Let's talk: editor@tmv.in
భవానీపూర్‌ నుంచే నా జీవితం ప్రారంభమైంది: మమతా బెనర్జీ

భవానీపూర్‌ నుంచే నా జీవితం ప్రారంభమైంది: మమతా బెనర్జీ

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కాలీఘాట్ నివాసం నుంచి ఆలీపూర్ సర్వే బిల్డింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, బీజేపీ ఇచ్చిన ‘పరివర్తన్’ నినాదానికి రాజకీయంగా సమాధానం ఇచ్చారు. ‘మమతా బెనర్జీ జిందాబాద్’, ‘జోయ్ బాంగ్లా’, ‘టీఎంసీ జిందాబాద్’ నినాదాల మధ్య ఆమె దాదాపు 600 మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మహిళా కార్యకర్తలు శంఖాలు ఊదుతూ, పార్టీ జెండాలు ఊపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మాట్లాడిన మమతా, తాను భవానీపూర్‌లోనే పుట్టి పెరిగానని చెప్పారు. నేను ఇక్కడే 365 రోజులు ఉంటాను. నా జీవితం, నా పని, నా రాజకీయ ప్రయాణం అన్నీ భవానీపూర్ నుంచే ప్రారంభమయ్యాయి. ఇక్కడి ప్రజలకు నా కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు. భవానీపూర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని 294 నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాల్లో 213 గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు

ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) అంశంపై మమతా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రక్రియలో ముస్లింలు, మహిళల పేర్లు అధికంగా తొలగించారని ఆరోపించారు. ‘చాలా మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం నాకు చాలా బాధ కలిగించింది. మేము ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించగా 1.2 కోట్లలో 32 లక్షల పేర్లు తిరిగి చేర్చారు. ఇంకా విచారణలో ఉన్న పేర్లను కూడా పునరుద్ధరించాలి. ఓటర్ల జాబితాను ఎందుకు ఫ్రీజ్ చేశారో అర్థం కావడం లేదు. మేము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’ అని ఆమె తెలిపారు.

‘మినీ ఇండియా’గా భవానీపూర్

భవానీపూర్‌ను ‘మినీ ఇండియా’గా టీఎంసీ చిత్రీకరిస్తోంది. బెంగాలీ హిందువులు, గుజరాతీ, మార్వారి వ్యాపారులు, పంజాబీ కుటుంబాలు, జైనులు, ముస్లింలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్న ప్రాంతమని పార్టీ నేతలు చెబుతున్నారు. మమతా నామినేషన్ పత్రాలకు ప్రతిపాదకులుగా కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ భార్య రూబీ హకీమ్, వ్యాపారవేత్త నిస్పాల్ సింగ్ రాణే, టీఎంసీ నేత బబ్లు సింగ్, భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన మీరాజ్ షా సంతకాలు చేశారు. కోల్‌కత్తా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిది వార్డుల్లో విస్తరించిన భవానీపూర్ సామాజిక వైవిధ్యానికి ప్రసిద్ధి. ఇక్కడి ఓటర్లలో సుమారు 42 శాతం బెంగాలీ హిందువులు, 34 శాతం ఇతర రాష్ట్రాల హిందువులు, 24 శాతం ముస్లింలు ఉన్నారు.

బీజేపీ సవాలు

అయితే ఈసారి భవానీపూర్‌లో పరిస్థితులు మారాయని బీజేపీ భావిస్తోంది. 2021లో టీఎంసీ ఇక్కడ దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. తర్వాత ఉపఎన్నికలో మమతా ఈ మెజారిటీని 58 వేలకుపైగా పెంచుకున్నారు. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీఎంసీ ఆధిక్యం కేవలం 8,297 ఓట్లకే పరిమితమైంది. ఎనిమిది వార్డుల్లో ఐదింటిలో బీజేపీ ముందంజలో నిలిచింది.

దీంతో బీజేపీ ఈసారి మమతాకు ప్రధాన ప్రత్యర్థిగా సువేందు అధికారిని రంగంలోకి దించింది. 2021లో నందిగ్రామ్‌లో మమతాను ఓడించిన అధికారి ప్రస్తుతం ఆమెకు కఠిన ప్రత్యర్థిగా నిలుస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా కూడా ఇటీవల మాట్లాడుతూ సాధారణంగా మేము 170 స్థానాలు గెలవాలి. కానీ భవానీపూర్‌లో సువేందు అధికారి మమతాను ఓడిస్తే రాష్ట్రంలో పరివర్తన్ ఆటోమేటిక్‌గా వస్తుందని వ్యాఖ్యానించారు. మొత్తంగా కాలీఘాట్ నుంచి ఆలీపూర్ వరకు మమతా నిర్వహించిన ర్యాలీ కేవలం నామినేషన్ దాఖలుకు మాత్రమే కాకుండా, 2026 బెంగాల్ ఎన్నికల రాజకీయ పోరాటానికి ప్రతీకగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.