Let's talk: editor@tmv.in
భవన నిర్మాణాలకు 'జియోటెక్నికల్ పరీక్ష' కీల‌కం: ఎన్. రామ‌చందర్ రావు

భవన నిర్మాణాలకు 'జియోటెక్నికల్ పరీక్ష' కీల‌కం: ఎన్. రామ‌చందర్ రావు

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణ రంగంలో అత్యాధునిక సాంకేతికత వస్తున్నప్పటికీ, భవనాల భద్రతకు పునాది అయిన 'జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్' (భూసంబంధిత పరిశీలన)ను విస్మరించకూడదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్‌లో నిర్వహించిన ఇంపార్టెన్స్ ఆఫ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ & రికమెండేషన్స్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గతంలో హైదరాబాద్‌లో ఒక ప్రముఖ భవనం పేకమేడలా కూలిపోయిన దుర్ఘటనను గుర్తు చేస్తూ, ఆ తర్వాతే సైట్ టెస్టింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని ఆయన వివరించారు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావడం వల్ల, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం ఎంత కీలకమో తనకు వ్యక్తిగతంగా తెలుసన్నారు. నేల ఎంత బరువును తట్టుకోగలదో తెలియకుండా చేసే నిర్మాణాలు ప్రమాదకరమని ఆయ‌న‌ హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధునిక డిజైన్ల వల్ల రెండేళ్లలో పూర్తయ్యే పనులు ఆరు నెలల్లోనే ముగుస్తున్నాయని, అయితే ఈ వేగంలో నాణ్యతను, జియోటెక్నికల్ పరీక్షలను పక్కన పెట్టవద్దని ఇంజినీర్లకు సూచించారు. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి నిర్మాణానికి భూపరిశీలన తప్పనిసరి అని స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖలు కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, క్షిపణి దాడుల నేపథ్యంలో భవిష్యత్తులో నిర్మాణ రంగం మరిన్ని మార్పులకు లోనవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా విపత్తును తట్టుకోగల బలమైన భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఇంధన రంగంలో హైడ్రోజన్, సోలార్ వంటి ప్రత్యామ్నాయాలు ఎలా వస్తున్నాయో, నిర్మాణ రంగంలో కూడా భద్రత, ఆయుష్షు పెంచే పద్ధతులు రావాలని కోరారు. ప్రతి ఇంజినీర్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌ను ఒక అత్యవసర బాధ్యతగా తీసుకోవాలని రామ‌చందర్ రావు పిలుపునిచ్చారు.

భవన నిర్మాణాలకు 'జియోటెక్నికల్ పరీక్ష' కీల‌కం: ఎన్. రామ‌చందర్ రావు - Tholi Paluku