
భారత్ మద్దతిస్తుందని ఆశిస్తున్నాం!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ రష్యా యుద్ధంలో భారత్ మద్దతుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భారత్ ఎక్కువగా కీవ్ వైపే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయంలో మరికొన్ని సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. భారత్‌తో సంబంధాలు మరింత బలపరచాలని, రష్యా చమురు కొనుగోళ్లపై ఆధారపడటమే సవాలుగా ఉందని చెప్పారు.
ట్రంప్ జోక్యంపై ఆశాభావం
భారత్ ఎక్కువగా ఉక్రెయిన్‌కే మద్దతు ఇస్తున్నట్లు భావిస్తున్నామని జెలెన్ స్కీ చెప్పారు. చమురు కొనుగోళ్ల అంశమే ప్రధాన సమస్య అని, ఈ అంశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరిచేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరోపియన్లు భారత్‌తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. భారత్‌ను ఉక్రెయిన్ మద్దతు నుంచి దూరం చేయకుండా చూడాలని ఆయన చెప్పారు. ఇక చైనాతో ఈ విషయంపై మాట్లాడటం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. చైనా, రష్యా వైపే ఉందని, దాన్ని మార్చటం సాధ్యం కాదని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై జెలెన్ స్కీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వటంలో ట్రంప్ నిబద్ధత చూపారన్నారు. ఉక్రెయిన్ త్వరగా యుద్ధం ముగించాలని కోరుకుంటుందని, ట్రంప్ కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. ఉక్రెయిన్ ప్రజలు యుద్ధం ముగింపు కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పుతిన్ ఏ విషయంలోనూ తమతో అంగీకరించడం లేదని ఆరోపించారు. పుతిన్ యుద్ధంలో తామే గెలుస్తున్నట్లు చెప్పుకుంటున్నా, అతడు గెలవడం లేదన్న విషయం తనకూ తెలుసని వ్యాఖ్యానించారు.
భారత్ సమతుల విదేశాంగ విధానం
జెలెన్‌స్కీ వ్యాఖ్యలు భారత్, ఉక్రెయిన్ మధ్య సంబంధాలకు కొత్త మలుపు తీసుకురావచ్చు. భారత్‌కు రష్యాతో దీర్ఘకాల సంబంధాలున్నాయి. భారత్ చమురు కొనుగోళ్లలో ప్రధానంగా రష్యా మీద ఆధారపడుతోంది. యుద్ధం తర్వాత కూడా భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోంది. ఈ యుద్దం విషయంలో చమురు కొనుగోళ్లే ప్రధానంగా భారత్‌ను తటస్థంగా ఉండేలా చేశాయి. పాశ్చాత్య దేశాలు భారత్‌ను రష్యా నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. జెలెన్‌స్కీ ట్రంప్ సహాయం తీసుకొని భారత్‌ను ఉక్రెయిన్ వైపు మళ్లించాలని చూస్తున్నారు. ఇది భారత్, రష్యా మధ్య సంబంధాల్లో సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. భారత్ తన విదేశాంగ విధానాన్ని సమతుల్యంగా కొనసాగిస్తుంది. రష్యాతో సంబంధాలు కాపాడుకుంటూనే ఉక్రెయిన్‌తో సహకారం పెంచుకోవచ్చు. ఇది ఆసియాలో చైనా ప్రభావాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది.
వ్యూహాత్మక నిర్ణయాలతోనే మేలు
భారత్ ఇప్పటి వరకు ఈ యుద్ధం విషయంలో ఎవరి వైపు నిలబడలేదు. కానీ, యుద్ధం ముగిసేందుకు మద్దతిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలకు సహకారం అందిస్తామని ప్రకటించింది. రష్యాపై ఇప్పటి వరకు ఎలాంటి నిషేధాలు విధించలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఆర్థికంగా లాభపడింది. మరోవైపు ఉక్రెయిన్‌తో రక్షణ, వ్యవసాయ సహకారం కలిగి ఉంది. ప్రధాని మోడీ ఇప్పటికే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. ట్రంప్ ఇప్పటికే రష్యా చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకే భారత్ దిగుమతులపై సుంకాలు పెంచారు. మరోవైపు యూరోపియన్ దేశాలు కూడా భారత్‌పై సుంకాల భారం మోపాలని సూచించారు. జెలన్ స్కీ సైతం రష్యా చమురు కొనుగోళ్లు చేస్తూ కొన్ని దేశాలు యుద్ధానికి మద్దతిస్తున్నాయని పరోక్షంగా భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ శాంతి కోసం మద్దతిస్తూనే దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి.
