Let's talk: editor@tmv.in
భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ పేసర్

భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ పేసర్

Shaik Mohammad Shaffee
23 సెప్టెంబర్, 2025

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (74), శుభమన్ గిల్ (47) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను మెరుగుపర్చుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనూ.. మైదానం బయటా పాక్ ఆటగాళ్లకు ఎదురైన అనుభవాలు చర్చనీయాంశమయ్యాయి. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ హారిస్‌ రవూఫ్‌ వివాదాస్పద సైగలు చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

హారిస్‌ రవూఫ్‌ వివాదాస్పద సైగలు

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద పాక్ బౌలర్ హారిస్‌ రవూఫ్‌ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత అభిమానులు కోహ్లీ.. కోహ్లీ అంటూ నినదించారు. దాంతో అసహనానికి గురైన రవూఫ్‌ చేతితో 6-0 అంటూ ఒక వివాదాస్పద సైగ చేశాడు. ఇదే ఇప్పుడు భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ సైగకు ఉద్దేశం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ భారత రఫేల్ జెట్లను కూల్చివేసిందనే అబద్ధాన్ని సూచించడం. పాకిస్తాన్ సైన్యం ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేసిందని పాక్ చేస్తున్న నిరాధారమైన వాదనలకు రవూఫ్‌ ఈ సైగతో పరోక్షంగా సూచించాడని భారత అభిమానులు విమర్శించారు. రవూఫ్‌ చర్యపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అభిమానులు అతడిని విపరీతంగా ట్రోల్ చేశారు.

అహ్మదాబాద్‌లోనూ ఎదురైన అనుభవం

హారిస్‌ రవూఫ్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనూ భారత అభిమానులు అతడిని 'కోహ్లీ-కోహ్లీ' అని నినాదాలు చేస్తూ ఆటపట్టించారు. ఇప్పుడు అదే సీన్ దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. బౌండరీ వద్ద నిలబడిన రవూఫ్‌ను చూసి అభిమానులు మళ్లీ కోహ్లీ పేరుతో నినాదాలు చేశారు.

2022 టీ20 ప్రపంచ జ్ఞాపకం

ఈ నినాదాలకు ప్రధాన కారణం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మ్యాచ్‌లో లేకపోయినా, గత ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, 2022 టీ20 ప్రపంచ కప్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ సాధించిన అద్భుతమైన విజయాన్ని గుర్తు చేయడానికి అభిమానులు అతడి పేరును ఉపయోగించారు. ఆ ప్రపంచ కప్‌లో కోహ్లీ హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లోనే వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. ఈ సిక్స్‌లు కేవలం మ్యాచ్ గమనాన్ని మార్చడమే కాకుండా రవూఫ్‌ కెరీర్‌లో ఒక పీడకలగా మిగిలిపోయాయి. ఈ సంఘటనను గుర్తు చేస్తూ అభిమానులు రవూఫ్‌ను ఆటపట్టించడం.. అతడి ప్రవర్తనకు తగిన సమాధానమని అనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్‌లో వివాదాస్పద సైగలతో పాటు, రవూఫ్‌ భారత ఓపెనర్ అభిషేక్ శర్మతోనూ వాగ్వాదానికి దిగాడు. ఐదవ ఓవర్ చివరి బంతి వద్ద గిల్ ఒక షాట్ కొట్టి బంతిని ఫోర్ కొట్టాడు. ఓవర్ ముగిసిన తర్వాత అభిషేక్, రవూఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అంపైర్ గాజీ సోహెల్ జోక్యం చేసుకుని వారిద్దరి గొడవను ఆపారు. అంతేకాదు మరో పాక్ ఆటగాడి విజయోత్సవ సైగ కూడా వివాదాస్పదమైంది. సాహిబ్జాదా ఫర్హాన్, భారత బౌలింగ్ దాడిని ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో అతడు తన బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని బ్యాట్‌ను గురి పెట్టినట్లు సైగ చేశాడు. ఈ సైగ కూడా భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ పేసర్ - Tholi Paluku