Let's talk: editor@tmv.in
భారత్ పై అమెరికా సుంకాలు ఉపసంహరించుకోవచ్చు • ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

భారత్ పై అమెరికా సుంకాలు ఉపసంహరించుకోవచ్చు • ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

FL - BRTH
19 సెప్టెంబర్, 2025

అమెరికా, భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో అమెరికా విధించిన 50 శాతం సుంకాలను నవంబర్ 30 తర్వాత ఉపసంహరించుకునే అవకాశం ఉందని భారత ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్యం పరిమితుల సడలింపునకు అవకాశం ఉందని అన్నారు. గురువారం కోల్ కతాలోని మర్చంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలను తాను కూడా ఊహించలేదని ఆయన అన్నారు. 25 శాతం సుంకాలు విధించడానికి భౌగోళిక,ఆర్థిక రాజకీయాలు కారణమని తాను నమ్ముతానని అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలను గమనించినప్పుడు నవంబర్ 30 తర్వాత సుంకాలు ఉండకపోవచ్చని తాను నమ్ముతున్నట్టు ఆయన తెలిపారు. అమెరికాతో భారత్ వాణిజ్య చర్చలను ప్రస్తావిస్తూ.. రాబోయే రెండు నెలల్లో సుంకాలకు ఒక పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. భారత ఎగుమతులు ఏటా 850 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, జీడీపీలో 25శాతంగా, 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా ఎగుమతులు ఉన్నాయని తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు సంకేతంగా అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో అనంత నాగేశ్వరన్ ఈ రకమైన ఆశాభావం వ్యక్తం చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్ పై అమెరికా సుంకాలు ఉపసంహరించుకోవచ్చు • ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ - Tholi Paluku