Let's talk: editor@tmv.in
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా 32 మందికి తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా 32 మందికి తీవ్ర గాయాలు

Gaddamidi Naveen
3 జనవరి, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 32 మంది విద్యార్థులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిందిలా..

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8:50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఒక ఫ్యాకల్టీ సభ్యుడు ప్రమాదం జరిగిన విషయాన్ని తనకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఒకే మార్గం ఉన్న రోడ్డుపై బస్సుకు ఎదురుగా ఒక బైక్ రావడంతో, దానిని తప్పించబోయిన డ్రైవర్ స్టీరింగ్‌ను ఒక్కసారిగా ఎడమ వైపు తిప్పారు. దీంతో నియంత్రణ కోల్పోయిన బస్సు రోడ్డు పక్కకు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే కళాశాల యాజమాన్యం పోలీసులు 108 అత్యవసర సేవలకు సమాచారం అందించింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన పూర్తిగా అనుకోకుండా జరిగిందని, కళాశాల వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదని ఆయన తెలిపారు. బస్సు మంచి స్థితిలోనే ఉందని, డ్రైవర్ కూడా నెమ్మదిగానే నడుపుతున్నాడని చెప్పారు. గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులన్నీ కళాశాల యాజమాన్యమే భరిస్తుందని తెలిపారు.

భద్రాద్రి ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మొత్తం 32 మంది గాయపడిన వారు ఆసుపత్రికి తీసుకురాగా, అందులో 24 మందికి స్వల్ప గాయాలు కాగా ప్రథమ చికిత్స అందించినట్లు తెలిపారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రిలో చేర్చి పరిశీలనలో ఉంచామన్నారు. వీరిలో ఒకరికి ఛాతీలో నొప్పి ఉండటంతో ఐసీయూలో ఉంచినట్టు చెప్పారు. మిగతా వారిలో ముగ్గురిని యాజమాన్యంతో చర్చించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మిగతా విద్యార్థులను 5, 6 గంటల పరిశీలన అనంతరం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు.

అశ్వాపురం పోలీస్ అధికారి తెలిపిన ప్రకారం, కళాశాలకు వెళ్తున్న సమయంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.