
భారత కాన్సులేట్ను ముట్టడిస్తాం!
కెనడాలోని వాంకోవర్లో ఉన్న భారత కాన్సులేట్ను నేడు ముట్టడిస్తున్నట్లు నిషేధిత ఖలీస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ వెల్లడించింది. భారతీయ కెనడియన్లు ఎవ్వరూ నేడు కాన్సులేట్కు రావొద్దని హెచ్చరించింది. ఈ నోటీసులను స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నోటీసులో మాజీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలను కూడా ప్రస్తావించారు. ఖలిస్థానీ విడిపోవాలని కోరుకునే నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్లు పాల్గొన్నారని ట్రూడో ఆరోపించారు. భారత కాన్సులేట్లు ఖలిస్థాన్ రిఫరెండం కోసం ప్రచారం చేసేవారిపై గూఢచర్య నెట్వర్క్ నడుపుతున్నాయని సంస్థ ఆరోపించింది.
ఆరోపణలు తోసిపుచ్చినా తప్పడంలేదు
నేడు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల పాటు కాన్సులేట్ను ముట్టడి చేస్తామని ఖలిస్థానీ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించింది. కెనడాలో భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గూఢచర్యం, బెదిరింపులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాన్సులేట్ సాధారణ సందర్శన కోసం వచ్చే వారు ఈరోజు రావొద్దని స్పష్టం చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన పోస్టర్లో భారత హై కమిషనర్ డిజిగ్నేట్ దినేష్ పట్నాయక్ చిత్రాన్ని ముద్రించి, ఆయన ముఖంపై టార్గెట్ గుర్తు పెట్టారు. దీనిపై "కెనడాలో భారత హిందుత్వ టెర్రర్ కొత్త ముఖం" అని రాశారు. ఈ రెచ్చగొట్టే సందేశంతో కాన్సులేట్పై చర్యకు పిలుపునిచ్చారు. 2023లో నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్, కెనడా దౌత్య సంబంధాలు క్షీణించాయి.
దాదాపు రెండేళ్లకు ఈ బెదిరింపులు రావడం గమనార్హం. భారత్ ఈ ఆరోపణలను ఖండించి, హై కమిషనర్తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను మార్చింది. ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరచడానికి ఇటీవల రెండు దేశాలు కొత్త హై కమిషనర్లను నియమించాయి. స్పెయిన్లో భారత రాయబారిగా ఉన్న దినేష్ పట్నాయక్, త్వరలో ఒట్టావాలో బాధ్యతలు స్వీకరిస్తారు. కెనడా నుంచి క్రిస్టోఫర్ కూటర్ నియమితుడు. ఈ నోటీసులో ఖలిస్తానీ నాయకుడు, సిక్స్ ఫర్ జస్టిస్ కోఆర్డినేటర్ ఇందర్జీత్ గోసల్కు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గోసల్ను గతేడాది గ్రేటర్ టొరంటో ఏరియాలో హిందూ ఆలయంపై దాడి తర్వాత అరెస్ట్ చేశారు. ఎస్ఎఫ్జే బెదిరింపుతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాన్సులేట్ చుట్టూ భద్రత పెంచేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం
ఇటీవల నూతన కమిషన్ల నియామకంతో భారత్, కెనడా మధ్య సంబంధాలు మళ్లీ చిగురిస్తున్నట్లు భావించినా, తాజాగా సిక్స్ ఫర్ జస్టిస్ బెదిరింపులతో దౌత్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఆరోపణలే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండిస్తున్నాఎస్ఎఫ్జే ఈ సంఘటనను ఉపయోగించి ఖలీస్థానీ రిఫరెండం ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఎస్ఎఫ్జే పోస్టర్లో దినేష్ పట్నాయక్పై చిహ్నాలు, హిందుత్వ టెర్రర్ అనే పదాలు వాడి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది కెనడాలోని భారతీయ సమాజంలో భయాందోళనలను కలిగిస్తుంది. ఇప్పటికే ఆలయ దాడి సంఘటనతో ఖలిస్థానీ గ్రూపులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. భారత్ ఈ బెదిరింపును తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. కాన్సులేట్ భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ జోక్యంతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉన్నా, ఇరు దేశాల సంబంధాలపై మధ్య తీవ్ర ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
