Let's talk: editor@tmv.in
భార‌త్ దాడిలో మా కార్యాల‌యం ధ్వంస‌మైంది

భార‌త్ దాడిలో మా కార్యాల‌యం ధ్వంస‌మైంది

Venkatesh Balusula
20 సెప్టెంబర్, 2025

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో లష్కర్ ఏ తోయిబా మురిడ్కే క్యాంప్ ధ్వంసమైందని గ్రూప్ కమాండర్ ఖాసిం అంగీక‌రించాడు. ఈ మేర‌కు ఆయ‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ దాడి తమ ప్రధాన కార్యాలయానికి తీవ్ర నష్టం కలిగించిందని, దాన్ని మళ్లీ గతంలో కంటే పెద్దగా నిర్మిస్తామ‌ని ఖాసిం చెప్పాడు. ఈ వీడియో పాకిస్థాన్ దావాలను ధ్వంసం చేస్తూ, భారత దాడి ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది.

పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతంలోని షేఖుపురా జిల్లాలో ఉన్న మురీడ్కేలో మార్కజ్ తైబా అనే ఎల్‌ఈటీ ప్రధాన కార్యాల‌యం ఉంది. ఆప‌రేష‌న్ సిందూర్‌లో భారత సైన్యం దాడులు చేసిన ఉగ్ర శిబిరాల్లో ఇది ప్ర‌ధాన క్యాంపుగా తెలుస్తోంది. ఈ దాడులు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో 26 మంది పౌరులను ఉగ్రవాదులు చంపిన దాడికి ప్రతీకారంగా చేశారు. వీడియోలో ఖాసిం కార్యాల‌యం ధ్వంసమైన చోట నిలబడి మాట్లాడుతూ "నేను మురీడ్కేలోని మార్కజ్ తైబా శిథిలాల‌ ముందు నిలబడ్డాను. భారత్‌ దాడిలో ఇది కూలిపోయింది. పునర్నిర్మాణం ప్రారంభమైంది. దేవుడి అనుగ్రహంతో దీన్ని ముందు కంటే పెద్దగా నిర్మిస్తాం" అని చెప్పాడు. ఈ క్యాంప్‌లో చాలా మంది ముజాహిదీన్లు, విద్యార్థులు శిక్షణ పొంది విజయం సాధించారని కూడా అన్నాడు. పాకిస్థాన్ ఈ భవనాన్ని ఉగ్రవాదులు ఉపయోగించడం లేదని చెప్పింది. మరో వీడియోలో ఖాసిం పాకిస్థాన్ యువకులు మురీడ్కే మార్కజ్ తైబాలోని దౌరా ఈ సుఫా అనే శిక్షణ కార్యక్రమంలో చేరాల‌ని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం మతపరమైన శిక్షణతో పాటు ప్రాథమిక జిహాద్ శిక్షణ అందిస్తుంది.

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాక్‌లో తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపై దాడి చేసింది. ఇందులో ఎల్‌ఈటీ మురీడ్కే క్యాంప్‌తో పాటు జైష్ ఈ మహమ్మద్ బహావల్పూర్ బేస్, హిజ్బుల్ ముజాహిదీన్ సియాల్‌కోట్ క్యాంప్, ఎల్‌ఈటీ బర్నాలా, ముజఫ్ఫరాబాద్ త‌దిత‌ర కేంద్రాలున్నాయి. ఎల్‌ఈటీ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మురీడ్కే క్యాంపు పునర్నిర్మాణానికి నిధులు ఇచ్చాయని చెప్పాడు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం ఎల్‌ఈటీ ఈ క్యాంప్‌ను మళ్లీ నిర్మిస్తోంది. 2026 ఫిబ్రవరి 5న క‌శ్మీర్ సాలిడారిటీ డేకు దీన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మళ్లీ శిక్షణ, మతపరమైన ప్రచారం, కార్యాచరణల కేంద్రంగా పనిచేస్తుందని సమాచారం. గతంలో జైష్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కాష్మీరీ, మసూద్ అజ్హర్ కుటుంబం బహావల్పూర్ దాడిలో ధ్వంసమైంద‌ని చెప్పాడు. పాక్ సైన్యాధిప‌తి అసిమ్ మునీర్ దాడిలో చనిపోయిన వారి అంత్యక్రియలకు జనరల్స్‌ను పంపార‌ని కూడా చెప్పాడు. భార‌త నిఘా వ‌ర్గాలు ఎంత చురుగ్గా ఉన్నా ఉగ్ర‌వాదుల నుంచి ముప్పు త‌ప్ప‌డం లేదు. ఈ క్యాంపు పున‌ర్నిర్మాణంతో మ‌ళ్లీ ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త సైన్యం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

భార‌త్ దాడిలో మా కార్యాల‌యం ధ్వంస‌మైంది - Tholi Paluku