
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. జూలై 31 మధ్యాహ్నం 1 గంట సమయానికి నీటిమట్టం 45.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ & ఔట్ ఫ్లో 2,36,870 క్యూసెక్కులుగా ఉంది. ఇక్కడ శుక్రవారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక, శనివారం ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. లోతట్టు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో స్నానం చేయడం, చేపలు పట్టడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే వరద నీరు ప్రవహిస్తున్న రహదారులపై ప్రయాణాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
