
భారత్‌కు ఆ అవసరం లేదు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు ఏ మాత్రం మారడం లేదు. ‘పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా’ ఒకే విషయాన్ని పదే పదే వల్లే వేస్తున్నాడు. పాక్, భారత్ మధ్య తానే యుద్ధాన్ని ఆపానని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ ట్రంప్ తీరులో మార్పు లేదు.
తాజాగా ఓ కార్యక్రమంలోనూ ట్రంప్ ఇదే రకంగా మాట్లాడారు. అయితే ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగానే ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారేమోనన్న సందేహాలు వ్యక్తమవ్యాయి. ఇక విపక్షాలు మాత్రం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి.
భారత్, పాక్ మధ్య యుద్ధం లేదా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినట్టు ట్రంప్ ప్రకటించడం అంటే అది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ కాంగ్రెస్ నేత ట్రంప్‌ను విమర్శించారు. యుద్ధం ఆపాలంటూ అమెరికాను ప్రాదేయపడాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నామని.. మొదటి రోజే సాధించామని అన్నారు. అందుకే భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ఆపిందని చెప్పారు.
"మాకు ఎప్పుడూ అమెరికాను ఒప్పించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే మేము ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెప్పాం. అందుకనుగుణంగానే మా లక్ష్యాలు నెరవేర్చుకున్నాం. పాకిస్థాన్ మా మీద దాడి చేస్తే, మేము తిరిగి దాడి చేస్తాం. వారు ఆపేస్తే, మేము కూడా ఆపేస్తాం. అందుకే పాకిస్థాన్ ప్రభుత్వం మా డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)కు ఫోన్ చేసి 'మేము ఆపేయాలనుకుంటున్నాం' అని చెప్పినప్పుడు మేము అందుకు అంగీకరించాం’ అంటూ శశి థరూర్ చెప్పుకొచ్చారు.
భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్‌గాం దాడిలో 26 మంది పౌరులు మరణించినందుకు ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. నాలుగు రోజుల తీవ్రమైన సరిహద్దు డ్రోన్, మిస్సైల్ దాడుల తర్వాత మే 10న భారత్-పాకిస్థాన్ యుద్ధ విరమణకు అంగీకరించాయి. భారత్-పాకిస్థాన్ సైనిక డీజీఎంఓల మధ్య నేరుగా చర్చల ద్వారానే యుద్ధ విరమణకు అంగీకారం జరిగిందని భారత్ మొదటి నుంచి చెబుతున్నది. కానీ అమెరికా అధ్యక్షుడి ప్రకటన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
