
భారతీయుల ప్రతిభకు భయపడ్డారు
Pinjari Chand
22 సెప్టెంబర్, 2025
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. పలు కీలక వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అమెరికా అధికారులతో చర్చించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో పర్యటనకు ముందు మీడియా ఆయనను హెచ్ 1 బీ వీసాకు సంబంధించి ఓ ప్రశ్న అడిగింది. ఆయన దానికి సమాధానమిస్తూ మన దేశ యువత ప్రతిభను చూసి ట్రంప్ భయపడినట్లున్నారని చమత్కరించారు. అయితే ఇప్పటికే వీసా వార్షిక ఫీజు లక్ష డాలర్లుగా చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి గోయల్ ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. మన వాళ్ల అద్భుత ప్రతిభను చూసి అమెరికా దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసిందని నవ్వుతూ సెటైర్లు వేశారు. మన ప్రతిభను చూసి వారు భయపడితే దానికి ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
