లు

• విద్యా శాఖకు: రూ.26,674 కోట్లు

• వైద్య శాఖకు: రూ.13,679 కోట్లు

• కార్మిక శాఖకు: రూ.998 కోట్లు

• మహిళ, శిశు సంక్షేమ శాఖకు: రూ.3,143 కోట్లు

• పర్యాటక రంగానికి: రూ.1,224 కోట్లు

• ఎస్సీ సంక్షేమం: రూ.11,784 కోట్లు

• ఎస్టీ సంక్షేమం: రూ.7,934 కోట్లు

• బీసీ సంక్షేమం: రూ.12,511 కోట్లు

• మైనార్టీ సంక్షేమం: రూ.3,769 కోట్లు

• కల్యాణ లక్ష్మీ పథకం: రూ.3,683 కోట్లు

• ఉపకార వేతనాలకు: రూ.4,343 కోట్లు

• యంగ్‌ ఇండియా స్కూళ్లకు: రూ.5,000 కోట్లు

• మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌: రూ.1500 కోట్లు

• ఉస్మానియా యూనివర్సిటీకి: రూ.1,000 కోట్లు

• మెట్రో రైలు ఫేజ్‌-2: రూ.600 కోట్లు

• మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ పథకం: రూ.723 కోట్లు

• రాజీవ్‌ ఆరోగ్యశ్రీ: రూ.1143 కోట్లు

• గృహజ్యోతి పథకానికి: రూ.2,080 కోట్లు

• వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌: రూ.3500 కోట్లు

• మహాలక్ష్మీ పథకం: రూ.4,305 కోట్లు

• ఇందిరమ్మ ఇళ్లు: రూ.5,500 కోట్లు

• చేయూత పథకం: రూ.14,861 కోట్లు

• రైతు భరోసా: రూ.18 వేల కోట్లు

విద్యా రంగం - విద్యార్థుల సంక్షేమం

విద్యా రంగానికి ప్రభుత్వం రూ.26,674 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయనున్నారు. సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాన్ని పెంచవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించేందుకు రూ. 100 కోట్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రూ. 500 కోట్లు కేటాయించారు. ప్రతి పాఠశాలలో 1,500 మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు డిజిటల్ విద్య, రవాణా సౌకర్యం కల్పిస్తారు. యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ, వీసా గైడెన్స్ కోసం రూ. 1,056 కోట్లు కేటాయించారు. ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ మౌలిక సదుపాయాల కోసం రూ.1,000 కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్లు కేటాయించారు.

యువత, నైపుణ్యాభివృద్ధి

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాస కార్యక్రమానికి రూ.6,000 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 118 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందే అభ్యర్థులకు నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఉద్యోగులకు 'భరోసా' - ఇన్సూరెన్స్ ధీమా

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం (సుమారు 23.51 లక్షల మంది) క్యాష్‌లెస్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను ప్రకటించారు. ప్రమాద బీమా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 1.2 కోట్ల పరిహారం, సాధారణ మరణానికి రూ. 10 లక్షల బీమా కల్పిస్తారు. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 2 కోట్ల వరకు కవరేజీ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ పథకాల కోసం రూ. 1,056 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 7.57 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కవరేజీ ఉంటుంది.

ప్రతిపక్షాల విమర్శలు

ఈ బడ్జెట్ ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఆడబిడ్డలకు తులం బంగారం వంటి హామీలపై స్పష్టత లేదని బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంకెలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

సంక్షేమ పథకాలు - మహిళా శక్తి

ప్రతిరోజూ 34.37 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు మహిళలకు దీని ద్వారా రూ. 9,222 కోట్లు ఆదా అయ్యాయి. 42.90 లక్షల కుటుంబాలకు రూ. 500 కే గ్యాస్, 53.9 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. కోటి మంది మహిళలను 'కోటీశ్వరులను' చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక నిధులు కేటాయించామ‌ని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నారు అని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర జీఎస్‌డీపీ 10.7 శాతం వృద్ధి రేటుతో రూ. 17,82,198 కోట్లకు చేరుకుందని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 10.2 శాతం వృద్ధితో రూ. 4,18,931గా నమోదైందన్నారు. బడ్జెట్ అవసరాల కోసం ప్రభుత్వం మార్కెట్ రుణాల ద్వారా రూ. 73,383 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాము. పంచాయతీ రోడ్లలో కొత్త దశ ప్రారంభించాం. 2025 డిసెంబరులో 12,702 గ్రామ పంచాయతీల ఎన్నికలు సాఫీగా జరిగాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల మేరకు రూ.1,597 కోట్లు విడుదల చేసింది. అన్ని ఎన్నికయిన సర్పంచ్‌లకు ఐదు రోజుల సమగ్ర శిక్షణ అందించాం అని చెప్పారు. రాజ్యాంగ విలువలు, పారదర్శకతను పునాదిగా చేసుకుని పాలిస్తున్నాము. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే ఒక సంకల్ప పత్రం. మేము చప్పట్ల కోసం అబద్ధాలు చెప్పం, వాస్తవాల ప్రాతిపదికన పారదర్శకమైన పాలన అందిస్తాం అని భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ముగించారు.

గ‌త తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2025-2026)

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025-2026 శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రవేశపెట్టారు. ​రూ.3,04,965 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. రాష్ట్రం అప్పులు రూ.5,04,814 కోట్లుగా ఉంది.