Let's talk: editor@tmv.in
భారత్‌లో 'హైడ్రోజన్ హైవేలు'

భారత్‌లో 'హైడ్రోజన్ హైవేలు'

Shaik Mohammad Shaffee
27 సెప్టెంబర్, 2025

పర్యావరణ అనుకూల రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి భారత్ మరో కీలక ముందడుగు వేస్తోంది. దేశంలో హైడ్రోజన్ హైవేలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రకటించారు. ఎస్&పీ గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ నిర్వహించిన 'వరల్డ్ హైడ్రోజన్ ఇండియా' సదస్సులో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సుస్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.

కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ, ప్రస్తుతం భారతదేశం తన ఇంధన అవసరాలలో 87 శాతం ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతోందని, దీనికి ఏటా దాదాపు రూ.22 లక్షల కోట్లు ఖర్చు అవుతోందని, ఈ భారాన్ని తగ్గించాలంటే హైడ్రోజన్ ఇంధనాన్ని ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు.

‘భారతదేశం ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ వాహనాలకు (ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్) మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా అవసరం. ఇందులో భాగంగా మేము ప్రధాన జాతీయ రహదారుల వెంబడి హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, వాటిని హైడ్రోజన్ హైవేలుగా మార్చే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం’ అని తెలిపారు.

“హైడ్రోజన్ అనేది భవిష్యత్తు ఇంధనం. మేము ప్రపంచంలోనే మొట్టమొదటి భారీస్థాయి హైడ్రోజన్ ట్రక్కుల ట్రయల్స్‌ను ప్రారంభించాం. ఈ ట్రయల్స్‌ కోసం పది రూట్లలో 37 వాహనాలతో ఐదు కన్సార్టియంలకు ప్రభుత్వం రూ.500 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేసింది. పారిశ్రామిక భాగస్వాములలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, వోల్వో, బీపీసీఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, రిలయన్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ ట్రయల్స్‌కు మద్దతుగా తొమ్మిది హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఈ కారిడార్లు భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ హైవేలుగా పనిచేసి, పరిశుభ్రమైన, సుదూర రవాణా కోసం ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తాయి” అని గడ్కరీ వివరించారు.

కాగా ఈ ట్రయల్స్‌ను రెండేళ్ల పాటు దేశంలోని కీలకమైన మార్గాల్లో నిర్వహిస్తారు. వీటిలో గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ఆగ్రా, భువనేశ్వర్, కోణార్క్, పూరీ, వడోదర, సూరత్, సాహిబాబాద్, ఫరీదాబాద్, పూణే, ముంబై, జంషెడ్‌పూర్, కళింగ, తిరువనంతపురం, జామ్‌నగర్, అహ్మదాబాద్, కొచ్చి, విశాఖపట్నం వంటి నగరాలు ఉన్నాయి. ఈ మార్గాలు పారిశ్రామిక క్లస్టర్‌లు, నౌకాశ్రయాలు (పోర్టులు), సరుకు రవాణా కారిడార్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం వాహనాలకు మాత్రమే పరిమితం కాకుండా హైడ్రోజన్ ఉత్పత్తి, కంప్రెషన్, నిల్వ, రవాణా, రీఫ్యూయలింగ్ మౌలిక సదుపాయాలను కవర్ చేస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు.

ఈ హైవేల అభివృద్ధి ద్వారా, ప్రభుత్వ దృష్టి కేవలం రహదారుల నిర్మాణంపైనే కాకుండా, భవిష్యత్తు తరాలకు అనుగుణంగా ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై కూడా ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ పరిరక్షణకు ఏకకాలంలో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని, 6 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని, రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. దీని ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతులు ఏటా రూ.1 లక్ష కోట్లు తగ్గుతాయని, 2050 నాటికి 3.6గిగా టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా.

ఎందుకు హైడ్రోజన్ హైవేలు?

హైడ్రోజన్ వాహనాలు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు సుదూర ప్రయాణంలో ఛార్జింగ్ సమస్యలు ఉంటాయి. కానీ హైడ్రోజన్ వాహనాలు తక్కువ సమయంలో ఇంధనం నింపుకొని ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఇది లాంగ్-హాల్ ట్రక్కులు, బస్సులకు ఎంతో అనుకూలం. హైడ్రోజన్‌ను దేశీయంగానే 'గ్రీన్ హైడ్రోజన్' రూపంలో ఉత్పత్తి చేయగలిగితే ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. హైడ్రోజన్ హైవేలను ప్రస్తుతం అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో అభివృద్ధి చేస్తున్నారు.

భారత్‌లో 'హైడ్రోజన్ హైవేలు' - Tholi Paluku