
భారత్‌తో సిరీస్‌కు షామర్ జోసెఫ్ దూరం
భారత్‌తో జరగనున్న కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ షామర్ జోసెఫ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో కరేబియన్ జట్టులో ఇంతవరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని యువ ఆల్‌రౌండర్ జోహన్ లేయిన్‌కు చోటు దక్కింది. అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
షామర్ జోసెఫ్ సిరీస్‌కు దూరమైన విషయాన్ని విండీస్ క్రికెట్ ‘ఎక్స్' ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే, 26 ఏళ్ల జోసెఫ్‌కు ఎలాంటి గాయం అయిందనే వివరాలను బోర్డు వెల్లడించలేదు. అక్టోబర్ 18వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ సమయంలో జోసెఫ్‌పై మళ్లీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు విండీస్ బోర్డు పేర్కొంది.
గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జోసెఫ్ ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ ఆడిన 11 టెస్టుల్లో 21.66 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు. అతడి ఫాస్ట్ బౌలింగ్, వికెట్లు తీసే సామర్థ్యం వెస్టిండీస్ జట్టుకు కీలకంగా మారాయి. ముఖ్యంగా జోసెఫ్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు.
జోహన్ లేయిన్ గురించి
జోసెఫ్ స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల జోహన్ లేయిన్, బార్బడోస్‌కు చెందిన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటివరకు ఆడిన 19 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 495 పరుగులు చేసి, 22.28 సగటుతో 66 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనత కూడా ఉంది. జోసెఫ్ లేని లోటును లేయిన్ ఏ మేరకు భర్తీ చేస్తాడో చూడాలి.
