Let's talk: editor@tmv.in
భార‌త్‌, అమెరికా మ‌ధ్య చ‌ర్చ‌లు షురూ!

భార‌త్‌, అమెరికా మ‌ధ్య చ‌ర్చ‌లు షురూ!

Venkatesh Balusula
23 సెప్టెంబర్, 2025

అమెరికా అదనపు సుంకాలు, హెచ్‌1బీ వీసా రుసుము పెంపు వంటి కీలక నిర్ణ‌యాల అనంత‌రం భార‌త్‌, అమెరికా మ‌ధ్య ద్వైపాక్షిక‌ చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. కొద్ది రోజులుగా ఇరు దేశాల మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్చ‌లు అంత‌ర్జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. భార‌త విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సోమవారం న్యూయార్క్‌లో 80వ ఐక్య రాజ్య‌ సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో క‌లిశారు. ఈ భేటీ రెండు దేశాల మధ్య ఇటీవలి వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం అమెరికన్ ప్రతినిధులతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు నిర్వ‌హించారు.

చ‌ర్చ‌ల‌పై ట్రంప్ ఆశాభావం

జైశంకర్, రూబియో గతంలో జూలైలో వాషింగ్టన్‌లో జరిగిన 10వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కలిశారు. అంతకుముందు జనవరిలో కూడా చర్చలు జరిపారు. భార‌త్, ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తున్న కార‌ణంగా ట్రంప్ భార‌త దిగుమతులపై 50 శాతం విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్ర‌మంలో ఇరు దేశాల నేత‌లు ప‌ర‌స్ప‌రం తీవ్ర వ్యాఖ్య‌లు చేసుకున్నారు. చ‌మురు కొనుగోల్లు నిలిపివేయాల‌ని ట్రంప్ భార‌త్‌ను బ‌హిరంగంగానే హెచ్చ‌రించారు. దీనికి భార‌త విదేశాంగ శాఖ ధీటుగా స‌మాధాన‌మిచ్చింది. దేశ ప్ర‌యోజ‌నాల కోస‌మే కొనుగోళ్లు చేస్తున్నామ‌ని, ఒత్తిళ్ల‌కు లొంగే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది. అనంత‌రం ట్రంప్ మాట మార్చి భార‌త్‌తో సంబంధాల‌పై, ప్ర‌ధాని మోడీతో బంధంపై సానుకూల వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ట్రంప్ ఒప్పందం సులభంగా కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భార‌త్‌పై హెచ్‌1బీ పిడుగు

సుంకాల అనంత‌రం అమెరికా తీసుకున్న మ‌రో నిర్ణ‌యం భార‌త్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అదే హెచ్1బీ వీసా ద‌ర‌ఖాస్తు రుసుము పెంపు. ట్రంప్ నైపుణ్యం కలిగిన టెక్ కార్మికుల కోసం వీసాలపై ల‌క్ష డాలర్ల ఫీజు విధిస్తూ ఆదేశం జారీ చేయడంతో అమెరికాలోని భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిబంధన కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటి వీసా హోల్డర్లకు కాదని వైట్ హౌస్ స్పష్టం చేసినప్పటికీ, అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంలో ట్రంప్ నామినేట్ చేసిన భారత‌ అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశం, అమెరికా మ‌ధ్య బ‌ల‌మైన బంధం ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో 21వ శతాబ్దంలో ఇదొక గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భారతదేశం, అమెరికా దీర్ఘకాల బంధంపై వ్యూహాత్మక దృష్టిలో నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు. విదేశాంగ శాఖ భేటీ అనంత‌రం వాషింగ్టన్‌లో ఇరు దేశాల మ‌ధ్య‌ వాణిజ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ భారత ప్ర‌తినిథుల బృందంతో హాజ‌ర‌య్యారు. సెప్టెంబర్ 16న అమెరికా వాణిజ్య అధికారులు భారతదేశానికి వచ్చినప్పుడు సానుకూల చర్చలు జరిగాయని, ఒప్పందం కోసం రెండు వైపులా తీవ్రంగా చర్చలు కొనసాగించాలని అంగీకరించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఐరాస ఆరు ప్రధాన విభాగాల్లో ఒకటి. ఇక్కడ 193 సభ్య దేశాలు సమాన ఓటు హక్కుతో పాల్గొంటాయి. దేశం పరిమాణం లేదా శక్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ప్రతి దేశానికి ఒక ఓటు ఉంటుంది. ఈ వేదిక ప్రపంచ సవాళ్లను, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధి, అంతర్జాతీయ చట్టం, మానవ హక్కులను చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది. 80వ స‌మావేశాల్లో ప్రపంచ నాయకులు, విదేశాంగ మంత్రులు కలిసి రానున్న ఏడాది కోసం బహుపాక్షిక సహకారానికి దిశానిర్దేశం చేస్తారు. ఈ స‌మావేశంలో జైశంకర్ భారతదేశం ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. ఇందులో గ్లోబల్ సంస్థల సంస్కరణ, గ్లోబల్ సౌత్ గొంతుకను బలోపేతం చేయడం, ఉగ్రవాద నిరోధక చర్యలకు మద్దతు, వాతావరణ చర్యలు, సాంకేతిక సహకారం వంటి అంశాలున్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వారధిగా భారతదేశం పాత్రను, శాంతి పరిరక్షణ, విప‌త్తుల‌పై స్పందన, సుస్థిర అభివృద్ధిలో ఢిల్లీ సహకారంపై ఆయ‌న సెప్టెంబ‌ర్ 27న‌ కీల‌క ప్ర‌సంగం ఇవ్వ‌నున్నారు. తాజా ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో ఈ చ‌ర్చ‌లు ఇరు దేశాలకు ఎంతో కీల‌క‌మైన‌విగా భావిస్తున్నారు. సుంకాలు, హెచ్‌1బీ వీసాల‌తో పాటు, ఇరు దేశాల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండే ఒక వాణిజ్య ఒప్పందం జ‌రిగే అవ‌కాశం ఉంది.

భార‌త్‌, అమెరికా మ‌ధ్య చ‌ర్చ‌లు షురూ! - Tholi Paluku