Let's talk: editor@tmv.in
భారత్‌, చైనాపై బెదిరింపులు పని చేయవు

భారత్‌, చైనాపై బెదిరింపులు పని చేయవు

Venkatesh Balusula
20 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలపై విధించిన సుంకాల‌ బెదిరింపులు పని చేయవని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఈ రెండు దేశాలు పురాతన నాగరికతలు క‌లిగి ఉన్నాయ‌ని, వాటిని ఒత్తిడి చేసి మార్చలేమని రష్యా టీవీ కార్యక్రమం "ది గ్రేట్ గేమ్"లో చెప్పారు. "భారత్, చైనాలు ఎంతో గొప్ప చ‌రిత్ర క‌లిగిన దేశాలు. అలాంటి దేశాల‌పై ఆధిపత్య ధోరణితో నాకు నచ్చనిది ఆపకపోతే సుంకాలు విధిస్తా అని బెదిరింపుల‌కు గురి చేయ‌డం పని చేయదు. ఇప్ప‌టికే సుంకాల పెంపు అనంత‌రం ఢిల్లీ, బీజింగ్‌తో జరుపుతున్న చర్చల‌తో అమెరికాకు ఈ విషయం అర్థమై ఉంటుంది" అని లావ్రోవ్ అన్నారు.

ట్రంప్ విధానాల‌పై రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌

ట్రంప్ ఈ ఏడాది భారత్‌ను సుంకాల మ‌హారాజుగా అభివ‌ర్ణించాడు. రష్యా నుంచి చమురు కొనడం వల్ల ఉక్రెయిన్ యుద్ధానికి భార‌త్‌ నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. దీంతో భారత్‌ ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించారు. ఇటీవల ట్రంప్ తన వైఖరి మార్చుకున్న‌ట్టు కనిపిస్తోంది. యూకే పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, ఆయన 75వ జన్మదినం సందర్భంగా ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. ఈ సంద‌ర్భంగా లావ్రోవ్ మాట్లాడుతూ భారత్, చైనా అమెరికా ఒత్తిడిని తిప్పికొట్టాయని, తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకున్నాయని చెప్పారు. "ఈ ఒత్తిడి ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బ తీస్తుంది, కొత్త మార్కెట్లు, ఇంధన వనరుల అన్వేష‌ణ‌కు బలవంతం చేస్తుంది, ఎక్కువ ధరలు చెల్లించేలా చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఈ విధానానికి నైతిక, రాజకీయ వ్యతిరేకత ఉంది" అని చెప్పారు. రష్యాపై కొత్త ఆంక్షల బెదిరింపుల గురించి లావ్రోవ్ మాట్లాడుతూ కొత్త ఆంక్షలతో ఎటువంటి సమస్య లేద‌న్నారు. ట్రంప్ మొదటి పర్యాయంలోనే భారీ ఆంక్షలు విధించార‌ని, దానికి అలవాటు పడ్డామ‌ని చెప్పారు. బైడెన్ పాల‌న‌లో దౌత్య ప్రయత్నాలకు బదులుగా ఆంక్ష‌లు మోపార‌ని విమర్శించారు.

ర‌ష్యా, చైనాల‌తో బ‌ల‌ప‌డుతున్న బంధం

ఉక్రెయిన్ యుద్ధం ఆపాల‌ని ట్రంప్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ష్యాను ఆర్థికంగా ఇబ్బందుల‌కు గురి చేయాల‌ని భావిస్తున్నారు. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లు చేస్తున్న భార‌త్‌, చైనాల‌పై సుంకాల భారం మోపాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే భార‌త్‌పై ఇది అమ‌లు చేశారు. కానీ, ఈ రెండు దేశాలు చ‌మురు కొనుగోళ్ల‌పై వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. చైనాలో నిర్వ‌హించిన ఎస్‌సీవో స‌ద‌స్సు భార‌త్, చైనా, ర‌ష్యా బంధాన్ని బ‌లోపేతం చేసింది. ఈ స‌ద‌స్సులో పుతిన్‌, జిన్ పింగ్‌, మోడీ క‌లిసిన చిత్రాలు అమెరికాలో వ‌ణుకు పుట్టించాయి. ప్రాశ్చాత్య దేశాల‌కు వ్య‌తిరేకంగా మ‌రో కూట‌మి పురుడు పోసుకుంటుంద‌న్న సంకేతాలు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో చైనా సైనిక ప‌రేడ్ సంచ‌ల‌నంగా మారింది. అత్యాధునిక ఆయుధాల‌తో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించింది. ఇందులో ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ స‌హా సుమారు 20కి పైగా దేశాల అధినేత‌లు పాల్గొన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అమెరికాపై కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని అభ‌ద్ర‌తా భావం వ్య‌క్తం చేశారు. ఏదేమైనా అమెరికా సుంకాల పెంపు భార‌త్‌ను చైనా, ర‌ష్యాల‌కు ద‌గ్గ‌ర చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. ఈ నేప‌థ్యంలో త్వరలో చైనాతో ఉన్న స‌రిహ‌ద్దు, వాణిజ్య స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కానున్నాయి.

భారత్‌, చైనాపై బెదిరింపులు పని చేయవు - Tholi Paluku