Let's talk: editor@tmv.in
భరణం దాతృత్వం కాదు.. భార్య చట్టబద్ధమైన హక్కు: ఏపీ హైకోర్టు

భరణం దాతృత్వం కాదు.. భార్య చట్టబద్ధమైన హక్కు: ఏపీ హైకోర్టు

Panthagani Anusha
18 ఫిబ్రవరి, 2026

విడిపోయిన భార్యకు భర్త చెల్లించే భరణం అనేది ఏదో దాతృత్వంతో చేసే సాయం కాదని అది ఆమెకు ఉన్న చట్టబద్ధమైన హక్కు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, న్యాయం మంచి మనస్సాక్షి వంటి విలువలను కాపాడటంలో భరణం కీలక పాత్ర పోషిస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు గతంలో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ జస్టిస్ వై. లక్ష్మణరావు కీలక తీర్పు వెలువరించారు.

కేసు నేపథ్యం

చిన్నన్ కిషోర్ కుమార్, కిరణ్మయి స్మైలీ దంపతుల మధ్య తలెత్తిన వైవాహిక విభేదాల కారణంగా వారు కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా తనను తన మైనర్ కుమారుడిని భర్త పట్టించుకోవడం లేదని, కనీస పోషణ కూడా కల్పించడం లేదని పేర్కొంటూ కిరణ్మయి గతంలో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కింది కోర్టు.. 2018 మార్చి 3న భార్యకు నెలకు రూ.7,500, కుమారుడికి రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది.

హైకోర్టులో సవాల్

అయితే కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ భర్త కిషోర్ కుమార్ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. కింది కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆయన వాదించారు. భరణం కింద నిర్ణయించిన మొత్తం తన స్తోమతకు మించి ఉందని ఇప్పటికే భార్య తనపై పలు న్యాయపరమైన చర్యలు చేపట్టిందని పేర్కొంటూ ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

చిన్నన్ కిషోర్ కుమార్ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు.. భరణం అనేది ఒక వ్యక్తి ఇచ్చే బహుమతి కాదని అది బాధితులకు ఉండే నిరంతర హక్కు అని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3), 39 ప్రకారం మహిళలు, పిల్లలు వంటి బలహీన వర్గాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది. చట్టబద్ధంగా పోషించాల్సిన బాధ్యత ఉన్నవారు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏ భార్య, బిడ్డ కూడా పేదరికంలో మగ్గకూడదనేదే న్యాయవ్యవస్థ సంకల్పమని జస్టిస్ లక్ష్మణరావు వ్యాఖ్యానించారు.

కుటుంబ న్యాయస్థానం నిర్ణయం సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ఉందని అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. భర్త దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో నిర్ణయించిన భరణం మొత్తాన్ని నిరంతరాయంగా చెల్లించాలని ఆదేశించింది.