Let's talk: editor@tmv.in
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి

Aravind Maryada Reddy
26 సెప్టెంబర్, 2025

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. విద్యుత్ సరఫరా, రోడ్డు ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించారు. వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఇటీవల విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం భేటీకి ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రభుత్వ చర్యలు ప్రజలకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయి? గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి? అన్నది వేచి చూడాలి.

అధికార యంత్రాంగానికి అలర్ట్

వాతావరణశాఖ అంచనాల ప్రకారం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాజ్‌వేలు, వరద నీరు నిలిచే రోడ్డు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకురావాలని కోరారు. వాహనదారులను ముందుగానే హెచ్చరించి ట్రాఫిక్ సమస్యను అదుపులోకి తీసుకురావాలని సూచించారు. విద్యుత్ స్తంబాలకు వేలాడుతున్న వైర్లను తొలగించాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చూడాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సూచించారు.

ఇటీవల విమర్శలు

ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాల సమయంలో సీఎం అధికారులను కఠినంగా కొన్ని సూచనలు చేశారు. రోడ్ల మీద నీరు నిలిచే ప్రదేశాలను వేగంగా గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వం లోపాలను గుర్తించుకుని ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్టు సూచిస్తుంది. గత ఏడాది వర్షాల్లో కేంద్రం నుంచి నిధులు రాలేదని సీఎం ప్రస్తావించారు.విద్యార్థులు, మహిళలు, పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వర్షాలు పంటలకు తీవ్రనష్టం చేస్తున్నాయి. రోడ్లపై చిన్న వ్యాపారులకు ఆర్థిక నష్టం కలుగుతోంది. మునుపటి వరదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు వెచ్చించింది. ఈసారి కూడా త్వరిత రిలీఫ్ ప్యాకేజీలు ప్రకటించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనూ భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు గతంలోనూ ఇబ్బందులకు గురిచేశాయి. 2024 సెప్టెంబర్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అధికారులు ఆలస్యంగా స్పందించడం వల్ల నష్టాలు పెరిగాయి. ఈసారి ముందుగానే ముఖ్యమంత్రి సూచనలు ఇవ్వడం.. ముందస్తు ప్రణాళికలు రచించడంతో ముప్పు ఏమైనా తగ్గుతుందేమో వేచి చూడాలి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే అలర్ట్ చేస్తే రాష్ట్రంలో 20-30 శాతం నష్టాలు తగ్గవచ్చు. అయితే, డ్రైనేజ్ వ్యవస్థలోనూ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వీటికి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వరదను అరికట్టే చర్యల మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. సీఎం ఆదేశాలు యుద్ధ ప్రాతిపదికన స్పందించడంతో కొంత మేరకు ప్రజలను ఇబ్బందుల నుంచి కాపాడొచ్చు. అయితే హైదరాబాద్ లో వరద కష్టాలు తీర్చాలంటే మాత్రం శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాల్సి ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి.

సీఎం ఆదేశాలు అమలు కీలకం

వరద నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులు తక్షణం స్పందించి ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రాజకీయ విమర్శలు, ప్రజా ఆందోళనల మధ్య ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి. అధికారులు నిజంగానే అలర్ట్ గా ఉండి ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి నిర్వాసితులను తరలిస్తే బాగుంటుంది. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే వరద కష్టాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మ్యాన్ హోళ్లు తెరుచుకోవడం.. రోడ్ల మీదకు విపరీతంగా నీరు రావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళ నిత్యం వర్షం పడుతుండటంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది.

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి - Tholi Paluku