
భారతీయుల నెత్తిన ట్రంప్ పిడుగు!
అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి అమెరికా వలస విధానంలో మార్పులు తీసుకొస్తామంటూ చెప్పుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు వేశారు. విదేశీ నిపుణులకు అమెరికా ఇచ్చే ప్రత్యేకమైన వీసా హెచ్1బీ దరఖాస్తు రుసుం 2,500 డాలర్ల నుంచి ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.88 లక్షలకు సమానం. ఈ మేరకు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. హెచ్1బీ వీసాలు వినియోగించుకునే వారిలో సుమారు 70 శాతం మంది మన వాళ్లే ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం మాత్రం దేశ భద్రత, ఆర్థిక వెసులుబాటు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఈ నిర్ణయం నేటి నుంచే అమలు కానుంది.
నైపుణ్యం కలిగిన వారికే అవకాశం
ట్రంప్ ఈ మేరకు హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుం పెంపునకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. ఈ చర్యలతో టెక్నాలజీ రంగానికి, ముఖ్యంగా భారత్, చైనా నుంచి వచ్చే నైపుణ్యవంతమైన కార్మికులపై భారీ ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు నైపుణ్యం కలిగిన కార్మికులే కావాలని, ఈ నిర్ణయంతో తమకు కావాల్సిన నిపుణులు మాత్రమే దేశానికి వస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యంత దుర్వినియోగానికి గురవుతున్న వీసాల్లో హెచ్1బీ వీసాలు అగ్ర స్థానంలో ఉన్నాయని వైట్ హౌస్ సిబ్బంది కార్యదర్శి విల్ షార్ఫ్ అన్నారు. ఈ దరఖాస్తు రుసుం పెంపుతో కంపెనీలు అత్యంత నైపుణ్యం కలిగిన వారినే నియమించుకేనే అవకాశం ఉందన్నారు.
భారతీయులపై నోరుపారేసుకున్న హోవార్డ్
ఈ ప్రణాళికలో భాగంగా అసాధారణమైన, అత్యంత గొప్ప స్థాయి వ్యక్తులు మాత్రమే అమెరికాకు వచ్చి అమెరికన్లకు ఉద్యోగాలు, వ్యాపారాలు సృష్టించాలని వాణిజ్య మంత్రి హొవార్డ్ లట్నిక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రోగ్రాం సరికాదని, సగటున 66 వేల డాలర్ల వేతనం పొందే కిందిస్థాయి వారిని తీసుకుంటున్నామని పరోక్షంగా భారతీయులను ఉద్దేశిస్తూ అవమానకర విమర్శలు చేశారు. ఏటా అమెరికాకు 2.81 లక్షల మంది వస్తున్నారని, వీరు సగటు అమెరికన్ కంటే తక్కువ సంపాదిస్తున్నారని చెప్పారు. ఈ ఉద్యోగులు ప్రభుత్వ సహాయం పొందే అవకాశం ఐదు రెట్లు ఎక్కువ అని, త్వరలో దీన్ని నిలిపివేస్తామని లుట్నిక్ తెలిపారు. మరోవైపు లుట్నిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లుట్నిక్ మొదటి నుంచి భారత్‌పై అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హెచ్1బీ వీసా అంటే ఏమిటి?
హెచ్1బీ వీసా అనేది అమెరికా ప్రభుత్వం విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే ఒక ప్రత్యేకమైన వీసా. ఇది ముఖ్యంగా విదేశీ నిపుణుల కోసమే రూపొందించారు. ప్రత్యేకించి సాంకేతిక రంగాల్లో పని చేయాలనుకునే వారికి ఇది వారి వారి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించి అమెరికాలో తాత్కాలికంగా పని చేయడానికి అవకాశం ఇస్తుంది. ఈ వీసాను ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు, డాక్టర్‌లు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక రంగం, గణాంకాలు సంబంధించిన వాటిలో నిపుణులకు ఇస్తారు. ఉద్యోగి వీసా కోసం అమెరికాలోని కంపెనీ అమెరికా పౌరసత్వ, వలస వ్యవహారాల సేవా సంస్థకు దరఖాస్తు చేస్తుంది. దీని గరిష్ట వ్యవధి మూడేళ్లు ఉంటుంది. ఆ తర్వాత మరో మూడేళ్ల వరకు దీనిని పొడిగించవచ్చు. ఈ వీసాలకు భారీ డిమాండ్ ఉండటంతో లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతుంది. ఏటా సుమారు 85 వేల వరకు వీసాలను విడుదల చేస్తారు. ఇందులో 65 వేల వరకు జనరల్ విభాగం, అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పొందిన వారి కోసం మరో 20 వేల వరకు కేటాయిస్తారు. ఈ వీసాతో తాత్కాలిక ఉద్యోగిగా చేరినా అమెరికాలో శాశ్వత నివాసం పొందే అవకాశం ఉంది. సదరు కంపెనీ ఉద్యోగి స్థానికంగా పని చేయగలడని, అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నాడని గుర్తిస్తే గ్రీన్‌కార్డ్‌కు సిఫార్సు చేస్తుంది. దీంతో శాశ్వతంగా అమెరికాలో స్థిరపడే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం వీసాల దరఖాస్తు పరిశీలనా విధానాల్లో మరిన్ని మార్పులు తీసుకురావచ్చని బ్లూమ్‌బెర్గ్ పత్రిక ఓ నివేదికలో తెలిపింది. వీసా పొందిన వారికి అమెరికన్ సహోద్యోగులతో సమాన వేతనం, పని పరిస్థితులు ఇవ్వాల్సి ఉంటుంది.
గ్రీన్ కార్డ్ పరీక్షల్లోనూ మార్పులు
అమెరికాలో శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ట్రంప్ ప్రభుత్వం షాకిస్తోంది. అమెరికా ప్రభుత్వం ఈ దరఖాస్తుదారులకు మొదటి నుంచి పలు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో అమెరికా చరిత్ర, స్థానిక ప్రభుత్వం, ఆంగ్ల భాషపై అవగాహన, చదవడం, రాయడం, మాట్లాడడానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఇందులో వంద ప్రశ్నలు ఉండేవి. వీటిలో నుంచి ఏవైనా పది ప్రశ్నలు అడిగితే కచ్చితంగా కనీసం ఆరింటికి సరైన సమాధానం చెప్పాల్సి ఉండేది. ఈ ప్రక్రియలో ట్రంప్ స్వల్ప మార్పులు చేశారు. ట్రంప్ గత పాలనలో దీనిని 128 ప్రశ్నలకు పెంచారు. వీటిలో 20 ప్రశ్నలు అడిగే వారు, కచ్చితంగా 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సి ఉండేది. కానీ, బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టాక దీన్ని పాత పద్ధతిలోకే మార్చి వంద ప్రశ్నల మార్గదర్శకాలను అనుసరించారు. ప్రస్తుతం మళ్లీ ట్రంప్ నిర్ణయం ప్రకారమే మార్చి అనుసరిస్తున్నా తాజాగా ఇందులో కూడా భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
భారతీయులపైనే తీవ్ర ప్రభావం
హెచ్1బీ వీసాలు పొందే వారిలో భారతీయులే మొదటి స్థానంలో ఉంటున్నారు. విద్యా, ఉద్యోగాల నిమిత్తం భారీ ఎత్తున భారతీయులు అమెరికాకు వెళ్తుంటారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది 71 శాతం వీసాలు మన వాళ్లకే ఇచ్చారు. చైనా 11.7 శాతంతో రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ పత్రికా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి అర్ధ వార్షికంలో అమెజాన్, దాని క్లౌడ్ యూనిట్ ఏడబ్ల్యూఎస్ నుంచి 12 వేలకు పైగా హెచ్1బీ వీసాలు ఆమోదం పొందాయి. మైక్రోసాఫ్ట్, మెటా వేదికలకు రెండింటికీ చెరో 5 వేలకు పైగా వచ్చాయి. ఇలా ఒక్కో కంపెనీ తమ అవసరాల మేరకు వీసాలు పొందుతూ ఉంటుంది. ఈ వీసా దరఖాస్తు రుసుం పెంపుతో భారతీయుల అమెరికా కలలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ట్రంప్ నిర్ణయంతో వీసా పొందేందుకు కంపెనీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హెచ్1బీ వీసాకు కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఆరేళ్ల వరకు గడువు ఉంటుంది. ఈ గడువు ముగిసిన ప్రతిసారి వీసా పునరుద్ధరణ కోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కంపెనీ రుసుం చెల్లింపునకు సిద్ధంగా లేకపోతే ఉద్యోగి తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసినా ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి రూ.88 లక్షలతో పాటు అదనంగా పౌరసత్వ దరఖాస్తులకు కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాలోని సంస్థలు ఈ ఆర్థిక భారాన్ని భరించలేక ఉద్యోగుల్ని తొలగిస్తే ఆయా ఉద్యోగులు జపాన్, యూకే, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల వైపు వెళ్లే అవకాశముంది. విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలను ఎంచుకునే అవకాశముంది.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెక్ రంగంలో అమెరికా ఆవిష్కరణలను అడ్డంకిగా మారుతుందని, భారత్‌లో ఉద్యోగాలు పెరుగుతాయని మాజీ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో అమెరికాకు నష్టం జరుగుతుందని, భారత్‌కు మేలు జరుగుతుందని చెప్పారు. టెక్ కంపెనీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు హెచ్1బీ వీసాలపై ఆధారపడుతున్నాయి. ట్రంప్ ప్రకటనతో దిగ్గజ టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు హెచ్1బీ వీసాదారులు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అమెరికాలో ఉన్న ఉద్యోగులను స్థానికంగానే పని చేయాలన్న నిబంధలను అమలు చేస్తున్నాయి. కంపెనీలు ఈ మార్పులను చట్టపరమైన సవాళ్లతో ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
టెకీలకు పెద్ద దెబ్బ
భారతదేశమే లక్ష్యం... తొలుత సుంకాలు. ఇప్పుడు హెచ్ 1 బీ వీసాలు. ఇదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు. ఇవన్నీ చూస్తుంటే ఆయన ఒక వ్యూహం ప్రకారం పని చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా కంపెనీలు అయినా.. భారతీయ కంపెనీలు అయినా భారత ఐటీ నిపుణులను ఎందుకు హెచ్1 బీ వీసాల కింద అమెరికా తీసుకెళతాయంటే తక్కువ వేతనాలే ప్రధాన కారణం. హెచ్ 1 బీ కింద తీసుకెళ్లే నిపుణుల కంటే అమెరికాకు చెందిన వాళ్లను నియమించుకుంటే ఆయా కంపెనీలు భారీ మొత్తంలో వేతనాలు చెల్లిచాల్సి ఉంటుంది. పైగా పని గంటల విషయంలో కూడా అమెరికన్లు పక్కాగా వ్యవహరిస్తారు. అదే భారత్ లేదా మరో దేశం నుంచి కేవలం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన వారు పని గంటల విషయంలో పెద్దగా పట్టించుకోరు. కంపెనీ టార్గెట్స్ ప్రకారం పని చేయటానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున భారత్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని ఈ వీసాల కింద తీసుకువెళ్లి పని చేయించుకుంటాయి. దీంతో అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయనేది ట్రంప్ వాదన.
ఈ నేపథ్యంలో ట్రంప్ స్థానికులకే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, లేదంటే ఒక్కో హెచ్ 1 బీ వీసా కింద సంవత్సరానికి లక్ష డాలర్లు ఫీజు చెల్లించండంటూ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. కనీసం మూడేళ్లకు ఇలాంటి వాళ్లను తీసుకెళ్లాలంటే కంపెనీ కేవలం ఈ ఫీజు కిందే ఏకంగా 2.70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీసా కింద తీసుకెళ్లే ఐటీ నిపుణిడికి ఇచ్చే వేతనంతో పాటు ఈ ఫీజును కూడా లెక్కించుకుని కంపెనీలు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా ఖర్చులు తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తున్న దిగ్గజ ఐటీ సంస్థలు ఇప్పుడు హెచ్ 1 బీ వీసా ఫీజు కింద ఇంత భారీ మొత్తం లో చెల్లించడానికి సిద్ధం అవుతాయా అంటే కష్టమే అని చెప్పాలి.
ట్రంప్ తాజా నిర్ణయంతో ఐటీ కంపెనీలు అసాధారణ ప్రతిభ ఉన్న వాళ్లను మాత్రమే ఇంత మొత్తంలో ఫీజు చెల్లించి అమెరికా తీసుకెళ్లి ఉద్యోగం చేయించుకుంటాయని, ఇప్పుడు ఇస్తున్నంత ఉదారంగా రాబోయే రోజుల్లో కంపెనీలు ఈ వీసాల విషయంలో వ్యవహరించే అవకాశం ఉండదని చెపుతున్నారు. ట్రంప్ కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద దెబ్బగానే చెప్పాలి. హెచ్ 1 బీ వీసాల్లో దాదాపు 70 శాతం వరకు భారతీయ నిపుణులే దక్కించుకుంటున్నారు. తర్వాత స్థానంలో చైనా ఉంది. ఇప్పటికే ఒక వైపు కాలేజీల్లో ప్రవేశాల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన ట్రంప్ భారతీయ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు అంటూ కూడా కొద్దిరోజుల క్రితం బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఆదాయార్జనే లక్ష్యం
ఇప్పుడు అందులో భాగంగానే అన్నట్లు హెచ్ 1 బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పది లక్షల డాలర్లు కడితే గోల్డ్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా 100 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలున్నాయి. హెచ్ 1 బీ వీసాల ఫీజు పెంపు, గోల్డ్ కార్డు వివరాలను అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాలను అమెరికా లోని దిగ్గజ ఐటీ కంపెనీలకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.భారత్ విషయంలో ట్రంప్ వాణిజ్య సుంకాలతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. భారత్, బ్రెజిల్‌లపైనే భారీ మొత్తంలో 50 శాతం సుంకాలు విధించారు.
