
భవానీపూర్‌లో మార్పుకి ‘షా’ర్ట్‌కట్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తన వద్ద ‘షార్ట్‌కట్’ ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బెనర్జీ స్వస్థలమైన భవానీపూర్‌లో ఆమెను ఓడిస్తే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయం అవుతుందని ఆయన సవాల్ విసిరారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సువేందు అధికారితో కలిసి గురువారం కోల్‌కత్తాలో జరిగిన భారీ రోడ్‌షోలో పాల్గొన్న షా ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కోల్‌కత్తాలోని హజ్రా క్రాసింగ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సాధారణంగా 170 స్థానాలు గెలవాల్సి ఉంటుందని, అయితే భవానీపూర్‌లోనే విజయం సాధిస్తే అది బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతమవుతుందని షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మార్పు తప్పక వస్తుంది. కానీ భవానీపూర్‌లో మార్పు రావాలా వద్దా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్ర విముక్తి కోసం బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
సువేందును నేనే ఒప్పించా
సువేందు అధికారిని భవానీపూర్ నుంచి పోటీ చేయమని తానే వ్యక్తిగతంగా ఒప్పించానని షా తెలిపారు. మొదట ఆయన తన బలమైన స్థావరమైన నందిగ్రాం నుంచి పోటీ చేయాలని భావించారని చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ అక్కడ అధికారిచేతిలో ఓటమి చవిచూశారని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా ఆమె భవానీపూర్‌లోనే ఓడిపోతారని షా వ్యాఖ్యానించారు. భవానీపూర్ దశాబ్దానికి పైగా మమతా బెనర్జీ రాజకీయ కోటగా ఉంది. 2011లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో నందిగ్రామ్‌లో ఓడిన తరువాత ఉపఎన్నికలో భవానీపూర్ నుంచి గెలిచి మళ్లీ అసెంబ్లీలోకి వచ్చారు.
ఇప్పుడు అదే నియోజకవర్గంలో సువేందు అధికారిని రంగంలోకి దింపడం ద్వారా బీజేపీ ఈ పోరును ప్రతిష్టాత్మకంగా మార్చింది. దీంతో భవానీపూర్ పోరు బెంగాల్ రాజకీయాల్లో ప్రధాన ఆకర్షణగా మారింది. రోడ్‌షోలో షా, అధికారి కలిసి ప్రచార వాహనంపై నిలబడి ప్రజలను అభివాదం చేశారు. మార్గమంతా బీజేపీ జెండాలు ఎగురుతూ ‘పరిబర్తన్’ నినాదాలు వినిపించాయి. బెంగాల్‌లో అక్రమ చొరబాట్లు పెరుగుతున్నాయని షా ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న చొరబాట్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 15 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లోనే ఉండనున్నట్లు షా ప్రకటించారు. ఇదే సమయంలో సువేందు అధికారి కూడా టీఎంసీ ప్రభుత్వంపై అవినీతి, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సమస్యలపై తీవ్ర విమర్శలు చేశారు. 126 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవానీపూర్ పోరు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.
