Let's talk: editor@tmv.in
భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో అటవీ బీట్ అధికారి మృతి

భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో అటవీ బీట్ అధికారి మృతి

Gaddamidi Naveen
13 ఆగస్టు, 2026

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉచ్చుకు అటవీశాఖ బీట్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద నాన్-కల్పబుల్ హోమిసైడ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

నాకిరేపేట అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం విద్యుత్‌ తీగలతో ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు మంగళవారం రాత్రి అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో బీట్‌ అధికారి నవీన్‌ నాయక్‌తో పాటు మరో ముగ్గురు అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఆ ప్రాంతంలో చీకటిగా ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయిన నవీన్‌ అనుకోకుండా విద్యుత్‌ తీగలను తాకారు. దీంతో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే నవీన్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన నవీన్‌ నాయక్‌ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో అటవీశాఖలో విషాదం నెలకొంది.

ఈ ఘటనపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై అటవీ, పోలీసు అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న అటవీ సిబ్బంది భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నవీన్‌ నాయక్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందించాలని, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (పీసీసీఎఫ్‌) వినయ్‌ కుమార్‌ను మంత్రి ఆదేశించారు.

ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తీవ్ర సంతాపం తెలిపారు. అటవీ జంతువులను వేటాడటానికి విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని, మూగజీవాలను చంపే ప్రయత్నాలు మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో అటవీ బీట్ అధికారి మృతి - Tholi Paluku