Let's talk: editor@tmv.in
భవానీపూర్‌లో హై వోల్టేజ్ పోరు

భవానీపూర్‌లో హై వోల్టేజ్ పోరు

Pinjari Chand
23 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పులను ప్రతిబింబించే కీలక నియోజకవర్గంగా భవానీపూర్ నిలిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి బలమైన కోటగా మారింది. స్వాతంత్ర్యం తర్వాత అనేక దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ ఆధిపత్యంలోనే కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే ఇక్కడి నుంచి గెలిచి తన ప్రభావాన్ని చాటుకున్నారు. మీరా దత్తా గుప్తా, రథిన్ తాలూక్దార్ వంటి కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. 1969లో కొద్ది కాలం వామపక్షాలు ఈ సీటును చేజిక్కించుకున్నాయి. ఆ సమయంలో కాలిఘాట్‌గా పిలిచిన ఈ ప్రాంతంలో సిపిఎం నేత సధన్ గుప్తా విజయం సాధించారు. అయితే 1972లో నియోజకవర్గాల పునర్విభజనతో భవానీపూర్ పూర్తిగా ఎన్నికల మ్యాప్ నుంచి కనుమరుగైంది. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, 2011లో మళ్లీ ఈ నియోజకవర్గాన్ని పునరుద్ధరించారు. అదే సమయంలో బెంగాల్‌లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొదటి ఎన్నికల్లో మమతా సన్నిహితుడు సుబ్రత బక్షీ ఘన విజయం సాధించారు. తర్వాత ఆయన రాజీనామా చేయడంతో జరిగిన ఉపఎన్నికలో మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేసి 77శాతం ఓట్లతో భారీ విజయం సాధించారు. అప్పటి నుంచి భవానీపూర్ తృణమూల్‌కు అజేయ కోటగా మారింది.

2016లో కాంగ్రెస్- లెఫ్ట్‌ కూటమి తరఫున దీపా దాస్‌మున్షి పోటీ చేసినా, మమతా సులభంగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి చంద్రకుమార్ బోస్ మూడో స్థానంలో నిలిచారు.

2021లో మమతా నందిగ్రామ్ నుంచి పోటీ చేయగా, భవానీపూర్‌లో తృణమూల్ నాయకుడు శోవందేబ్ చట్టోపాధ్యాయ్ విజయం సాధించారు. అనంతరం ఉపఎన్నికలో మమతా మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై 58 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. సామాజికంగా భవానీపూర్ విభిన్న వర్గాల సమాహారం. బెంగాలీ హిందువులు సుమారు 42శాతం, ఇతర రాష్ట్రాల హిందువులు 34శాతం, ముస్లింలు 24శాతం వరకు ఉన్నట్లు అంచనా. ఈ కలయిక మమతా రాజకీయాలకు అనుకూలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు 2026 ఎన్నికల నేపథ్యంలో భవానీపూర్ మళ్లీ రాజకీయ కేంద్రమైంది. ఈసారి మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా సువేందు అధికారి రంగంలోకి దిగడం పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇక ఓటర్ల జాబితా సవరణలో వేల సంఖ్యలో పేర్లు తొలగించటం, మరికొన్ని పరిశీలనలో ఉండటం కూడా చర్చనీయాంశమైంది. మొత్తానికి, కాంగ్రెస్ ఆధిపత్యం నుంచి మమతా బెనర్జీ ఎదుగుదలకు ప్రతీకగా నిలిచిన భవానీపూర్, ఇప్పుడు బెంగాల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక రాజకీయ పోరుకు వేదికగా మారింది.