Let's talk: editor@tmv.in
భారీ స్మగ్లింగ్ దందా గుట్టు రట్టు

భారీ స్మగ్లింగ్ దందా గుట్టు రట్టు

Panthagani Anusha
22 సెప్టెంబర్, 2025

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అటవీశాఖ అధికారులు భారీ విజయం సాధించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఎంతో విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసే ఒక భారీ స్మగ్లింగ్ దందాను ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ.12 కోట్ల విలువైన ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద పట్టివేతల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.

రహస్య స్థావరంపై దాడి

నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో సెప్టెంబర్ 18న అటవీ అధికారులు పాల్ఘర్ తాలూకా దహిసర్ అడవికి సమీపంలో ఉన్న సఖ్రే గ్రామంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో ఇంట్లో రహస్యంగా దాచిన సుమారు 200 బండిళ్ల ఎర్రచందనం దుంగలను గుర్తించారు. కాగా అంతర్జాతీయ అక్రమ మార్కెట్‌లో ఈ సరుకు విలువ రూ.12 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.

దక్షిణాది నుంచే అక్రమ రవాణా

ప్రాథమిక విచారణలో ఈ ఎర్రచందనం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలించినట్లు తేలింది. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనం పట్టుబడటం ఇదే మొదటిసారి అని సీనియర్ అటవీ అధికారులు తెలిపారు. ఈ దుంగలను విదేశాలకు అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా అధికారులు జరిపిన ఈ దర్యాప్తులో 'పుష్ప' అనే పేరు బయటపడింది. ఇది ఈ స్మగ్లింగ్ ముఠాకు చెందిన స్థానిక నాయకుడి పేరు కావచ్చని లేదా స్మగ్లింగ్ కోసం ఉపయోగించిన కోడ్ పేరు కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేరు ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

భారీ స్మగ్లింగ్ దందా గుట్టు రట్టు - Tholi Paluku