Let's talk: editor@tmv.in
భయం, అవినీతే బెంగాల్ గుర్తింపు: అమిత్ షా

భయం, అవినీతే బెంగాల్ గుర్తింపు: అమిత్ షా

Pinjari Chand
31 డిసెంబర్, 2025

పశ్చిమ బెంగాల్‌లో గత 14 ఏళ్లుగా భయం, అవినీతినే రాష్ట్రానికి గుర్తింపుగా మారాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం కోల్కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మమత ప్రభుత్వ అవినీతి కారణంగా బెంగాల్‌లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని అమిత్ షా ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ ఇక్కడ టోల్ సిండికేట్ కు బలవుతున్నాయని అన్నారు. భయం, అవినీతి గత 14 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌కు గుర్తింపుగా మారాయి. 2026 ఏప్రిల్ 15 తర్వాత బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాష్ట్ర వారసత్వం, సంస్కృతి పునరుజ్జీవనానికి శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు.

అక్రమ చొరబాటుపై తీవ్ర ఆరోపణలు

అసోం, త్రిపురాల్లో అక్రమ చొరబాట్లు నిలిచిపోయినా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం కొనసాగుతున్నాయని అమిత్ షా అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మమత బెనర్జీ అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని, ఓటు బ్యాంకు విస్తరణే దీని వెనుక ఉన్న ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. సరిహద్దు కంచె నిర్మాణానికి భూమి ఇవ్వని ప్రభుత్వం ఎవరిది? మీ ప్రభుత్వమే. అక్రమ వలసదారులు ముందుగా బెంగాల్‌లోకే ఎందుకు వస్తున్నారు? పట్వారీలు, పోలీస్ స్టేషన్లు ఏమి చేస్తున్నాయి? అసోం, త్రిపురాల్లో చొరబాట్లు ఆగిపోయి, బెంగాల్‌లోనే ఎందుకు జరుగుతోంది? అంటూ మమత ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

జాతీయ భద్రత సమస్యగా చొరబాట్లు

పశ్చిమ బెంగాల్ సరిహద్దుల ద్వారా జరుగుతున్న అక్రమ చొరబాట్లు కేవలం రాష్ట్ర సమస్య కాదని, ఇది జాతీయ భద్రతకు ముప్పు అని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్ సరిహద్దులను పటిష్టంగా మూసివేయగలిగేది బీజేపీ ప్రభుత్వమేనని, టీఎంసీకి అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.

భారీ మెజార్టీతో 2026లో బీజేపీ ప్రభుత్వం

రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండు మూడొంతుల మెజార్టీతో అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2014లో బీజేపీకి 17 శాతం ఓట్లు, రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చాయని, 2016లో మూడు అసెంబ్లీ సీట్లకు పరిమితమైందని గుర్తు చేశారు. 2019లో 41 శాతం ఓట్లతో 18 లోక్‌సభ సీట్లు, 2021లో 77 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 39 శాతం ఓట్లతో 12 సీట్లు సాధించామని పేర్కొన్నారు. 2026లో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ ఆపలేరని అమిత్ షా అన్నారు.