
భద్రాద్రి రామయ్య కల్యాణానికి రండి.. గవర్నర్‌కు మంత్రి ఆహ్వానం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 27న జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారికంగా ఆహ్వానించారు. సోమవారం లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన మంత్రి, ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
భద్రాచలం రామయ్య కల్యాణం రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ అని, దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ వేడుకను వీక్షించేందుకు తరలివస్తారని మంత్రి గవర్నర్‌కు వివరించారు. ఈ వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని ఆమె హామీ ఇచ్చారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్‌ను ఆశీర్వదించి, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి రామయ్య కల్యాణానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
