Let's talk: editor@tmv.in
భార‌త్‌తో యుద్ధానికి సౌదీ మ‌ద్ద‌తిస్తుంది

భార‌త్‌తో యుద్ధానికి సౌదీ మ‌ద్ద‌తిస్తుంది

Venkatesh Balusula
21 సెప్టెంబర్, 2025

ఖ‌తార్‌లో ముస్లిం దేశాల భేటీ అనంత‌రం ఇటీవ‌ల పాకిస్థాన్‌, సౌదీ అరేబియా మధ్య కీల‌క ర‌క్ష‌ణ ఒప్పందం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా అసిఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌తో యుద్ధం జ‌రిగితే సౌదీ అరేబియా త‌మ‌కు మ‌ద్దుతిస్తుంద‌ని తెలిపారు. ఇటీవ‌లి కాలంలో భార‌త్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌తలు చోటు చేసుకున్నాయి. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి దానికి ప్ర‌తీకారంగా భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ ఘ‌ట‌న‌ల‌తో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. ఈ త‌రుణంలో పాక్ ర‌క్ష‌ణ మంత్రి వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఖ‌వాజా అసిఫ్ స్థానిక మీడియాతో సౌదీ ర‌క్ష‌ణ ఒప్పందం గురించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా ప్ర‌తినిధి భార‌త్‌తో ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డితే సౌదీ స‌హ‌కారం అందిస్తుందా? అని ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానంగా అసిఫ్‌ భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ అరేబియా తమకు మద్దతిస్తుందని చెప్పారు. "ఖచ్చితంగా, ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని అన్నారు. ఈ ఒప్పందంలో "వ్యూహాత్మక పరస్పర సహాయం" అనేది కీల‌క అంశంగా ఉంది. ఈ మేర‌కు రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జ‌రిగినా ఇరు దేశాలపై దాడిగా ప‌రిగ‌ణిస్తారు. దీనిపై రెండు దేశాలు క‌లిసి స్పందిస్తాయి. ఆప‌రేష‌న్ సిందూర్‌లో భార‌త సైన్యం పాక్‌లోని ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు చేసి నాశ‌నం చేసింది. ప్ర‌స్తుతం వీటిని పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్లు భార‌త నిఘా వ‌ర్గాలు గుర్తించాయి. ఈ సంద‌ర్భంలో పాక్ ర‌క్ష‌ణ‌ మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌ళ్లీ ఏమైనా కుట్ర‌ల‌కు తెర‌లేపుతున్నారా అన్న అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. రియాద్‌లో జ‌రిగిన పాక్‌, సౌదీ ర‌క్ష‌ణ ఒప్పందం ద‌శాబ్దాల పాటు కొన‌సాగ‌నుంది. రెండు దేశాల మ‌ధ్య అణ్వ‌స్త్రాలు, ర‌క్ష‌ణ స‌హ‌కారం పెంపొందించ‌నున్నారు. ఈ ఒప్పందంలోకి మ‌రిన్ని దేశాలు చేరే అవ‌కాశం ఉంది. ఖ‌తార్‌పై ఇజ్రాయెల్ దాడి అనంత‌రం ముస్లిం దేశాలు ఏక‌మ‌వుతున్న సంకేతమిస్తున్నాయి.

భార‌త విదేశాంగ శాఖ ఈ ఒప్పందంపై విశ్లేష‌ణ చేస్తోంది. సౌదీకి భార‌త్‌తో సైతం మంచి సంబంధాలున్నాయి. ఈ నేప‌థ్యంలో పాక్‌తో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటే సౌదీ ఏ విధంగా స్పందిస్తున్న‌దానిపై ఆస‌క్తి నెల‌కొంది. జాతీయ భద్రత, ప్రాంతీయ, అంత‌ర్జాతీయ‌ స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. భార‌త‌ విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య జ‌రిగిన‌ ఈ ఒప్పందం గురించి ముందే తెలుస‌న్నారు. ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఒప్పందానికి కొన‌సాగింపుగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఒక దేశంతో విబేధాలు, మ‌రో దేశంతో స‌త్సంబంధాలున్న నేప‌థ్యంలో భార‌త్‌పై ఈ ఒప్పందం ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న‌ది భ‌విష్య‌త్తులో తేల‌నుంది.

భార‌త్‌తో యుద్ధానికి సౌదీ మ‌ద్ద‌తిస్తుంది - Tholi Paluku