
భారీ వర్షాలతో ‘వర్క్ ఫ్రం హోమ్’
తెలంగాణలో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు, నీరు నిలిచిపోవడం, మొదటి గంటలలోనే రోడ్లపై వాహనాల కదలిక భారీ ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. హైదరాబాద్ నగరంలో ఉదయం తేలికపాటి వర్షం సాయంత్రం నాటికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి.
నారాయణపేట జిల్లా నార్వాలో ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల మధ్య 44.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, వికారాబాద్ జిల్లా ముజాహిద్‌పూర్‌లో 44 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో దబీర్పురాలో 28.5 మిల్లీ మీటర్లు, కుత్బుల్లాపూర్‌లో ఆదర్శ్‌నగర్ వద్ద 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, జీహెచ్ఎంసీ ఇతర మున్సిపల్ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. జలమయమైన ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఐటీ కంపెనీలకు కీలక సూచన జారీ చేసింది. వర్షపాతం ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో, ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే అవకాశాన్ని గుర్తించి సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పోలీస్ శాఖ సూచించింది. రాష్ట్రంలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైన పక్షంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
