Let's talk: editor@tmv.in
భర్త ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వండి: సంగీతా విజయ్

భర్త ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వండి: సంగీతా విజయ్

Pinjari Chand
8 మార్చి, 2026

నటుడు విజయ్ భార్య సంగీత విజయ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, తన భర్త ఇంట్లోనే నివసించేందుకు తాత్కాలిక అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కోర్టులో కొత్త అఫిడవిట్ దాఖలు చేసి, ప్రధాన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు లేదా విజయ్ సమాన స్థాయి కలిగిన ప్రత్యామ్నాయ నివాసం కల్పించే వరకు ప్రస్తుత భర్త ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తన పిటిషన్‌లో, 1999 ఆగస్టు 25న చెన్నైలో తమ వివాహం జరిగిందని పేర్కొంటూ స్పెషల్‌ మ్యారేజ్ యాక్ట్‌ 1954, కింద విడాకులు కోరుతూ ప్రధాన పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే విజయ్ నుంచి తగిన స్థాయి శాశ్వత భరణం (పర్మనెంట్ అలిమోనీ) కూడా కోరినట్లు వెల్లడించారు.

కోర్టును ఆశ్రయించే ముందు పరస్పర అంగీకారంతో గౌరవప్రదంగా వివాహ బంధాన్ని ముగించేందుకు ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యపడలేదని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో తాను కోర్టును ఆశ్రయిస్తే భర్త ఇంట్లో ఉండనివ్వమని విజయ్ తరఫు న్యాయవాది తెలిపినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు కుటుంబ స్థాయికి తగిన ఇతర నివాసం లేదని, తాను బ్రిటిష్ పౌరురాలని కూడా ఆమె వెల్లడించారు. ముఖ్య పిటిషన్‌లో ఆమె తమ వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. విజయ్‌కు ఒక నటితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అలాగే తనపై నిరంతరం మానసిక వేధింపులు, నిర్లక్ష్యం, విడిచిపెట్టడం వంటి చర్యలు జరిగాయని పేర్కొన్నారు. అవసరమైతే ఆ నటిని కేసులో రెండో ప్రతివాదిగా చేర్చుతానని కూడా తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు లేదా విజయ్ ప్రత్యామ్నాయ నివాసం కల్పించే వరకు ప్రస్తుత ఇంట్లోనే నివసించే హక్కు కల్పించాలని కోర్టును ఆమె కోరారు. అలాగే ఇంట్లో ఇప్పటివరకు లభిస్తున్న అన్ని సౌకర్యాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సంగీతా విజయ్ దాఖలు చేసిన ఈ విడాకుల పిటిషన్ చెన్నై సమీపంలోని చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసు వచ్చే నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.