
భవానీపూర్‌లో మమతా స్థానం భద్రమేనా?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల మైదానంలో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైన పోరాట మైదానంగా మారింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు ఎదురులేని, అజేయమైన నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారితో పోటీపడుతున్నారు. ఈ పోరు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన అసెంబ్లీ యుద్ధంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) దక్షిణ కోల్‌కత్తాలోని తన ఆధిపత్యాన్ని భావోద్వేగంతో, సంస్థాగత బలంతో కొనసాగించాలనుకుంటుంటే, , బీజేపీ సామాజిక గణాంకాలు, ప్రతీకాత్మక ప్రచారం, బూత్-స్థాయి ప్రచారంతో మమతా కోటను బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తోంది.
అభివృద్ధి వర్సెస్ మతం
ఈ పోరు 2021 అసెంబ్లీ ఎన్నికలలో బెనర్జీ-అధికారి మధ్య నందిగ్రామ్‌లో జరిగిన ఎన్నికలను గుర్తు చేస్తోంది. అక్కడ బెనర్జీ ఓడిపోయినా, తర్వాత భవానీపూర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. టీఎంసీ 'పక్కింటి అమ్మాయి' అనే భావోద్వేగ ప్రచారం, సంస్థాగత బలం, అభివృద్ధి కొనసాగింపే ప్రచారంగా ఈ ఎన్నికల్లో పోరాడుతోంది. మరోవైపు బీజేపీ కుల సమీకరణాలు, రామ్‌నవమి ఊరేగింపులు, బూత్ స్థాయి సామాజిక నిర్మాణం ద్వారా ఈ సీటును గెలుచుకోవాలని చూస్తోంది. రాష్ట్ర టీఎంసీ అధ్యక్షుడు సుబ్రత బక్షీ ఆధ్వర్యంలో 'బంగ్లార్ ఉన్నయన్ ఘోరే ఘోరే, ఘోరర్ మేయే భబానీపురే'(బెంగాల్ అభివృద్ధి వైపు సాగుతోంది, భవానీపూర్ తమ సొంత కూతురుని(మమతా బెనర్జీ) వైపు నిలబడాలి) అనే నినాదాన్ని ఉదృతంగా ప్రచారం చేస్తోంది. కౌన్సిలర్లు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి పనులను తెలియజేయాలని, కలహాలను నివారించాలని సూచించారు. నియోజకవర్గం అంతటా టీఎంసీ 'ఫోటో కార్నర్లు' ఏర్పాటు చేసింది, వీటిలో ప్రజలు బెనర్జీ లైఫ్-సైజ్ కటౌట్లతో ఫోటోలు తీసుకోవచ్చు. ముక్తదల్ మోర్‌లో మొదటి బూత్ పై ‘మమతా బెనర్జీ పక్కన నిలబడండి, కలిసి ఫోటో దిగండి, బెంగాల్ కోసం మాట్లాడండి’ అనే విజ్ఞప్తి ఉంది. మేం ఈ ఎన్నికల్లో దూకుడుగా కాకుండా భావోద్వేగంతో, అనుబంధంతో, భవానీపూర్‌లో బెనర్జీ చేసిన పనితో పోరాడుతున్నామని ఒక సీనియర్ టీఎంసీ నేత చెప్పారు.
హిందూవులపై ఆధారపడ్డ సువేందు
భవానీపూర్ విభిన్న కలయికతో 'మినీ-ఇండియా'గా ఉంది. బెంగాలీ భద్రలోక్, మార్వాడీ-గుజరాతీ వ్యాపారులు, సిక్కులు, జైన్ కుటుంబాలు, అదేవిధంగా ముస్లింలు ఉన్నారు. ఓటర్లలో దాదాపు 42శాతం బెంగాలీ హిందువులు, 34% ఇతర హిందువులు, 24శాతం ముస్లింలు ఉన్నారు.
బీజేపీ సమాజ గణాంకాలను ఆధారంగా తీసుకొని సువేందు అధికారి భవానీపూర్‌లో బెనర్జీకి సవాల్ విసురుతున్నారు. బూత్-స్థాయి మ్యాపింగ్ ప్రకారం కాయస్థులు 26.2శాతం, ముస్లింలు 24.5%, ఈస్టిండియా వలస వర్గాలు 14.9%, మార్వాడీలు 10.4%, బ్రాహ్మణులు 7.6శాతం ఉన్నారు. సువేందు అధికారి రామ్ నవమి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పుడు రామరాజ్యాన్ని కోరుకుంటోంది. ప్రజలు బుజ్జగింపు రాజకీయాలతో విసిగిపోయారు. వారు సుపరిపాలన కోరుతున్నారని అన్నారు. ఓటర్ల జాబితా సవరణల వల్ల మరో అలజడి చెలరేగింది. సుమారు 47,000 పేర్లను తొలగించారు, 14,000 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పరిశీలనలో ఉన్నవారిలో 56శాతం ముస్లింలు, మొత్తం ఓటర్లలో ఇది 24% మాత్రమే.
మెజార్టీ విజయమే లక్ష్యంగా టీఎంసీ దూకుడు
టీఎంసీ సీనియర్ నేతలు ఫిరహాద్ హకీమ్, బక్షీ, ఇతరులు భవానీపూర్‌ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ కనీసం 60,000 ఓట్ల తేడాతో ఇక్కడ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో భవానీపూర్‌లో ఎదుగుదలను చూపించి, 2014లో 73 వార్డును గెలుచుకుంది. 2021లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ 58,832 ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే 2024 లోక్‌సభలో 8,297 ఓట్ల ఆధిక్యంలో మాత్రేమే నిలిచింది. దీంతో క్రమంగా అక్కడ మెజార్టీ కోల్పోవడం పార్టీని ఆలోచనలో పడేసింది. ఈ గణాంకాలు భవానీపూర్ ఇక ఎంత మాత్రం అభేద్యం కాదని, టీఎంసీకి అత్యంత కీలకమైన స్థానాన్ని ఇప్పుడు కచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
