

భద్రాద్రి సీతారాముల కళ్యాణం - తెలంగాణ ఆత్మ గౌరవం
భారతీయ సంస్కృతిలో కొన్ని క్షేత్రాలు కేవలం భక్తి కేంద్రాలుగానే గాక, ఒక జాతి అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అటువంటి అరుదైన పుణ్యధామం భద్రాచలం. గోదావరి తీరాన కొలువై, 'దక్షిణ అయోధ్య'గా ప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రం, శతాబ్దాల చరిత్రకు, పాలకుల భక్తికి, ప్రజాకవి రామదాసు ఆత్మనివేదనకు సజీవ సాక్ష్యం. ప్రతియేటా చైత్ర శుద్ధ నవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం కేవలం ఒక ధార్మిక కార్యక్రమం కాదు. అది తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ, శతాబ్దాల సంప్రదాయాల సమ్మేళనం.
ఆధ్యాత్మికత, పరంపర, భక్తి, రాజసం, కలిసిన శతాబ్దాల సంస్కృతి. గోదావరి తీరాన ప్రతీ సంవత్సరం జరిగే ఈ దివ్య కళ్యాణం, భక్తులకు మాత్రమే కాదు, రాష్ట్రానికే ఆధ్యాత్మిక గౌరవ చిహ్నం. తానీషా కాలం నుంచి ఇప్పటి ప్రభుత్వాల వరకు కొనసాగుతున్న అధికారిక ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పణ భద్రాద్రి దేవుడికి రాజ్యమే శాశ్వత సేవకుడిగా ఉన్నదనడానికి ఒక గుర్తు. భగవంతుడి వివాహానికి రాజవంశాలు నుండి ఆధునిక పాలకుల వరకు తమ వంతు సేవ అర్పించిన ఈ పవిత్ర ఆచారం, భక్తి, భారతీయతల పునాది మీద నిలిచిన శాశ్వత సంప్రదాయానికి అద్భుత ప్రతిరూపం.
ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం తూర్పుభాగంలోని భద్రాచల పట్టణంలో, గోదావరి నదీ తీరాన ఉంది. సాధారణంగా భద్రాచలం అని, భద్రగిరి, భద్రాద్రి అని కూడా పిలుస్తారు. ఇది గోదావరి నదీ తీర దివ్యక్షేత్రాలలో ఒకటిగా అలరారుతుంది. ఈ ప్రాంతం రామాయణంతో అతి సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ఇక్కడే రాముడు అరణ్యవాస సమయంలో గోదావరి సమీపంలో ఆశ్రయం తీసుకున్నారని, సీతమ్మను రావణుడు అపహరించిన ప్రదేశం ఈ అరణ్య ప్రాంతమే అని చెబుతారు.
ఆలయ చరిత్ర నిర్మాణం
మేరు పర్వత పుత్రుడైన భద్రుడు, శ్రీరామునిపై అపారమైన భక్తితో గోదావరి తీరాన ఘోర తపస్సు చేశాడు. రాముడు సీతమ్మను రాక్షస రాజు రావణుడి వద్ద నుంచి తిరిగి తీసుకువచ్చిన తరువాత తనను కలుస్తానని భద్రునికి మాట ఇచ్చాడు. అయితే తన అవతార కాలంలో రాముడు ఆ మాట నెరవేర్చలేకపోయాడు. త్రేతాయుగంలో వనవాస సమయంలో తనను అనుగ్రహిస్తానని రాముడు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి, ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభ వేళలో వైకుంఠ రామునిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ క్షేత్రంలోని విగ్రహం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా రాముడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు, గర్భగుడిలోని ప్రధాన విగ్రహం చతుర్బుజ వైకుంఠరామునిగా ధర్శనమిస్తుంది. శంఖు చక్రాలను ధరించి, సీతమ్మను తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని, లక్ష్మణుని సమేతంగా పశ్చిమాభిముఖంగా కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. దేవాలయానికి నాలుగు దారులు ఉన్నాయి. ఉత్తరద్వారం వైకుంఠ ద్వారం, అక్కడే రాజగోపురం ఉంది. ప్రధాన దేవుడైన శ్రీరాముడు కారణంగా భద్రాచలం అత్యంత విశిష్ట క్షేత్రంగా నిలుస్తుంది.
ధమ్మక్క భక్తి - రామదాసు సంకల్పం
కాలక్రమేణా అడవిలో కలిసిపోయిన ఈ విగ్రహాలను 17వ శతాబ్దంలో పోకల ధమ్మక్క అనే గిరిజన మహిళ (శబరి వంశీయురాలిగా భావిస్తారు) కనుగొన్నట్లు స్థానిక కథనం. అయితే, నేడు మనం చూస్తున్న భవ్యమైన ఆలయ రూపాన్ని తీర్చిదిద్దింది మాత్రం కంచర్ల గోపన్న, అనగా భద్రాచల రామదాసు.
గోల్కొండ నవాబు అబుల్ హసన్ కుతుబ్ షా (తానీషా) కాలంలో భద్రాచలం తహసీల్దార్‌గా పనిచేసిన గోపన్న, భగవంతుని మందిరం శిథిలావస్థలో ఉండటం చూసి చలించిపోయారు. ప్రజల నుంచి వసూలు చేసిన ఆరు లక్షల వరహాల పన్ను సొమ్మును ప్రభుత్వ అనుమతి లేకుండా ఆలయ పునర్నిర్మాణానికి ఖర్చు చేశారు. ఈ 'అపరాధానికి' గాను ఆయన 12 ఏళ్ల పాటు గోల్కొండ కోటలో కారాగార వాసం అనుభవించారు. ఆ చీకటి గదుల్లో నుంచే ఆయన జాలువార్చిన దాశరథి శతకము, రామదాసు కీర్తనలు నేటికీ కర్ణాటక సంగీతంలో ఆణిముత్యాలుగా నిలిచి ఉన్నాయి.
"పాహి రామప్రభో.. పాహి రామప్రభో.. అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.." వంటి కీర్తనలు రామదాసు ఆర్తికి, శరణాగతికి నిదర్శనాలు.
రామదాసు తన కీర్తనలతో కర్ణాటక సంగీత సంప్రదాయంలో అగ్రగణ్య కీర్తనకారుడిగా పేరుగాంచారు. అతని కీర్తనలు ప్రధానంగా రామభక్తి ఆధారంగా ఉండి, పల్లవి, అనుపల్లవి, చరణం రూపకల్పనలో ప్రసిద్ధి చెందాయి. సంగీత ముద్రలు ‘రామదాసు’, ‘భద్రాచలవాస’, ‘భద్రాద్రి’, ‘భద్రగిరి’ వంటి పేర్లతో కనిపిస్తాయి. ఆయన రచనల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది. 15వ శతాబ్దం వైష్ణవ సంతుడు కబీర్ దాసు తెలంగాణలో సంచరిస్తూ గోపన్న భక్తిని చూసి అతనికి రామదాసు అనే బిరుదు ఇచ్చాడని అప్పటినుండి గోపన్న రామదాసుగా మారాడని చెబుతారు.
అప్పట్లో భద్రాచలం దేవాలయం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1860లో చుట్టుపక్కల భూములు బ్రిటిష్ పాలనకు వెళ్లినా, ఆలయం మాత్రం నిజాం రాష్ట్రంలోనే నిలిచింది. పాల్వంచ సంస్థానానికి ఆ భూముల హక్కులు ఉండేవి. 1959లో ఈ ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో విలీనం అయ్యాయి. 1958లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆలయ నిర్వహణను చేపట్టింది.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో భద్రాచలం తెలంగాణాదా, ఆంధ్రప్రదేశ్‌దా అన్న వివాదం లేచింది. తెలంగాణ నేతలు, కార్యకర్తలు భద్రాచలాన్ని తెలంగాణలో నిలుపుకోవాలని బలంగా ప్రయత్నించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత, 2016లో, భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమైంది.
ముత్యాల తలంబ్రాల పరంపర
భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర మాస శుద్ధ నవమి రోజున, అభిజిత్ లగ్నంలో జరిగే దివ్య వైభవోత్సవం. అలాగే శ్రీరామ పట్టాభిషేకం ఒక అపూర్వ ఘట్టం. ఈ వేళ భద్రాద్రి మొత్తం అగస్త్య మహర్షి స్తుతులతో ప్రతిధ్వనించినట్టు, వేకువజామునుంచే భక్తుల సందడి మొదలౌతుంది. వరుడు శ్రీ రాముడు, వధువు సీతమ్మ రాజసంగా అలంకరించబడి స్వర్ణవేదికపై కళ్యాణ ఘట్టం తో ఒక్కటవుతారు. వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలతో కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక ఆనందస్వరూపంగా మారుతుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించినవారికి లోక పరలోకాల శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.
భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తలంబ్రాలు పంపే సంప్రదాయం తానీషా పాలనకాలం నుండి అనువర్తిస్తూ వస్తున్న ప్రత్యేక ఆధ్యాత్మిక పారంపర్య పరంపర. శ్రీరాముడికి భక్తుడైన కుతుబ్‌షాహీ రాజు తానీషా, భద్రాచల దేవస్థానానికి భక్తితో బంగారం, ధాన్యాలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపడం ప్రారంభించాడని, అప్పటి నుంచి ఆనవాయితీ ప్రకారం నిజాం ప్రభుత్వం, ఆ తర్వాత హైదరాబాదు రాష్ట్రం, అనంతరం ఆంధ్రప్రదేశ్, తరవాత తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఆచారాన్ని నిలబెట్టాయి. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ నవమినాడు జరిగే కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధి రావడం, అధికారికంగా పసుపు, కుంకుమ, సారెలు, చీరలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ చేయడం, రాజ్యమే వధువుకు బంధువులా వచ్చి ఆశీర్వాదం అందిస్తున్నట్టుగా భావిస్తారు.
ఈ ఏడాది మార్చి 27న జరిగే కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:31 వరకు పునర్వసు నక్షత్ర సమయములో అభిజిత్ లగ్నం ముహూర్త సమయంగా నిర్ణయించారు. ఈ కళ్యాణనికి గోటి తలంబ్రాలు వాడతారు. యంత్రాల సహాయం లేకుండా భక్తులు స్వయంగా గోళ్లతో వొలిచిన బియ్యంతో తలంబ్రాలను సిద్ధం చేస్తారు. అలాగే ప్రతీ ఏటా ఉన్నట్టే సీతమ్మకు అలంకరించే మంగళసూత్రంలో మూడు బిళ్లలు ఉంటాయి. ఇవి దశరథుడు, జనక మహారాజు, భక్త రామదాసులను సూచిస్తాయి (రామదాసు సీతమ్మను తన కూతురిగా భావించి చేయించిన కానుక).
ఈ ఆచారం, రాములోరి కళ్యాణం పట్ల ప్రభుత్వం చూపించే గౌరవాన్ని, భద్రాద్రి శ్రీరామునిపై ప్రతిబింబించే భక్తి విశ్వాసాన్నితెలుపుతుంది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణాన్ని దర్శించడానికి భద్రాచలం తరలివస్తారు. అన్ని సోషల్ మీడియా న్యూస్ ఛానళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. భద్రాచలం వెళ్లలేని వారు ఈ ప్రసారాలను చూసి తరిస్తారు. అంగరంగ వైభవంగా సాగే ఈ కార్యక్రమం ప్రతీ సంవత్సరం ఒక అద్బుత ఘట్టం.
సీతారాముల కల్యాణంతో పాటు శ్రీరామ పట్టాభిషేకం, భజనలు, ఊరేగింపులు, పానకం, వడపప్పు ప్రసాదాల పంపిణీ ఉంటుంది. అనంతరం శోభాయాత్ర, సంధ్యా సమయంలో గోదావరిలో తెప్పోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తరువాత బ్రహ్మోత్సవాలు పుష్పయాగంతో ముగుస్తాయి. కొందరు భక్తులు 9 రోజుల చైత్ర నవరాత్రుల ముగింపును ఈ నవమి రోజు జరుపుకుంటారు.
పర్యాటక ఆకర్షణలు - పరిసర ప్రాంతాలు
భద్రాచలం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా పర్ణశాలను సందర్శిస్తారు. రాముడు వనవాస కాలంలో ఇక్కడే పర్ణశాల నిర్మించుకున్నారని, రావణుడు సీతమ్మను అపహరించింది ఇక్కడి నుండేనని నమ్ముతారు. ఇక్కడ రాముని పాదముద్రలు, సీతమ్మ వారు బట్టలు ఆరవేసినట్లు చెప్పే గుర్తులు నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తాయి.
అలాగే భద్రాచలం నుండి ప్రారంభమయ్యే పాపికొండల మద్య లాంచీ ప్రయాణం, గోదావరి నది మలుపులు, చుట్టూ దట్టమైన అడవులు, కొండల మధ్య సాగుతూ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. అంతేకాదు దుమ్ముగూడెం దగ్గర గోదావరిపై ఉన్న ఆనకట్ట, పరిసర ప్రాంతాల్లోని గిరిజన సంస్కృతి ఎంతో విశిష్టమైనవి.
రవాణా:
భద్రాచలం రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా మెరుగైన రవాణా సౌకర్యాలను కలిగి ఉంది. హైదరాబాద్ (320 కి.మీ), విజయవాడ (180 కి.మీ), రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల నుండి నేరుగా బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉండగా, రైలులో వచ్చే వారికి 40 కి.మీ దూరంలోని భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్ ప్రధాన ఆధారంగా ఉంది. విమాన ప్రయాణికులు రాజమండ్రి, విజయవాడ లేదా హైదరాబాద్ విమానాశ్రయాల నుండి టాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
వసతి:
దేవస్థానం వారి సత్రాలతో పాటు, అనేక ప్రైవేట్ హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు 'అన్నప్రసాదం' సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
దర్శన సమయాలు:
తెల్లవారుజామున 4:30 నుండి రాత్రి 9:00 వరకు ఆలయం తెరిచి ఉంటుంది (కళ్యాణం రోజున మార్పులు ఉండవచ్చు).
భద్రాచలం అంటే కేవలం ఒక గుడి కాదు, అది ఒక సంస్కృతి. రామదాసు కీర్తనలలో ప్రతిధ్వనించే భక్తి, గోదావరి అలలలో వినిపించే ప్రశాంతత, తానీషా కాలం నాటి మత సామరస్యం - ఇవన్నీ కలిపి భద్రాద్రిని తెలంగాణ ఆధ్యాత్మిక కిరీటంగా నిలబెట్టాయి. ప్రతి తెలుగువాడు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన, పునీతం కావాల్సిన దివ్య క్షేత్రం భద్రాచలం.
