
భయం వద్దు.. భరోసా ఇస్తున్న హైడ్రా
యూఎల్‌సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్) భూముల్లో వెలసిన పాత లేఅవుట్లలో ఇళ్లు ఉన్నా, లేదా రెగ్యులరైజ్ కానీ ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి హైడ్రా వెళ్లదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. కొంతమంది కబ్జాదారులు హైడ్రా పేరు చెప్పి తక్కువ ధరకు స్థలాలను చేజిక్కించుకోవాలని చూస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నగర ప్రజలను కోరారు.
యూఎల్‌సీ భూముల్లోని లేఔట్లలో రహదారులు, పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను మాత్రమే హైడ్రా కాపాడుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో ఆక్రమణలు జరిగితే వాటిని తొలగించే చర్యలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. హైడ్రా ఏర్పాటు కంటే ముందే (19-07-2024) నిర్మించబడిన ఇళ్లను కూల్చబోమని గతంలోనే అనేకసార్లు చెప్పినట్టు గుర్తుచేసింది.
ఇటీవల శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని పలు యూఎల్‌సీ లేఔట్లలో పార్కులు, రహదారులు, ప్రజా అవసరాల స్థలాలపై జరిగిన ఆక్రమణలను తొలగించినట్లు తెలిపింది. రాజరాజేశ్వరినగర్, ఓయూ కాలనీ, రాఘవేంద్ర కాలనీ ప్రాంతాల్లో జరిగిన చర్యలు ఇందుకు ఉదాహరణలని పేర్కొంది. అలాగే కూకట్‌పల్లి మండలం హైదర్‌నగర్‌లోని గోపాల్‌నగర్ లేఔట్‌లో పార్కును కూడా రక్షించినట్లు వివరించింది.
ఇదే సమయంలో, యూఎల్‌సీ లేఔట్లలోని రెగ్యులరైజ్ కాని ప్లాట్లను హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగిస్తుందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఇలాంటి ప్రచారం వెనుక ప్రజల స్థలాలను తక్కువ ధరకు సొంతం చేసుకునే కుట్ర ఉందని హెచ్చరించింది. ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించి స్పష్టత పొందాలని నగర ప్రజలకు కమిషనర్ సూచించారు.
