Let's talk: editor@tmv.in
భారత్‌కు రానున్న ఉసేన్ బోల్ట్

భారత్‌కు రానున్న ఉసేన్ బోల్ట్

Shaik Mohammad Shaffee
23 సెప్టెంబర్, 2025

అంతర్జాతీయ అథ్లెటిక్స్ దిగ్గజం, ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ఉసేన్ బోల్ట్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ కోసం అక్టోబర్ 1న భారతదేశానికి వస్తున్నారు. ముంబైలో జరగనున్న ఒక ప్రత్యేక ఫుట్‌బాల్ ప్రదర్శనలో తన రన్నింగ్ స్పైక్స్‌ను పక్కనపెట్టి ఫుట్‌బాల్ బూట్లతో మైదానంలోకి దిగనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను పుమా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ మ్యాచ్‌లో దేశంలోని అగ్రశ్రేణి ఫుట్‌బాల్ క్రీడాకారులు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మ్యాచ్‌లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, బోల్ట్ బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ అనే రెండు జట్లకూ ప్రాతినిధ్యం వహిస్తారు. అభిమానులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా బోల్ట్ ఒక్కో అర్ధభాగం ఒక్కో జట్టు తరఫున ఆడతారు.

ఈ విషయంపై పుమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బాలగోపాలన్ స్పందించారు. ’ఫుట్‌బాల్ భారతదేశ యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటి. ఈ క్రీడకు మరింత గ్లో తీసుకొస్తూ మా గ్లోబల్ అంబాసిడర్ ఉసేన్ బోల్ట్‌ను ఇక్కడికి తీసుకొస్తున్నాం. బోల్ట్ ముంబై మైదానంలో దిగడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని అన్నారు. భారతదేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

అథ్లెటిక్స్‌కు మించి ఉసేన్ బోల్ట్‌కు ఫుట్‌బాల్‌ అంటేనే ఇష్టం. చిన్నప్పటి నుంచి బోల్ట్ ఈ ఆట ఆడుతూ తన వేగం, నైపుణ్యాలను ఫుట్‌బాల్ మైదానంలో ప్రదర్శించాలని కలలు కనేవాడు. అథ్లెటిక్స్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా బోల్ట్ ఈ క్రీడ పట్ల తనకున్న ప్రేమను కొనసాగిస్తున్నాడు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ టిక్కెట్‌తో కూడిన ఈవెంట్ అని, టిక్కెట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ అద్భుతమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌కు రానున్న ఉసేన్ బోల్ట్ - Tholi Paluku