
భారత విదేశాంగ విధానం దారెటు?
భారత విదేశాంగ విధానం ఎప్పుడూ ఆదర్శవాదం మరియు వాస్తవవాదం కలయికగా కొనసాగింది. నాగరికతల వారసత్వం, దేశీయ అవసరాలు, ప్రపంచ శక్తి సమీకరణలు దానికి రూపకల్పన చేశాయి. జవహర్లాల్ నెహ్రూ కాలంలోని నిర్జూటత నుండి నేటి మల్టీ-అలైన్మెంట్ దాకా భారత ప్రధాన లక్ష్యం వ్యూహాత్మక స్వతంత్రతనే. అయితే 2017–2021 మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన విధానాలు ఈ దిశలో భారతానికి కొత్త సవాళ్లుతో పాటు కొత్త అవకాశాలను తీసుకువచ్చాయి. అమెరికా యొక్క ధోరణి ఒప్పందాల పట్ల లావాదేవీ ధోరణి, చైనాపై కఠిన వైఖరి వంటి అంశాలు భారతాన్ని మరింత చురుకైన, సమతౌల్యమైన విధానానికి ప్రేరేపించాయి.
స్వాతంత్ర్యం నుండి పోస్ట్ - కోల్డ్ వార్ వరకు:
1947లో స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారత్ అమెరికా–సోవియట్ శీతల యుద్ధ బ్లాకులలో ఏదీ చేరకుండా తటస్థతను ఎంచుకుంది. నెహ్రూ పంచశీల సూత్రాలు, వలస వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు, ఐక్యరాజ్యసమితి ద్వారా శాంతి సహజీవనం వంటి సిద్ధాంతాలతో గ్లోబల్ గౌరవం పొందినా 1962లో చైనా యుద్ధం, పాకిస్తాన్ సవాళ్లు ఆ ఆదర్శవాదానికి పరీక్షపెట్టాయి. 1970-71 లలో సోవియట్ యూనియన్తో స్నేహ ఒప్పందం కుదుర్చుకోవడం, 1974 అణు పరీక్షలు స్వతంత్రతను ప్రదర్శించినా ఆర్థిక బలహీనత వల్ల పరిమితులే ఎక్కువయ్యాయి.
1991లో సోవియట్ పతనం, ఆర్థిక స్వావలంబన తో భారత్ కొత్త దిశలో అడుగుపెట్టింది. ఆసియాతో లుక్ ఈస్ట్ విధానం, అమెరికా-ఇజ్రాయెల్లతో సంబంధాల సాధారణీకరణ మొదలయ్యాయి. 1998లో అణు పరీక్షలు, 2005లో అమెరికా–భారత అణు ఒప్పందం ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది వేశాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
ట్రంప్ వైఖరి – అవకాశం మరియు ఆందోళన:
డొనాల్డ్ ట్రంప్ “అమెరికా ఫస్ట్”అనే నినాదంతో వైట్ హౌస్లోకి అడుగుపెట్టాడు. భారత్కి ఇది మిశ్రమ అనుభవాన్ని అందించింది. సానుకూలంగా చూస్తే, చైనాపై అతని కఠిన వైఖరి భారత భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా మారింది. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో క్వాడ్ చట్రం బలపరిచాడు. ఉన్నత సాంకేతిక రక్షణ ఒప్పందాలు, “ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్” లక్ష్యానికి మద్దతు, “హౌడీ మోడి”, “నమస్తే ట్రంప్” వంటి ప్రజా కార్యక్రమాలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సమీప్యతను పెంచాయి.
కానీ లావాదేవీ శైలి అనేక సమస్యలను తెచ్చింది. భారత్ను “టారిఫ్ కింగ్” అని విమర్శిస్తూ అమెరికా మార్కెట్కి ఎక్కువ ప్రాప్యత కోరాడు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) వాణిజ్య రాయితీలను ఉపసంహరించాడు. H-1B వీసాలపై కఠిన నియంత్రణలు భారత ఐటీ రంగంపై ప్రభావం చూపాయి. కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయాలని ప్రకటించి ఆందోళన కలిగించాడు. అంతర్జాతీయ ఒప్పందాలనుంచి అమెరికా ఆకస్మికంగా వైదొలగడం – పారిస్ వాతావరణ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందం – భారతానికి ఇంధన భద్రత, ప్రాంతీయ దౌత్యంలో కొత్త చిక్కులను తెచ్చింది.
ట్రంప్ కాలం మొదటినుండి విరోధభావంతో నిండింది.భద్రతా సహకారం పెరిగింది కానీ ఆర్థిక ఘర్షణలు ముదిరాయి. 2020 లడాక్ సరిహద్దు సంక్షోభంలో అమెరికా మద్దతు లభించినా, వాణిజ్య పరిమితులు, అనిశ్చిత నిర్ణయాలు భారతావనికి సవాలు అయ్యాయి.
ట్రంప్ తర్వాత - నిరంతర మార్పు:
జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విధానం కొంత స్థిరత పొందినప్పటికీ, ట్రంప్ కాలంలో మొదలైన నిర్మాణాత్మక ధోరణులు కొనసాగాయి. అమెరికా–చైనా మధ్య పోటీ కఠినమైంది .ఇండో–పసిఫిక్ ప్రాధాన్యం పెరిగింది. భారత్ “మల్టీ అలైన్మెంట్” పద్ధతిని కొనసాగిస్తూ అమెరికా, జపాన్, యూరప్, ఆసియాతో బంధాలను బలోపేతం చేస్తూనే రష్యా, బ్రిక్స్, SCO, G20 వేదికలతో కూడా చురుకుగా ఉంది.
భారత విధానం బలాలు:
వ్యూహాత్మక స్థిరత్వం: ట్రంప్ చైనా వ్యతిరేక విధానాన్ని ఉపయోగించి భద్రతా సహకారం పెంచుకుంది.
గ్లోబల్ ప్రతిష్ఠ:
హై ప్రొఫైల్ సమ్మిట్లు, రక్షణ ఒప్పందాలు భారత్ ను ప్రధాన ఇండో–పసిఫిక్ శక్తిగా చాటాయి.
సమతౌల్య దౌత్యం:
అమెరికా ఒత్తిడి మధ్య కూడా రష్యా, మధ్యప్రాచ్యం, గ్లోబల్ సౌత్తో సంబంధాలు కొనసాగించగలిగింది.
ఆర్థిక విస్తరణ:
అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలతో యూరప్, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో కొత్త అవకాశాలు అన్వేషించింది.
కొనసాగుతున్న సవాళ్లు
వాణిజ్య దెబ్బలు:
GSP రాయితీలు కోల్పోవడం, వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోవడం భారత్ బేరసార శక్తిని బలహీనపరిచాయి.
వీసా అనిశ్చితి:
H-1B పరిమితులు టెక్ రంగంలో ప్రతిభా ప్రవాహాన్ని అడ్డుకున్నాయి.
ప్రాంతీయ ఉద్రిక్తతలు:
చైనా, పాకిస్తాన్ సరిహద్దు సమస్యలు ఇంకా భారత్ గ్లోబల్ ఆకాంక్షలకు అడ్డంకిగానే వున్నాయి.
స్పష్టత లోపం:
రష్యా సంబంధాలు అమెరికా అంచనాల మధ్య సమతౌల్యం కష్టతరం అవుతోంది.
ట్రంప్ పరిపాలన ,వ్యక్తిగత నాయకత్వం ప్రపంచ రాజకీయాలపై ఎంత ప్రభావం చూపగలదో గుర్తు చేసింది. కానీ భారత దీర్ఘకాల ప్రయోజనాలు ఎన్నికల చక్రాలకు అతీతమైన స్థిరమైన వ్యూహాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక స్వావలంబన, బహుపాక్షిక వేదికలలో చురుకైన భాగస్వామ్యం ద్వారా భారత్ స్వతంత్ర శక్తిగా నిలవాలి.
ట్రంప్ అనిశ్చిత దశను సమర్థంగా ఎదుర్కొని మరింత ధైర్యంగా, స్వతంత్రంగా బయటపడిన భారత్, ఇప్పుడు ఆ ప్రతిఘటనను శాశ్వత ప్రభావంగా మలచుకోవాలి. అమెరికా వైట్ హౌస్లో ఎవరు ఉన్నా, ప్రపంచ శక్తి సమీకరణలు ఎలా మారినా, భారత స్వతంత్ర వ్యూహాత్మక దౌత్యమే భవిష్యత్తులోనూ దాని గొప్ప బలం అని నిరూపించుకోగలగాలి.
